1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Updated : శుక్రవారం, 7 ఆగస్టు 2015 (16:55 IST)

మహేష్ 'శ్రీమంతుడు' రివ్యూ రిపోర్ట్ : సొంత గ్రామానికి సేవ చేసే ప్రిన్స్.. ఫ్యామిలీతో చూడొచ్చు!

నటీనటులు:  మహేష్‌బాబు, శ్రుతిహాసన్‌, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, అలీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్‌, శివాజీ రాజా, కాదంబరి, ముకేష్‌ రుషి, సంపత్‌, హరీష్‌, ఏడిద శ్రీరాం, తులసి, సుకన్య, సీతారాం, సన ఇతర తారాగణం. 
 
సాంకేతికత: 
ఈ చిత్రానికి పాటలు: రామజోగయ్యశాస్త్రి, డ్యాన్స్‌: రాజుసుందరం, దినేష్‌, బాస్కో సీజర్‌, థ్రిల్స్‌: అనల్‌ అరసు, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్‌: ఎ.యస్‌.ప్రకాష్‌, కెమెరా: మది, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: చంద్రశేఖర్‌ రావిపాటి, నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సి.వి.ఎమ్‌), కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కొరటాల శివ.
 
పాయింట్‌: పుట్టిన ఊరుకు తండ్రి బదులు కొడుకు చేసే సేవ. 
 
బాహుబలి వంటి పెద్ద చిత్రం తర్వాత మహేష్ బాబు శ్రీమంతుడు చిత్రాన్ని వాయిదా వేసుకున్నాడు. ఈలోగా చిన్నచిత్రాలు వచ్చినా పెద్దగా ప్రేక్షకులను అలరించలేకపోయాయి. మహేష్‌బాబు సినిమా అంటేనే ఫ్యామిలీతో చూడముచ్చటగా చూసేట్లుగా వుంటాయి. అతడు తర్వాత మళ్ళీ ఫ్యామిలీకోసం ఊరికోసం ఏదైనా సేవ చేయాలని చూసిన కథతో మహేష్‌బాబు ముందుకు వచ్చాడు. మిర్చి వంటి ఫ్యాక్షనిస్టు సినిమాతో తొలిసారిగా దర్శకత్వం వహించిన కొరటాల శివ... మహేష్‌బాబుతో ఊరి దత్తత అనే కాప్సెప్ట్‌తో చేశానని ముందుగానే చెప్పేశాడు. అంటే కథలో ఏమంత ట్విస్ట్‌లేదు. ఎలా చేశాడనేది సినిమా. మరి ఈ చిత్రం ఎలా చూపించాడో చూద్దాం.
 
 
కథ: 
హర్ష (మహేష్‌బాబు) వ్యాపారవేత్త అయిన మిలియనీర్‌ రవి (జగపతిబాబు) కొడుకు. చక్కటి ఫ్యామిలీ. కానీ వారసుడైన హర్ష.. ఇంటిలో ఎవరికీ అర్థం కాడు. నలుగురికి మంచి చేయాలనే యావతోనే తన కంపెనీలో పనిచేసేవారికి ఆర్థిక సాయం చేస్తాడు. వ్యాపారాన్ని చూసుకోవడానికి కొంత టైం కావాలంటాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో హాస్టల్‌లో వుండే చారుశీల (శ్రుతిహాసన్‌)ను మొదటిచూపులో ప్రేమలో పడతాడు. 
 
రూరల్‌ డెవల్‌మెంట్‌ కోర్సుతో గ్రామాన్ని ఎలా అభివృద్ది చేయాలనే దానిపై స్టడీచేస్తుంది. ఇది తెలిసిన హర్ష కూడా ఆమె కాలేజీలో చేరతాడు. తర్వాత ఆమె చెప్పిన మాటలకు ఇన్‌స్పైర్‌ అవుతాడు. 
 
మరోవైపు తండ్రి బిజినెస్‌కు అడ్డువస్తున్న మంత్రి (ముఖేష్‌రుషి)కి క్లాస్‌పీకి.. టెండర్‌ను తమకు వచ్చేలా చేసుకుంటాడు హర్ష. దీంతో ఇద్దరిమధ్య వైరం పెరుగుతుంది. ఆ తర్వాత తన మూలాలు ఏమిటనేవి? చారుశీల చెప్పగానే.. వెంటనే దేవరకోట అనే మారుమూల గ్రామానికి వెళ్ళి ఊరును బాగుచేస్తాడు. మరి అక్కడవారిని భయపెట్టి పాలిస్తున్న రౌడీలు ఊరుకుంటారా? ఎదురుతిరుగుతారు. వారిద్దరి మధ్య జరిన సంఘర్షణల్లో ఎవరిది పైచేయి అనేది మిగిలి సినిమా.
 
