గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

మిహీకాను కలవగానే జీవితం ఆమెతో ముడిపడినట్టుగా భావించా.. రానా

తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ బ్యాచిలర్‌గా ఉన్న హీరోల్లో రానా దగ్గుబాటి ఒకరు. ఈయన త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తాను ప్రేమించి మిహీకా బజాజ్‌ను పెళ్లి చేసుకోబోతున్నాడు. వీరిద్దరి వివాహ కార్యక్రమంలో భాగంగా, గత బుధవారం రోకా వేడుక కూడా జరిగింది. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో ఈ వివాహ వేడుక జరుగనుంది. 
 
అయితే, తన ప్రియురాలి గురించి రానా కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. తాజాగా ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ, తాను పెళ్లి చేసుకోవడానికి ఇన్నాళ్లకు సరైన సమయం వచ్చిందని భావిస్తున్నట్టు చెప్పాడు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి ముమ్మరంగా ఉన్నందున ప్రపంచవ్యాప్త పరిస్థితులను అనుసరించి తన పెళ్లి గ్రాండ్‌గా చేసుకోవాలో, వద్దో నిర్ణయించాల్సివుందన్నాడు. 
 
ఇక, తన ప్రియురాలు మిహీకా బజాజ్‌తో తన పరిచయం గురించి స్పందిస్తూ, తన గురించి ఆమెకు పూర్తిగా తెలుసని, ఆమెను కలిసిన క్షణమే ఆమెతో తన జీవితం ముడిపడిందనే భావన తన మనసులో కలిగిందన్నాడు. 
 
'ప్రపోజ్ చేయాలని డిసైడ్ అయిన తర్వాత మిహీకాకు ఫోన్ చేశాను. నా వైపు నుంచి ఎంతో స్పష్టంగా ఉన్నాను. జీవితాన్ని ఆమెతో పంచుకోవాలని నిర్ణయించుకున్నాను. అంతకుమించి ఇంకేమీ ఆలోచించలేదు. ఆమె వ్యక్తిగతంగా కలవడంతో నా మనసులో ఉన్నది చెప్పేశాను' అని రానా వివరించాడు. 
 
కాగా, మిహీకా తల్లిదండ్రులు హైదరాబాద్‌లో నివసిస్తుంటే, ఆమె మాత్రం ముంబైలో ఓ ఫ్యాషన్ డిజైనింగ్ సంస్థను నడుపుతోంది. ఇది సెలెబ్రిటీల పెళ్లి వేడుకలు, టూర్ కార్యక్రమాలను పర్యవేయక్షిస్తూ ఉంటుంది.