శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , గురువారం, 3 ఆగస్టు 2017 (11:54 IST)

తెలంగాణ ఆత్మను, మట్టి పరిమళాన్ని పట్టుకున్న తొలి చిత్రం ఫిదా.. సుద్దాల అశోక్ భావోద్వేగ ప్రసంగం

వచ్చిండే మెల్లామెల్లగ వచ్చిండే.. పాట రాసి ఫిదా సినిమాలో ఒక విద్యుత్తేజాన్ని ప్రసరింపచేసిన మేటి రచయిత సుద్దాల అశోక్ తేజ. ఫిదా సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ సక్సెస్ బాట పడుతున్న రిపోర్టు విని జూలై 27

వచ్చిండే మెల్లామెల్లగ వచ్చిండే.. పాట రాసి ఫిదా సినిమాలో ఒక విద్యుత్తేజాన్ని ప్రసరింపచేసిన మేటి రచయిత సుద్దాల అశోక్ తేజ. ఫిదా సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ సక్సెస్ బాట పడుతున్న రిపోర్టు విని జూలై 27న హైదరాబాద్‌లో ఫిదా సంబరాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ సందర్బంగా ఫిదా దర్శకుడు శేఖర కమ్ముల తెలంగాణ ఆత్మను ఫిదా సినిమాతో ఎలా పట్టుకున్నాడో అత్యద్భుతంగా వర్ణించి చెప్పారు సుద్దాల అశోక్ తేజ. ఫిదా సినిమాపై ఇంతవరకు వచ్చిన అద్బుత ప్రసంగాల్లో ఒకటిగా తేజ ప్రసంగం నిలిచిపోయింది. ఫిదా సమీక్షను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. 
 
"ఫిదా సినిమాలో పాటలు నాతోపాటు పాటలు రాసిన వనమాలి గారిని, పింగళి చైతన్య గారిని, మా గురువుగారు సిరివెన్నెల సీతారామశాస్రి గారిని ముందుగా నేను గుర్తుచేసుకుంటున్నాను. అలాగే ఫిదా సంగీత దర్శకుడు శక్తి గారికి చాలా పెద్ద బ్రేక్ వచ్చిందనుకుంటున్నాను. మొదటగా నిర్మాత దిల్ రాజుగారికి, దర్సకుడు శేఖర్ కమ్ముల గారికి థ్యాంక్స్ చెబుతున్నాను. అష్టావధానంలో కొన్ని పదాలు ఇచ్చి, దత్తపది అనే ఒక పద్యాన్ని పూర్తి చేయమంటారు. అంటే ఐశ్వర్య, సౌందర్య వంటి నాలుగు పదాలనిచ్చి వాటికి సమానంగా పద్యం రాయమంటూ అష్టావధానికి చెబుతారు. ఆ పదాలతో అద్భుతంగా రాసేస్తారు అష్టావధాని. ఇవ్వాళ వచ్చిండే అనే పాట ఇంత సక్సెస్ కావడానికి దర్శకుడు శేఖర్ కమ్ముల కారణం...
 
...పాట రాయడానికి నన్ను పిలిచినప్పుడు ఆయన ఒకటి చెప్పారు.  హైదరాబాద్‌లో పుట్టి పెరిగినందుకేమో మరి తెలంగాణా పదాల గురించి ఆయనకు బాగా తెలుసు. ఈ పాటలో కొన్ని పదాలు నేను కచ్చితంగా చెబుతాను. ఇస్కిచ్, గాయబ్, మస్తుగున్నాడే.. డిస్టర్బ్ జేసిండే..ఇట్లా కొన్ని పదాలు పాటలో ఉంటే బాగుంటది  అంటూ నన్ను సూటిగా పాటవైపు వెళ్లేలా ఫోర్స్ చేశారు దర్శకుడు. అలా మీరు చెప్పడం వల్ల నాకు పాట రాయడం చాలా సులువైంది.  నేను తెలంగాణలోనే పుట్టి పెరిగాను కాబట్టి తెలంగాణపై అద్బుతమైన పాటలు రాసిన మా నాన్న సుద్దాల హనుమంతు ఉన్నారు కబాట్టి ఆయన ప్రేరణతో నేను వచ్చిండే పాటను అల్లుకుపోయాను...
 
..సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 23 సంవత్సరాలు అయింది. ఈ సినిమా హీరో వరుణ్ తేజ్ నాన్న నాగబాబు గారిని ఉద్దేశించి చెబుతున్నాను. మీ అబ్బాయిని కూడా నేను నా పాట రూపంలో ఒక క్యాపిటల్‌గా వాడుకున్నాను.  ఈ పాట రాయడంలో నా అదృష్టం ఏమిటంటే శేఖర్ కమ్ముల, వరుణ్ తేజ్ ఇద్దరూ పొడుగే.. ఈ పాట ఇలా రాస్తేనే బాగుంటుంది అని నేను చెబితే వరుణ్ తేజ్‌కి ఈ సాంగ్ ఫర్‌ఫెక్టుగా సూట్ అవుతుంది అని చెప్పారు శేఖర్. నేను ఈ పాట రాయడానికి కష్టపడలేదు అని చెప్పడానికే ఇవన్నీ చెబుతున్నాను. ఉన్న ప్రతీకలను వాడుకుంటూ చాలా 
ఈజీగా రాసేశాను అని చెప్పడమే నా ఉద్దేశం....
 
