బలమైన ఆధారాలు ఉన్నాయ్.. బెయిల్ రద్దు చేయండి : ఎన్సీబీ
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు తర్వాత బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మాదకద్రవ్యాల వినియోగం వెలుగు చూసింది. ఈ డ్రగ్స్ వ్యవహారంలో బాలీవుడ్‌ను ఓ కుదుపు కుదిపింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడి ప్రేయసి, బాలీవుడ్ నటి రియా చక్రవర్తి ప్రస్తుతం బెయిలుపై ఉన్నారు.
అయితే, ఈ కేసులో అరెస్టు అయిన రియా చక్రవర్తి కొన్ని నెలల పాటు జైలు జీవితాన్ని గడిపింది. ఆ తర్వాత బాంబే హైకోర్టు గతేడాది అక్టోబరు 7న లక్ష రూపాయల పూచీకత్తుపై ఆమెకు బెయిలు మంజూరు చేసింది. అలాగే, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని ఆంక్షలు విధించింది.
ఈ నేపథ్యంలో డ్రగ్స్ కేసులో రియాకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయనీ, అందువల్ల ఆమె బెయిల్‌ను రద్దు చేయాలంటూ తాజాగా మాదక ద్రవ్యాల నియంత్రణ బ్యూరో (ఎన్‌సీబీ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బాంబే హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన ఈ పిటిషన్‌ను ఎల్లుండి (18న) విచారిస్తామని చీఫ్ జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.