నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో..ఎర్రమల్లెలుకు 40 ఏళ్ళు
పుచ్చలపల్లి సుందరయ్య, చండ్రరాజేశ్వరరావుల స్పూర్తితో ఎందరో సినిమారంగంలో అభ్యుద భావాలు కలిగినవారు వున్నారు. వారిలో పోకూరి బాబూరావు, టి.కృష్ణ, మాదాలరంగారావు వంటివారు. మాదాల రంగారావుది ప్రత్యేక శైలి. తను వీధి నాటకాల స్థాయి నుంచి పైకి ఎదిగినవాడు. ఉన్నత స్థాయి కుటుంబం నుంచి వచ్చినా అణగారిన వారికి కోసం అండగా నిలిచే కథలు, సినిమాలు చేశాడు. పోకూరిబాబూరావు, టి.కృష్ణ, మాదాల కలయికలో వచ్చిన `యువతరం కదిలింది` అప్పట్లో ట్రెండ్ సెట్ అయింది. ఇక ఆ దర్వాత అదే స్పూర్తిగా దవళ సత్యం దర్శకత్వంలో మ్రరమల్లెలు` సినిమాను మాదాల రంగారావు నిర్మించారు. అది మేడేనాడు విడుదలైంది. అప్పట్లో ఈ సినిమాలోని పాటలు ఏ ఫంక్షన్ జరిగినా వినిపించేవి. 1981 మే 1న విడుదలైన 'ఎర్రమల్లెలు' మాదాలకు విజయాన్ని తెచ్చిపెట్టింది.
వాస్తవ కథ
అప్పట్లో జరిగిన, జరుగుతున్న అంశాలను తీసుకుని కథగా కూర్చి తీసిన సినిమానే ఎర్రమల్లెలు. ఓ పల్లె, పట్టణాన్ని అందులో కార్మికులు, కర్షకులు, శ్రామికులు, కరణం, మునసబు, కామందులు, పరిశ్రమల యజమానులు జనం రక్తం జలగల్లా పీల్చే పరిస్థితిని కల్లకు గట్టినట్లు చూపించారు. పల్లె నుంచి పట్టం వచ్చిన కార్మికులతో ఫ్యాక్టరీ యజమాని పనిగంటలు పెంచి, వారి శ్రమను దోచుకుంటూ ఉంటాడు. ఎదురు తిరిగిన రంగాను జైలుకు పంపిస్తారు. ప్రశ్నించిన సూరిబాబును పనిలోంచి తొలగిస్తారు. పల్లెకు వచ్చిన పంతులు ప్రజల్లో చైతన్యం రగిలిస్తాడు. ఇక సూరిబాబు న్యాయపోరాటంలో గెలుస్తాడు. పంతులును చంపాలనుకుంటారు. ఊరి జనం తిరగబడతారు. సూరిబాబును చంపిస్తారు. చివరకు జనం అంతా ఒక్కటై రంగా నాయకత్వంలో దుర్మార్గులందరినీ బుగ్గి చేయడంతో కథ ముగుస్తుంది.
ఇందులో మురళీమోహన్, గిరిబాబు, మాదాల రంగారావు, రంగనాథ్, పి.ఎల్.నారాయణ, సాక్షి రంగారావు, పి.జె.శర్మ, సాయిచంద్, చలపతిరావు, నర్రా వెంకటేశ్వరరావు, వీరభద్రరావు, వై.విజయ, కృష్ణవేణి, లక్ష్మీచిత్ర నటించారు. టి.కృష్ణ ఇందులో ఓ కీలక పాత్ర పోషించారు. లాయర్ గా ఓ సన్నివేశంలో పోకూరి బాబూరావు కనిపించారు. మాదాల రంగారావు తనయుడు మాదాల రవి బాలనటునిగా నటించాడు. అతనిపై చిత్రీకరించిన "నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో..." అన్న పాట ఆ రోజుల్లో విశేషాదరణ చూరగొంది. ఈ పాటతో పాటు "నేడే మేడే మేడే..." , "బంగారు మాతల్లీ భూమీ మా లచ్చిమీ..", "ఏయ్ లగిజిగి లంబాడీ... తిరగబడర అన్నా..." అని సాగే పాటలు కూడా ఆదరణ పొందాయి.
అంతేకాకుండా ఈ చిత్రానికి యమ్.జి. రామారావు మాటలు,. పాటలు సి.నారాయణరెడ్డి, కొండవీటి వెంకటకవి, అదృష్టదీపక్, ప్రభు, ధవళ సత్యం రాశారు. చక్రవర్తి సంగీతం సమకూర్చారు. ఎ్రరమల్లెలు అనగానే మాదాల రంగారావు పేరు గుర్తుకురాకమానదు.