శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , ఆదివారం, 22 జనవరి 2017 (08:27 IST)

కళ్లముందు అద్భుతం చూపించావు మిత్రమా: శాతకర్ణి దర్శకుడిని ఆకాశానికెత్తిన జక్కన్న

రాజమౌళి గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడని, బాలకృష్ణ ప్రధాన పాత్రధారి అని మొదట్లో తెలుసుకోగానే బిత్తరపోయాడట. ఎందుకో జక్కన్న మాటల్లో వింటేనే బాగుంటుంది. ‘క్రిష్‌ దర్శకత్వంలో

రాజమౌళి తన సినిమాలను తీయడంలో ఎంత లెక్కాపక్కలతో సరైన అంచనాతో ఉంటాడో ఇతర దర్శకులు తీసిన సినిమాలపై కూడా అంతే కచ్చితత్వంతో కూడిన అంచనాతో ఉంటాడనేది అందరికీ తెలిసిన విషయమే. ఎవరి సినిమాలో కాస్తంత మంచి ఉన్నా సరే ప్రోత్సాహకంగా నాలుగు మంచి మాటలు మాట్లాడటమే తప్ప నెగటివ్ కామెంట్ చేసి ఎరగని జక్కన్న అంటేనే దర్శకులందరికీ అభిమానం. జక్కన్న కాస్త మంచి మాట చెబితే, వ్యాఖ్య చేస్తే తమ సినిమాకు అదే పెద్ద హైప్‌ అవుతుందని వీరి నమ్మకం. 
 
అలాంటి రాజమౌళి గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు క్రిష్ దర్శకత్వం  వహిస్తున్నాడని, బాలకృష్ణ ప్రధాన పాత్రధారి అని మొదట్లో తెలుసుకోగానే బిత్తరపోయాడట. ఎందుకో జక్కన్న మాటల్లో వింటేనే బాగుంటుంది.  ‘క్రిష్‌ దర్శకత్వంలో బాలకృష్ణగారి వందో సినిమా’ అంటే నిజంగా నమ్మలేదు. ఉత్తిపుణ్యానికి పుట్టుకొచ్చే చాలా వార్తల్లో ఇదీ ఒకటి అనుకొన్నా. ఎందుకంటే క్రిష్ సెన్సిబులిటీస్‌ నాకు తెలుసు. ‘గమ్యం’, ‘వేదం’, ‘కంచె’.. ఇవన్నీ జీవితాల్లోంచి పుట్టిన కథలు. మరోవైపు బాలయ్య జోరూ చూశా. ఆయనవన్నీ లార్జన్‌ ద్యాన్‌ లైఫ్‌ అనిపించే సినిమాలు. ‘ఈ రెంటికీ పొంతన ఎక్కడ కుదురుతుందిలే’ అనిపించింది. ఆ తరవాత నిజంగానే వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటోందని తెలిసి తొలిసారి ఆశ్చర్యపోయానని జక్కన్న మొహమాటం లేకుండా చెప్పేశాడు. 
 
బాలకృష్ణగారి ఇమేజ్‌కీ, క్రిష్‌ సున్నితత్వానికీ సరిపడదే... అని రాజమౌళి మనసుకు అనిపించిందట. పైగా కొత్త కాంబినేషన్‌ అని కొంతమంది... వింత కాంబినేషన్‌ అని కొంతమంది. బ్యాడ్‌ కాంబినేషన్‌ అని  చాలామంది... ఇలా ఎవరి భ్రమల్లో వాళ్లున్న సమయంలోనే క్రిష్ శాతకర్ణి అనే మహాపర్వత భారాన్ని నెత్తికెత్తుకున్నాడు.  అసలుకు శాతకర్ణి చరిత్ర పరిశోధనకే సంవత్సరం పడుతుంది కదా. ఎప్పట్లో పూర్తి చేస్తారు అనే అనుమానం కూడా కలుగుతున్న  సమయంలోనే క్రిష్ మొరాకోలో, జార్జియాలో, మధ్యప్రదేశ్‌లోని మహేశ్వరంలో షూటింగ్ అని ప్రకటించడం, ఆ ప్రకటన తడి ఆరకముందే 79వ రోజు చిత్రం షూటింగు ముగిసందని గుమ్మడి కాయ కొట్టేయడం విని తాను షాక్ తిన్నానని రాజమౌళి చెప్పాడు.
 
