రైలు పట్టాలపై నేపథ్య గాయని హరిణి తండ్రి మృతదేహం
ప్రముఖ సినీ నేపథ్యగాయని హరిణి తండ్రి ఏకే రావు బెంగుళూరు రైలు పట్టాలపై శవమై కనిపించారు. ఆయన మృతదేహాన్ని బెంగుళూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ నేపథ్యగాయని హరిణికి ఇతర భాషల కంటే కన్నడలో మచి పేరుంది. అయితే, వారం రోజుల క్రితం ఈమె కుటుంబం అదృశ్యమైంది. ఈ మేరకు బెంగుళూరు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ పోలీస్ కేసు నమోదైంది. దీంతో ఆమె కుటుంబ సభ్యుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తూ వస్తున్నారు.
ఈ నేపథ్యంలో హరిణి తండ్రి మృతదేహాన్ని రైలు పట్టాలపై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈయన ప్రమాదవశాత్తు పడి చనిపోయారా లేక ఎవరైనా హత్య చేసి చంపేశారా? అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
కాగా, ఏకే రావు తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నగరంలోని శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. కేంద్ర ప్రభుత్వ సర్వీసుల నుంచి పదవీ విరమణ పొందిన ఆయన... సుజనా ఫౌండేషన్‌కు సీఈవోగా పని చేస్తున్నారు. ఈ కార్యాలయానికి వారం రోజుల నుంచి హాజరుకాలేదని కార్యాలయ సిబ్బంది సమాచారం చేరవేశారు. ఈ నేపథ్యంలో ఆయన మృతదేహాన్ని బెంగుళూరు రైలు పట్టాలపై గుర్తించడం ఇపుడు కలకలం రేపుతోంది.