బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 16 ఆగస్టు 2020 (23:12 IST)

తాను బాగానే ఉన్నట్టు సంకేతాలిస్తున్న ఎస్.పి. బాలు : ఎస్.పి. చరణ్ వెల్లడి

కరోనా వైరస్ బారినపడి చెన్నైలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సినీ నేపథ్యగాయకుడు ఎస్.బి. బాలసుబ్రమణ్యం ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతోంది. వైద్యులను గుర్తుపట్టడమే కాకుండా తాను బాగా ఉన్నట్టు బొటనవేలు పైకెత్తి థంబ్ సింబల్ చూపిస్తున్నారని ఆయన కుమారుడు ఎస్.పి.చరణ్ తెలిపారు. 
 
ఎస్పీబీ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్టు వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతోంది. ఈ క్రమంలో ఎస్బీబీ భార్య కూడా ఈ వైరస్ బారినపడ్డారు. అయితే, తన తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ఎస్పీ చరణ్ వివరాలు తెలిపారు. 
 
తన తండ్రి ఎస్పీ బాలును ఆసుపత్రిలోని మూడో అంతస్తులో ఉన్న జనరల్ ఐసీయూ నుంచి ఆరో అంతస్తులోని ఉన్న ప్రత్యేక ఐసీయూ గదికి మార్చారని వెల్లడించారు. ఇప్పుడు కాస్త స్పృహలో ఉన్నారని, డాక్టర్లను గుర్తిస్తున్నారని, బొటనవేలు పైకెత్తి తాను బాగానే ఉన్నానన్న సంకేతాలు ఇస్తున్నారని చరణ్ ఓ వీడియోలో వివరించారు.
 
డాక్టర్లు కూడా చేస్తున్న చికిత్సకు ఆయన స్పందిస్తున్న తీరు చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారని, త్వరలోనే కోలుకుంటారన్న నమ్మకం ఉందని తెలిపారు. అయితే ఇవాళ ఆదివారం కావడంతో తన తండ్రికి సంబంధించిన తాజా సమాచారం తెలియాల్సి ఉందని అన్నారు. ఇక, తన తల్లి కరోనా నుంచి కోలుకుంటోందని, ఆమె మంగళవారం కానీ, బుధవారం కానీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతారని తెలిపారు.