మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డివి
Last Updated : మంగళవారం, 19 జనవరి 2021 (22:15 IST)

"దేవినేని" టీజర్ వ‌చ్చేసింది... టైటిల్ పాత్రలో నందమూరి తారకరత్న

Devineni
బెజవాడ నేపథ్యంలో ప్రముఖ రాజకీయ నాయకుడు దేవినేని నెహ్రూ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రం "దేవినేని". దీనికి ''బెజవాడ సింహం'' అనేది ట్యాగ్ లైన్. నందమూరి తారకరత్న టైటిల్ పాత్రలో నటించారు. నర్రా శివ నాగేశ్వరరావు (శివనాగు) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. జిఎస్ఆర్, రాము రాథోడ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
 
వంగవీటి రాధ పాత్రలో నటుడు బెనర్జీ, వంగవీటి రంగా పాత్రలో సురేష్ కొండేటి, చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్, కెఎస్ వ్యాస్ పాత్రలో  ప్రముఖ సంగీత దర్శకుడు కోటి నటించారు.  బెజవాడలో ఇద్దరు  మహా నాయకుల మధ్య స్నేహం, వైరంతో పాటు కుటుంబ నేపథ్యంలో సెంటిమెంట్‌ కలయికలో ఈ చిత్రాన్ని  రూపొందిస్తున్నారు. కాగా ఈ చిత్రం టీజర్ ను ప్రముఖ హీరో శ్రీకాంత్ హైదరాబాద్ లో విడుదల చేశారు.
 
అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ, "టీజర్ చాలా బాగుంది. మిత్రుడు శివనాగు మేకింగ్ చాలా డైనమిక్‌గా ఉంది. శివనాగు మంచి దర్శకుడు. శివనాగు నేను కలసి గతంలో మధు ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ లో ట్రైనింగ్ అయ్యాము.  శివనాగుకి “దేవినేని” మూవీ పెద్ద బ్రేక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇది ఒక పెద్ద కమర్షియల్ సినిమా అవుతుంది. తమ్ముడు నందమూరి తారక్ లుక్ అదిరింది. తారక్ కి  కూడా ఈ చిత్రంతో స్టార్ డమ్ వస్తుందని, శివనాగు స్టార్ డైరెక్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని  ఈ టీజర్ చూడగానే నాకు అనిపించింది” అని అన్నారు.
 
దర్శకుడు నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు) మాట్లాడుతూ, "గతంలో బెజవాడ నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఆ చిత్రాలకు భిన్నంగా బెజవాడలో చలసాని, వంగవీటి రాధా, దేవినేని నెహ్రూ, వంగవీటి రంగాల జీవితాలలో జరిగిన వాస్తవాలను కళ్ళకు కట్టినట్టుగా ఈ చిత్రంలో చూపిస్తున్నాం. ఇంతవరకు ఎవరు చూపించనిరీతిలో నిజాలను నిర్భయంగా ఇందులో చూపించాం. ఎందరు మెచ్చుకుంటారు, ఎంతమంది నొచ్చుకుంటారు అన్న అంశంతో పనిలేకుండా వాస్తవాలను ఆవిష్కరించాం. దేవినేని నెహ్రూ పాత్రలో నందమూరి తారకరత్న పరకాయ  ప్రవేశం చేశారు. సురేష్ కొండేటి వంగవీటి రంగగా అలరిస్తారు. త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తాం" అని అన్నారు.