'పూజ' కోసం పడరానిపాట్లు - ఐదు రోజులు ఫుట్‌పాత్‌పైనే పడిగాపులు
తెలుగు చిత్రపరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ఉన్న పూజా హెగ్డేకు అభిమానుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఆమె నటిస్తున్న చిత్రాలు సూపర్ డూపర్‌హిట్స్ అవుతున్నాయి. ఈ సంక్రాంతికి కూడా అలా వైకుంఠపురములో చిత్రంలో సందడి చేస్తోంది. దీంతో ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా పెరుగుతోంది. తాజాగా ఓ వీరాభిమాని తన అభిమాన హీరోయిన్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు ఏకంగా ఐదు రోజుల పాటు ఫుట్‌పాత్‌పై పడుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను పూజా హగ్డేనే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పూజా హెగ్డేకు భాస్కర్ రావు అనే వీరాభిమాని. తన అభిమాన హీరోయిన్‌ను ప్రత్యక్షంగా చూడాలని ఆకాంక్షించాడు. అంతే... ఎవరికీ చెప్పాపెట్టకుండా ముంబైకు వెళ్లిపయాడు. ఎలాగైనా పూజాను కలవాలని కంకణం కట్టుకున్నాడు. ఇందుకోసం ముంబైకు చేరుకున్న భాస్కర రావు.. ఏకంగా ఐదు రోజులు రోడ్డుపైనే పడిగాపులు కాచాడు. ఎముకలు కొరికే చలిని కూడా లెక్కచేయలేదు. రాత్రిపూట ఫుట్‌పాత్‌లపైనే పడుకున్నారు.
ఈ విషయం పూజాకు చేరింది. దీంతో ఆమె స్వయంగా భాస్కర్ రావు వద్దకు వెళ్లింది. "నీ వీరాభిమానం నా మనస్సును తాకింది. కానీ నా అభిమాని నా కోసం ఇలా రోడ్లపై ఉంటూ, నిద్రపోవడం సరికాదు. నన్ను కలిసేందుకు ఇంత కష్టపడటం చాలా బాధగా అనిపిస్తోంది. నువ్వు ఎక్కుడున్నా.. నీ ప్రేమను ఫీలవుతా.. నీకు హామీనిస్తున్నా.. ఫ్యాన్సే నా బలం.. ప్రేమతో" అంటూ బాధపడుతన్న ఎమోజీలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ తర్వాత భాస్కర్ రావుకు షేక్ హ్యాండ్ ఇచ్చిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‍లో షేర్ చేసింది.