ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , శుక్రవారం, 4 ఆగస్టు 2017 (04:34 IST)

తిరుపతి సాక్షిగా ప్రాంతీయతను బద్దలు గొట్టిన ఫిదా.. సాయిపల్లవికే సాధ్యమైందా?

ఎక్కడో చిన్న అనుమానం.. ఒక పక్కా తెలంగాణ సినిమా.. కంప్లీట్‌గా తెలంగాణ మాడలికంతో రూపొందిన సినిమా...తెలంగాణ సరిహద్దును దాటిన తర్వాత ఎలాంటి స్పందనను చవిచూస్తుంది అనే విషయంపై ఎక్కడో సందేహం ఉండేది. కలెక్షన్

ఎక్కడో చిన్న అనుమానం.. ఒక పక్కా తెలంగాణ సినిమా.. కంప్లీట్‌గా తెలంగాణ మాడలికంతో రూపొందిన సినిమా...తెలంగాణ సరిహద్దును దాటిన తర్వాత ఎలాంటి స్పందనను చవిచూస్తుంది అనే విషయంపై ఎక్కడో సందేహం ఉండేది. కలెక్షన్ల విషయంలో కాదు. అన్నిప్రాంతాల్లో గత 14 రోజులుగా ఒక చిన్న సినిమా సమస్త అంచనాలనూ దాటి మెగాస్టార్ల రికార్డులన్నింటినీ బద్దలు గొట్టి బాహుబలి 2 తర్వాతి స్థానంలో నిలుస్తున్నంత క్రేజిని సంపాదించింది. 
 
కానీ ఒక టీమ్‌గా ప్రమోషన్‌కు వెళ్ళినప్పుడు 70 శాతం పైగా తెలంగాణకు చెందిన వాళ్లే నటించిన సినిమాలోని పాత్రధారులు తమ గడ్డపై తెరవద్ద ప్రత్యక్షమయినప్పుడు జనం స్పందన ఎలా ఉంటుంది.. రాష్ట్ర విభజన సందర్భంగా ప్రేరేపించబడిన ఆవేశకావేషాలూ, విద్వేష వాతావరణం ఇంకా ఎంతో కొంత కొనసాగుతున్న సందర్భంలో ఈ సినిమాలో నటించిన పాత్రధారులను ఆంద్రప్రదేశ్ ప్రేక్షకులు సరిగా రిసీవ్ చేసుకుంటారా అనే సందేహం మొదటిరోజే గాలికి కొట్టుకుపోయింది.
 
గత 14 రోజులుగా హైదరాబాద్‌లోనే థియేటర్లలో, బయటా ప్రమోషన్ కార్యక్రమాలతో ఊపిరాడకుండా గడిపిన ఫిదా టీమ్ గురువారం తొలిసారిగా తెలంగాణ సరిహద్దులను దాటింది. రాయలసీమలో తిరుపతిలోని సంధ్య థియేటర్లో ప్రత్యక్షమైంది. థియేటర్లోకి టీమ్ ప్రవేశింగానే జన సునామీ స్వరమెత్తింది. తెలంగాణ థియేటర్లలో కూడా కనిపించని  ఉద్వేగం, అభిమానం, ఆదరంతో ఫిదా టీమ్ తడిసి ముద్దయింది. ఒక చరిత్ర సృష్టించిన చిత్రబృందాన్ని కేరింతలతో ఆహ్వానించారు. ఈ సినిమా మాది, మీరు మావాళ్లు అన్నంత రేంజిలో ఫిదా టీమ్‌ను చూసిన ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. 
 
దీనంతటికీ కారణం ఒకరు.. సాయిపల్లవి.. పిల్లకాలువలను, పిల్ల నదులను మహాసముద్రం తనలో కలిపేసుకున్నట్లు ఫిదా టీమ్ మొత్తాన్ని తనలో కలిపేసుకున్న చందాన సాయి పల్లవి జనాలను ఆకర్షించింది. మొదటిసారిగా పవన్ కల్యాణ్ తర్వాత ఒక తారను చూసినప్పుడు జనాల మధ్య నుంచి వచ్చే రోరింగ్ సౌండ్‌ అనుభూతిని సాయి పల్లవి కలిగించింది. ఆమె నడిస్తే, నవ్వితే, మాట్లాడితే తిరుపతి ప్రేక్షకులు ఫిదా.
 
