చెర్రీ భార్య ఎమోషనల్ ట్వీట్... నాతో కలిసి నా బేబీ కూడా అనుభూతిని పొందింది...
"ఆర్ఆర్ఆర్" చిత్రంలోని 'నాటునాటు' పాటకు ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డు వరించింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ అవార్డును ఆ పాట సృష్టికర్త (సంగీత దర్శకుడు) ఎంఎం కీరవాణి అందుకున్నారు. అయితే, ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి కీరవాణి దంపతులు, చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, ఆయన సతీమణి రమా రాజమౌళి, హీరోలు జూనియర్ ఎన్టీఆర్ - ప్రణతి, రామ్ చరణ్ - ఉపాసన దంపతులు హాజరయ్యారు. 'నాటునాటు' పాటకు అవార్డు దక్కడంతో వారందరి సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. దీన్ని పురస్కరించుకుని ఉపాసన ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు.
"ఆర్ఆర్ఆర్ చిత్రానికి అవార్డు లభించండం, ఈ చారిత్రక సందర్భంలో కడుపులో బిడ్డ సహా తాను పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆర్ఆర్ఆర్ కుటుంబంలో భాగమైనందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఇది దేశం గర్వించే విజయం. ఈ ప్రయాణంలో నన్ను భాగస్వామిని చేసిన రామ్ చరణ్, దర్శకుడు రాజమౌళికి ధన్యవాదాలు. నాతో కలిసి నా బేబీ (పుట్టబోయే బిడ్డ) కూడా ఈ అనుభూతిని పొందుతున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నా. చాలా ఉద్వేగంగా కూడా ఉంది" అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో వారంతా దిగిన గ్రూపు ఫోటోను రాజమౌళి షేర్ చేశారు.