పెర్‌ఫార్మెన్స్‌: 
మహేష్‌బాబు తనదైన శైలిలో నటించేశాడు. కూల్‌గా సంభాషణలు చెబుతూ.. హార్ష్‌గా విలన్లతో తలపడే విధానం ప్రతి సినిమాలో చేసినట్లున్నా.. బాగానే వుంది. కాస్త గ్లామర్‌గా కన్పించాడు. కొన్ని ఎమోషనల్‌ల్లో ఫ్యామిలీకోసం తాపత్రపడే వాడిగా, ఊరుకోసం ఆత్రంపడే వాడిగా షేడ్స్‌ పండించాడు. శ్రుతిహాసన్‌ పాత్ర కొత్తదేమీకాకపోయినా.. హీరోను సపోర్ట్‌చేసే పాత్ర పర్వాలేదు. చారుశీల అనే పాటలో కాస్త ఎక్స్‌పోజ్‌తోపాటు హీరోని ముద్దులు పెట్టుకోవడం యూత్‌ను అలరించింది. 
 
హర్ష తండ్రిగా జగపతిబాబు బాగా సూటయ్యాడు. తల్లిగా సుకన్య పర్వాలేదు. ఊరుకోసం ఏదో చేయాలనే లోలోపల తపించే వ్యక్తిగా నారాయణ పాత్రలో రాజేంద్రప్రసాద్‌ నటించాడు. ఆయన స్నేహితులుగా కాదంబరికిరణ్‌ తదితరులు నటించారు. సుబ్బరాజు పాత్ర పెద్దగా ప్రాధాన్యతలేదు. ఊరికే పెట్టినట్లుంటుంది. 'అలా ఎలా' ఫేమ్‌ రాహుల్‌ రవీంద్రన్‌ పాత్ర పాలిష్‌విలన్‌టచ్‌తో కొత్తగా వుంది. వెన్నెలకిశోర్‌, అలీ పాత్రలు ఉన్నా.. ఎంటర్‌టైన్‌మెంట్‌ ఆశించిన స్థాయిలో లేదు.
 
టెక్నికల్‌గా... 
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ కీలకం. మిర్చికి చేసిన మదినే దీనికి చేశాడు. సంభాషణల పరంగా సింపుల్‌గా వుండేలా కొరటాల శివ రాయించాడు. అయితే పంచ్‌డైలాగ్‌లు లేకుండా సందర్భానుసారంగా వుంటాయి. ఊరు చాలా ఇచ్చింది. ఎంతోకొంత చేయాలి. లేదంటే లావవుమోతామనే డైలాగ్‌... కొత్తగా వుంది. ఇక సంగీతపరంగా దేవీశ్రీప్రసాద్‌ బాణీలు ఊపు తెప్పిస్తాయి. చారుశీల పాటతోపాటు రామరామ... అనే పాటలో జోష్‌ వుంది. ఆర్ట్‌. ఎడిటింగ్‌ విధానం పర్వాలేదు. 
 
యాక్షన్‌పరంగా అరసు ఇచ్చిన కొత్త ఫైట్లు కొత్తగా లేకపోయినా.. చూడ్డానికి బాగున్నాయి. కథ ముందుగానే తెలుసుకాబట్టి.. దాన్ని ఆసక్తికరంగా తీసే విధానంలో ఇంకాస్త ఎంటర్‌టైన్‌మెంట్‌ వుంటేబాగుండేది. ప్రేక్షకుడు బాగా థ్రిల్‌ అయ్యే అంశాలు పెద్దగా లేవు. సమాజంకోసం బాధ్యతగా హీరో ఏమి చేయాలనుకుంటాడో అది మహేష్ పాత్రద్వారా చూపించాడు. గ్రాండ్‌గా చూపించడంలో నిర్మాణ వాల్యూస్‌ బాగున్నాయి.
 
విశ్లేషణ 
నాలుగైదు రోజులుగా శ్రీమంతుడుపై భారీ అంచనాలతో సోషల్‌మీడియాలో వార్తలు వచ్చాయి. బాహుబలికి ధీటుగా టిక్కెట్లు బ్లాక్‌లో అమ్ముతున్నారంటూ రాసేశారు. నిజానికి డిస్ట్రిబ్యూటర్లే హైదరాబాద్‌లో టిక్కెట్లు బ్లాక్‌చేసి హైప్‌ క్రియేట్‌ చేశారనే తెలిసింది. సినిమా మొత్తం మహేష్‌బాబు మీదనే నడుస్తుంది. ఒన్‌మ్యాన్‌ షో.... మిగతా పాత్రలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంటాయి. మహేష్‌బాబుపైనే దర్శకుడు దృష్టంతా పెట్టాడు.
 
