'బాహుబలి' రికార్డులు బ్రేక్ చేస్తున్న మహేశ్ "సరిలేరు నీకెవ్వరు"
ఎస్ఎస్ రాజమౌళి - ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'బాహుబలి'. ఈ చిత్రం భారతదేశ చలనచిత్ర పరిశ్రమలోని రికార్డులన్నీ తిరగరాసింది. ముఖ్యంగా, తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త కలెక్షన్ రికార్డులను నెలకొల్పింది. ఇపుడు ఈ రికార్డులు బద్ధలైపోతున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో బ్రేక్ కాగా, మరికొన్ని ప్రాంతాల్లో రెండు మూడు రోజుల్లో బాహుబలి రికార్డులు మాయంకానున్నాయి.
ఈ రికార్డులను బ్రేక్ చేస్తున్నది ఎవరో కాదు.. టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు. ఆయన నటించిన తాజా చిత్రం "సరిలేరు నీకెవ్వరు". అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ప్రదర్శించిన తొలి ఆట నుంచే సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా కలెక్షన్ల వర్షం కురుస్తోంది.
ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వ్యాపారవర్గాల సమాచారం మేరకు ఈ సినిమా పలు ప్రాంతాల్లో నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేసింది. ఈస్ట్ గోదావరి, నైజాం, నెల్లూరు ప్రాంతాల్లో బాహుబలి రికార్డులను క్రియేట్ చేసిన ఈ చిత్రం గుంటూరు, వైజాగ్ ప్రాంతాల్లో సినిమా బ్రేక్ ఈవెన్ కానుంది. వెస్ట్ గోదావరిలో మహేశ్ కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్ కలెక్షన్స్‌ను సృష్టించిందీ చిత్రం. మహేశ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ సాధించే దిశగా సరిలేరు నీకెవ్వరు పరుగులు తీస్తోంది.
ప్రాంతాల వారీగా ఈ చిత్రం సాధించిన కలెక్షన్లను పరిశీలిస్తే, నైజాం రూ.22.5 కోట్లు (నాన్ బాహుబలి రికార్డు), ఉత్తరాంధ్ర రూ.10.05 కోట్లు (దాదాపుగా బాహుబలి రికార్డు బ్రేక్), సీడెడ్ రూ.9.75 కోట్లు, గుంటూరు రూ.7.19 కోట్లు (బ్రేక్ ఈవెన్), నెల్లూరు రూ.2.42 కోట్లు (నాన్ బాహుబలి రికార్డు), వెస్ట్ గోదావరి రూ.4.54 కోట్లు (ఆల్ టైమ్ రికార్డు), ఈస్ట్ గోదావరి రూ.6.22 కోట్లు (బ్రేక్ ఈవెన్), కృష్ణా రూ.5.55 కోట్లు చొప్పున కలెక్షన్స్‌ను రాబట్టింది. దీంతో ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలతో పాటు... పంపిణీదారులు కూడా చాలా సంతోషంలో మునిగిపోయారు.