బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (14:45 IST)

రాజ్ తరుణ్ హీరోగా "ఇద్దరి లోకం ఒకటే"

వచ్చిన కొత్తల్లోనే మంచి హిట్‌లు కొట్టిన యువ హీరో రాజ్ తరుణ్ తన ఫేమ్‌ని కొనసాగించాలని ప్రయత్నించినా కెరీర్‌లో స్లో గానే నడుస్తున్నాడు. దిల్ రాజు బ్యానర్‌లో తెరకెక్కిన "లవర్" చిత్రంపై నమ్మకాలు పెట్టుకున్నా, ఆ చిత్రం కూడా నిరాశపరిచింది. గత సంవత్సరం విడుదలైన 'లవర్' సినిమా తర్వాత రాజ్ తరుణ్ చాలా రోజులు గ్యాప్ ఇచ్చి ఇప్పుడు మళ్లీ యాక్షన్ మోడ్‌లోకి దిగాడు. 
 
దిల్ రాజు బ్యానర్‌తోనే రాజ్ తరుణ్ కొత్త సినిమాని ఈరోజే లాంచ్ చేశారు. 'ఇద్దరి లోకం ఒకటే' అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి జిఆర్ కృష్ణ దర్శకుడు.  మిక్కీ జె. మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్ జోనర్‌లో ఈ చిత్రం తెరకెక్కబోతోందని సమాచారం. 
 
హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం పూజా కార్యక్రమానికి సీనియర్ రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్ అతిథిగా హాజరయ్యారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన వివరాలు వెల్లడవుతాయి. లాంచ్ సందర్భంగా ఈ సినిమా టైటిల్, లోగో, పోస్టర్‌ను కూడా విడుదల చేసారు. 
 
పింక్ కలర్ పెయింటింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉండగా, 'ఇద్దరి లోకం ఒకటే' అనే టైటిల్ బ్లాక్ ఫాంట్‌తో ఉంది. 'లోకం' పదానికి చుట్టూ వైట్ కలర్ హార్ట్ సింబల్ ఉంది. ఇకపోతే ఈ సినిమా ఉప క్యాప్షన్‌గా యూ ఆర్ మై హార్ట్ బీట్ అని ఉంది.