అసలు వీళ్లేం రాశారూ... వీళ్లేం తీశారు.... పైగా మొదటి శతాబ్దపు యుద్ధ కథ అని చెప్పారు. షూటింగ్‌ ఎలా ప్లాన్‌ చేశారు.. ఎవరు డిజైన్‌ చేశారు.. సెట్స్‌ ఎక్కడ వేశారు ఒక యుద్ధం ఎన్ని రోజుల్లో తీశారు.. ఇంత తక్కువ సమయంలో విజువల్‌ ఎఫెక్ట్స్‌ కూడా పూర్తి చేసి ఎలా రిలీజ్‌ చేశారు ఇలా అన్నీ అనుమానాల మధ్యే గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా విడుదల తేదీ కూడా ప్రకటించారు. జనవరి 12న తొలిరోజే సినిమాను అభిమానులతో కలిసి చూసిన రాజమౌళికి ఒక అద్బుత ప్రపంచం కళ్ళముందు కనబడి బిత్తరపోవాల్సి వచ్చిందట. 
 
అక్కడుంది నాకు తెలిసిన బాలయ్య కాదు... సాక్షాత్తూ శకపురుఫుడు సార్వభౌమ శాతకర్ణి. ‘సమయం లేదు మిత్రమా..’ అని చెప్పినప్పుడల్లా సగటు అభిమానిలానే నా గుండె కూడా పులకరించింది. యుద్ధరంగంలో బాలయ్య గుర్రం మీద కూర్చుని పిల్లాడు చెప్పిన కథ వింటున్న దృశ్యంలో... హీరోయిజం నాకు ఇంకో కోణంలో కనిపించింది. చరిత్ర అంటే డాక్యుమెంటరీలా తీస్తారనుకొంటే... మీరు దాన్ని అచ్చమైన కమర్షియల్‌ చిత్రంగా మలిచారు అంటూ క్రిష్‌ని ఆకాశానికి ఎత్తేశారు జక్కన్న. 
 
గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో ప్రతీ మాటా... ప్రతీ సన్నివేశం, ప్రతీ మలుపూ కదిలించింది. తెలుగువాడిగా మీసం మెలేయాలనిపించేలా చేసింది. యుద్ధంలో హింస, రక్తపాతం ఉంటాయి. కానీ మీ యుద్ధంలో భావోద్వేగాలు కనిపించాయి. భావోద్వేగాలతో సాగే సన్నివేశాలూ యుద్ధంలానే ఉన్నాయి. కావ్యాల్లాంటి దృశ్యాలన్నీ కలిసిన దృశ్యకావ్యం. ఈ సినిమా కథ చరిత్ర... ఈ సినిమా తీసిన విధానం ఒక చరిత్ర.. ఈ సినిమా తీయాలన్న ఆలోచన రావడమే ఓ చరిత్ర అంటూ రాజమౌళి క్రిష్‌ని ఆకాశంలోకి ఎత్తేశారు.
 
ఆ.. ఎలా తీస్తారు, ఎప్పుడు తీస్తారు అనుకున్న తమ భ్రమల్ని పటాపంచలు చేశారని, .. మీతో పాటు ఓ సైన్యంలా పనిచేసిన చిత్రబృందానికీ, మరీ ముఖ్యంగా వందో చిత్రం కోసం ఇంత గొప్ప కథని ఎంచుకొన్న బసవరామ తారక పుత్ర బాలకృష్ణగారినీ మనసారా అభినందిస్తున్నానని రాజమౌళి చేసిన వ్యాఖ్యతో బాలకృష్ణ అభిమానులకు పట్టపగ్గాలుండవని భావిస్తున్నారు.
 
గతంలో ఎన్టీఆర్‌తో స్టూడెంట్ నం. 1 సినిమా తీయాల్సి వచ్చినప్పుడు కూడా వీణ్ణి నాకెందుకు తగలెట్టారు అనుకున్నానని. సినిమా తీస్తున్న క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ స్టామినా ఏమిటో అర్థమైపోయిందని రాజమౌళి మొహమాటం లేకుండా నిజాన్ని నిర్బయంగా బయటకు చెప్పిన విషయం తెలిసిందే.
 
ఏదేమైనా రాజమౌళి ప్రశంసలతో శాతకర్ణి కిక్కు అభిమానులను ఇంకా బలంగా తగులుతుంది కాబోలు.