1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 జులై 2025 (10:43 IST)

"హరిహర వీరమల్లు" విడుదలకు ముందు వివాదం

Hari hara.. trailer poster
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం హరిహర వీరమల్లు. ఈ నెల 24వ తేదీన విడుదలకానుంది. అయితే, ఈచిత్రం విడుదలకు ముందు వివాదంలో చిక్కుకుంది. చారిత్రక నేపథ్యంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో ప్రధాన పాత్ర ఆరాధ్య వీరుడు పండుగ సాయన్నను పోలివుందని, కానీ చిత్రంలో ఆయన పేరును ప్రస్తావించకుండా తమ చరిత్రను అవమానిస్తున్నారని తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలు వెనుకబడిన తరగతుల సంఘాల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
 
ఈ వివాద వివరాలను పరిశీలిస్తే, ఏఎం జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో పవన్ కల్యాణ్ పోషిస్తున్న వీరమల్లు పాత్ర, బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన జానపద వీరుడు పండుగ సాయన్న జీవితం ఆధారంగా ఉందని బీసీ, ముదిరాజ్ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
 
అయితే, సినిమా ప్రచార చిత్రాల్లో గానీ, ఇతర వివరాల్లోగానీ పండుగ సాయన్న పేరును ఎక్కడా ప్రస్తావించకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది తమ సాంస్కృతిక చరిత్రను మరుగున పరిచే ప్రయత్నమేనని వారు విమర్శిస్తున్నారు.
 
ఈ విషయంపై చిత్ర బృందం వెంటనే స్పందించి స్పష్టత ఇవ్వాలని సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పవన్ పాత్రకు, పండుగ సాయన్నకు సంబంధం ఉందో లేదో తేల్చి చెప్పాలని కోరుతున్నారు. తమ ఆందోళనలను పట్టించుకోకుండా సినిమాను విడుదల చేస్తే, తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు చేపడతామని, సినిమా విడుదలను అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. 
 
ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ పాన్-ఇండియా చిత్రంలో నిధి అగర్వాల్, బాబీ డియోల్, సత్యరాజ్, నాజర్ వంటి ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలై 24న పలు భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.