తెలంగాణ పోరిగా నటించిన సాయిపల్లవిని ఆంద్రప్రదేశ్ తనదిగా భావించి ఓన్ చేసుకుంది. రాజకీయాలు నాటిన విభజన ద్వేషాలను పక్కనబెట్టి తొలిసారిగా తెలంగాణ సంస్కృతిని, పాటను, తెలంగాణ మట్టి పరిమళాన్ని ఏపీ ఓన్ చేసుకుంది. సాయి పల్లవి ఫిదా సినిమాలోని తన ఫేమస్ డైలాగ్‌ చెప్పక ముందే హైబ్రిడ్ పిల్లా అంటూ  జనం కేరింతలు..
 
చాలు... రెండు ప్రాంతాల మద్య విద్వేష బీజాల నడుమనే స్నేహం చిగురించిన ఈ క్షణాలు చాలు. ఆడా తెలుగే, ఈడాతెలుగే అంటూ రుద్రమదేవిలో పలికిన ఆ ఫేమస్ డైలాగు ఆచరణలో ప్రత్యక్షంగా కనిపించిన క్షణాలు. తన నటనతో తెలంగాణ భాష గొప్పదనాన్ని ప్రపంచం ముందు పరిచిన సాయిపల్లవి రెండు తెలుగు రాష్ట్రాలను సాంస్కృతిక పరంగా ఒకటి చేసింది.  
 
రాజకీయ వైషమ్యాలను, పాలకుల మధ్య కుమ్ములాటలను పక్కకు నెట్టి ప్రజల జీవితాల పరంగా మీరు మేమూ ఒకటి అనే వాస్తవాన్ని ఫిదా పల్లవి అర్థం చేయించింది. మలయాళ సినిమానుంచి దూసుకొచ్చి తెలుగు చిత్రసీమలో ప్రవేశించి తొలి సినిమాతోనే చరిత్ర సృష్టించిన పల్లవి ఈ దేశపు వైవిద్యతను, భిన్నత్వంలోని ఏకత్వాన్ని మరోసారి తన నటన ద్వారా  అమోఘమైన తీరులో ప్రదర్సించింది.
 
శేఖర్ కమ్ముల దార్శనికత,, పల్లవి గొంతులో తెలంగాణ జీర ప్రాణం పోసుకుని కళకు భాషాలేదు, ప్రాంతమూ లేదు అనే నిరూపిత సత్యాన్ని మరొక్కసారి తెలుగు రాష్ట్రాలకు గుర్తు చేసింది. బాహుబలి సినిమాలో కట్టప్ప ప్రపంచ వ్యాప్తంగా సృష్టించిన క్యూరియాసిటీ ఆ సినిమాకు ప్రపంచ మార్కెట్ కల్పించినట్లే ఫిదా సినిమాలో సాయిపల్లవి విశ్వరూపం దాల్చి పలికిన సంభాషణలు, ఆడదానికి ఎన్నుకునే ఛాయిస్ ఉండకూడదా.. నో చెప్పే ఛాయిస్ ఉండకూడదా అంటూ ఆమె వేసిన పొలికేక ప్రపంచంలోని ప్రతి తెలుగువాడి గుండెల్ని తాకింది. 
 
ప్రజలమధ్య వర్గాల మధ్య చీలికలు తెచ్చి, విద్వేషాలు సృష్టించి పబ్బం గడుపుకునే నేతల యవ్వారాలతో జనసమూహమే చీలిపోతున్న నేపథ్యంలో ఆ ద్వేషాలు, స్వార్థాలూ మనకెందుకు అంటూ ప్రపంచంలోని తెలుగు వాళ్లందరినీ చల్లగా పలకరించింది ఫిదా. ఆ ఫిదా ఆత్మ సాయిపల్లవి రూపంలో వెలిగింది. 
 
ఇలాంటి సినిమాలనే మనం కోరుకుందాం.  ద్వేషం, అనుమానం స్థానంలో ప్రేమను, యాసలు వేరైనా మనం ఒక్కటే అంటూ ప్రేమను పంచిన ఇలాంటి సినిమాలనే మనం ఆదరిద్దాం.