మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 సెప్టెంబరు 2020 (08:06 IST)

దేవరాజ్‌ను ఇష్టపడిన శ్రావణి... సాయితో పెళ్ళి చేస్తామని తల్లిదండ్రుల ఒత్తిడి.. అందుకే...

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. దేవరాజ్‌ను గాఢంగా ప్రేమించిన శ్రావణి.. అతన్ని పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెచ్చింది. కానీ, దేవరాజ్ అందుకు నిరాకరించాడు. అదేసమయంలో సాయికృష్ణారెడ్డిని పెళ్లి చేసుకోవాలని శ్రావణి తల్లిదండ్రులు ఒత్తిడి తెచ్చారు. అటు ప్రియుడిని వదులుకోలేక, ఇటు తల్లిదండ్రుల ఒత్తిడిని తట్టుకోలేక శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. 
 
ఇటీవల మనసు మమత, మౌనరాగం వంటి సీరియళ్లలో నటించి మంచి పేరు తెచ్చుకున్న నటి శ్రావణి కొండపల్లి. ఈమె హైదరాబాద్ నగరంలని మధుర నగర్‌లో ఆత్మహత్య చేసుకుంది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ దర్యాప్తులో భాగంగా, ఆదివారం మరో కీలక మలుపు తిరిగింది. 
 
దేవరాజు పెళ్లి చేసుకోనని చెప్పడంతోనే ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇదేవిషయాన్ని మెసేజ్‌ పంపినట్లు విచారణలో దేవరాజు చెప్పినట్లు తేలింది. ఓ వైపు పెళ్లికి ఒప్పుకోకపోవడం.. మరో వైపు సాయికృష్ణారెడ్డి పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి తేవడంతోనే బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. 
 
కాగా, ఈ కేసులో గత మూడు రోజులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజును పోలీసులు విచారిస్తున్నారు. ఆదివారం సాయికృష్ణారెడ్డిని పోలీసులు విచారించారు. ఇద్దరి అరెస్టు చేయగా.. సోమవారం మెజిస్ట్రేట్‌ ముందు హాజరు పరుచనున్నట్లు సమాచారం. అలాగే శ్రావణి ఓ నిర్మాతతో మాట్లాడినట్లుగా ఆడియో వెలుగులోకి రాగా.. ఆయనను సైతం విచారణకు పిలువనున్నట్లు తెలిసింది.