సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్

మైసూరు మ్యూజియం నుంచి ప్రభాస్ మైనపు విగ్రహం తొలగింపు.. ఎందుకు?

prabhas wax statue
మైసూరు మ్యూజియంలో టాలీవుడ్ హీరో ప్రభాస్ మైనపు విగ్రహాన్ని ఉంచారు. దీనికి బాహుబలి విగ్రహం అంటూ నామకరణం చేశారు. ఈ విగ్రహానికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లుకొట్టింది. అయితే, ఈ విగ్రహంలో ప్రభాస్ పోలికలు ఏమాత్రం లేకపోవడంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 
 
పైగా, 'బాహుబలి' నిర్మాత శోభు యార్లగడ్డ కూడా మైసూరు మ్యూజియం తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభాస్ విగ్రహాన్ని తయారు చేస్తున్నట్టు, దాన్ని మైసూరు మ్యూజియంలో ఆవిష్కరిస్తున్నట్టు తమకు ఎవరూ సమాచారం ఇవ్వలేదని తెలిపారు. అసలు, ఆ విగ్రహం నిపుణుడు తయారుచేసినట్టుగా లేదని వ్యాఖ్యానించారు. ఆ విగ్రహం తొలగింపునకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు.  
 
దీంతో మైసూరు మ్యూజియం వర్గాలు వివరణ ఇచ్చాయి. ఎవరి మనోభావాలు దెబ్బతీయాలన్నది తమ అభిమతం కాదని మ్యూజియం అధికారులు స్పష్టం చేశారు. అయితే, విగ్రహం పట్ల అభ్యంతరాలు వస్తున్నందున, మ్యూజియం నుంచి ఆ విగ్రహాన్ని తొలగిస్తాం అని వెల్లడించారు.