కథాపరంగా స్టప్‌ వుంది. సామాన్య ప్రేక్షకుడు కూడా తిరస్కరించలేని పాయింట్‌ ఇది. దీంతో అందరికీ కనెక్ట్‌ అవుతుందని దర్శక నిర్మాతలు, హీరోకూడా భావించాడు. అందుకే తన తండ్రి చేస్తున్న బుర్రిపాలెం ఊరిని దత్తత తీసుకున్నట్లు ఓ గ్రామాన్నికూడా దత్తత తీసుకుంటున్నట్లు మరీ ప్రకటించాడు. ఇప్పటికే బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్‌, ప్రియాంక చోప్రాలు కూడా ఓ గ్రామాన్ని దత్తతీసుకుని పాపులర్‌ అయ్యారు. లవ్‌ ట్రాక్‌ పరంగా మహేష్‌, శ్రుతి కొత్తగా వుంది. నువ్వు అందంగా వున్నావనేది.. నవ్వు అందంగా వున్నావ్‌ నీ ఇన్నర్‌లో అంటూ.. తెలివిగా చెప్పే డైలాగ్‌లు బాగున్నాయి. 
 
బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమాల్లో ఊరుకి ఏదో చేయాలనే చిత్రాలు కృష్ణ నటించారు. పాడిపంటలు, జగన్నాథ రథచక్రాలు ఇలాంటివే. పాటల్తో శ్రీశ్రీ వంటి గీతాలతో ఎమోషన్‌గా తీసేవారు. కానీ ఇందులో ఇప్పటి ట్రెండ్‌కు తగినట్లు యూత్‌ను దృష్టిలో పెట్టుకుని రాసుకున్న పాటలే. ఈ సినిమాకు ప్లస్‌ పాయింట్‌ మహేష్‌బాబే. ఒకేలా కనిపించినట్లుగా సన్నివేశపరంగా పలికే డైలాగ్స్‌లో వేరేషియేషన్‌ చూపించాడు. 
 
ఇక యాక్షన్‌ ఎపిసోడ్స్‌ కొత్తగా చూపించాలనే ట్రై చేశాడు. అయితే పతాక సన్నివేశాల్లో ఒక్కడే అందరినీ కొట్టడం మరీ సినిమాటిక్‌గా వుంది. ఊరి ప్రజలంతా కలిసి విలన్లను హతంచేస్తే కథ మరింతగా బాగుండేది. హీరోకు దక్కాలనేట్లుగా ఆయనే అంతమందిని కొట్టేసి ఊరిని కాపాడడం రొటీన్‌ ఫార్ములా. ఒక రకంగా 'దిమ్మతిరిగే' పాటలో శ్రుతి, మహేష్‌ పోటీగా డాన్స్‌ చేశారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంది.
 
లోపాలు... 
మొదటి భాగంలో కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది. దానికి కారణం 163 నిముషాల నిడివి గల కథ కావడమే. మొదట్లో శ్రీకాకుళం దగ్గర దేవరకొండ అని చెబుతూ... ఆ తర్వాత దేవరకోట అంటూ చూపిస్తారు. పలికే దానిల్లో స్పష్టతలేదు. ఇక సెకండాఫ్‌లో కథ సాగాలని కాబట్టి... తన కొడుకు ఊరిలో వున్నాడనే జగపతిబాబుకు విలన్లు చెప్పడం. ఆ తర్వాత చావుబతుల్లోవున్న మహేష్‌ను డాక్టర్లు రక్షించడం వంటివి... బలవంతంగా సెంటిమెంట్‌తో రుద్దినట్లుగా వుంది. మొత్తంగా చూస్తే.. ఎంటర్‌టైన్‌మెంట్‌ తగ్గిన ఈ సినిమా ఫ్యామిలీతో చూసే, ఫ్యామిలీ ఆప్యాయతలు, పండుగల విశేషాలను ఒక్కసారి రుచి చూపించే ప్రయత్నం చేశాడు. అందుకు అభినందించాలి. ఈ చిత్రాన్ని ఫ్యాన్స్‌, ప్రేక్షకులు ఏమేరకు ఆదరిస్తారో కొద్దిరోజుల్లో తేలిపోతుంది.
 
రేటింగ్‌: 3.5/5