...తర్వాత.. మన ఎదురుగా ఒక కొత్త తండ్రి పుట్టారు. సాయిచంద్ గారు. సినిమాలోకంలోకి ఆయన రూపంలో ఒక కొత్త ఫాదర్ వచ్చారు. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ శుభాకాంక్షలు చెబుతున్నాను...
 
...తెలంగాణ యాస అనేది సినిమాల్లోకి కొత్తగా రాలేదు. ప్రత్యేకమైన పాత్రలకు మాత్రమే తెలంగాణ యాసను వాడుతున్న క్రమంలో, తెలంగాణలో పుట్టిన రచయితగా చెబుతున్నాను. మొట్టమొదటి సారిగా తెలంగాణ భాషలో, యాసలో ఉన్న నిసర్గ సౌందర్యాన్ని, ఆత్మ సౌందర్యాన్ని సినిమా మొత్తంలో అంటే మొదటి సీన్ నుంచి చివరి సీన్ వరకు తెలంగాణ భాషలోని ఆ మట్టి పరిమళాన్ని మొట్టమొదటి సారిగా సినిమాలో చూపించినందుకు, అలా రాసినందుకు నిజంగా తెలంగాణ ప్రజల తరపున మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శేఖర్ గారూ. ఇది సామాన్యమైన పని కాదు. వ్యంగ్యంగా, సెటైర్‌గా తెలంగాణ మాటను అంటే అందరం నవ్వేస్తాం. కానీ తెలంగాణ మాట వింటే నవ్వడం కాదు ఏడుస్తాము అనే విషయాన్ని మొట్టమొదటి సారిగా మీనుండి నేను చూశాను....
 
..అలాగే యాసకైనా, భాషకైనా, భావోద్వేగాలకైనా.. భౌగోళిక బేదాలు, భాషా భేదాలు ఉండవు. లాంగ్వేజ్ నీడ్స్ నో టియర్స్ అండ్ లాఫ్స్. కన్నీళ్లకు, నవ్వులకు భాష అక్కరలేదు. అలాగే భావోద్వేగాలకు భౌగోళికమైన వాటికి సంబంధం లేదు అన్న దాన్ని మీరు అద్భుతంగా రాసి చూపారు. మీరు గొప్ప దర్శకుడు అని మాకు తెలుసు. కానీ ఈ సినిమాలో ఇంత గొప్పగా మీరు మాటలు రాసినప్పుడు నేను ఫిదా అయిపోయాను. హీరోగారూ, హీరోయిన్ గారూ మీరు ఏమనుకోవద్దు. మీ ఇద్దరికీ కాకుండా నేను శేఖర్ సర్‌కి మొదట ఫిదా అయ్యాను...
 
..అసలు ఫిదా అంటే ఏంటి అన్నవాళ్లకు ఓ...  ఫిదా అంటే ఇదా అనుకుంటున్నారు. పిదా అనే పదానికి చాలామందికి అర్థం తెలీదు.  అది ఉర్దూ మాట. ఈ సినిమాలో ఒక సీన్‌లో నేను కన్నీళ్లు పెట్టుకున్ని దృశ్యాన్ని చెబుతాను. సినిమాలో పెద్ద పాపగా నటించిన శరణ్య కొంగు ముడి వేసుకుని తండ్రితో మాట్లాడుతా ఉంటుంది. ఆ కొంగు ముడి పట్టుకున్న మా సీతారామ శాస్త్రిగారి అబ్బాయి అలా వెళ్లిపోతాడు. వెళ్లిపోగానే తండ్రితో మాట్లాడుతున్న ఆ అమ్మాయి అలా లాగినట్లు అయిపోతుంది. తండ్రితో మాట్లాడబోయిన ఆ అమ్మాయి కొంగును అలా లాగేస్తే...అక్కడ ఏ డైలాగులూ లేవు...
 
..పెళ్లి పిల్లాడు వచ్చిన తర్వాత కన్నతండ్రికి అమ్మాయి దూరం కావలసిందే. తండ్రితోటి మాట్లాడటానికి ఆ సమయమూ, ఆ సామీప్యతా, ఆ ఆర్దతను మిస్సయిపోతాము అనే విషయాన్ని నేనయితే రెండు పేజీల్లో రాస్తాను శేఖర్ గారూ. కానీ మీరు ఒక్క మాట కూడా అవసరం లేకుండా స్క్రీన్ ప్లే రాసారు కదా.. అక్కడ నేను కన్నీళ్లు పెట్టుకోవడం గొప్ప విషయం కాదు.మా ఆవిడండీ, ఆమె ఏడో తరగతి చదివింది. పెద్దగా చదువరి కాదు. ఆమె ఏడ్చేసింది. అక్కడ నో డైలాగ్. అందుకే నేను మీకు ఫిదా చెబుతున్నాను. ..
 
..అలాగే పెద్దమ్మాయి టాబ్లెట్ ఇస్తుంటుంది. ఆమె పెళ్లి చేసుకుని వెళ్లిపోతుంది కాబట్టి చిన్నమ్మాయికి ఇస్తుంది రేపటినుంచి నువ్వే ఇవ్వాలని. నిజంగానే నేను ఫీలవుతున్నాను. ఆ తర్వాత సాయిచంద్ గారు తన టాబ్లెట్ తానే వేసుకుంటాడు. ఇక్కడ కూడా డైలాగ్ లేదండి. అప్పుడు సాయిచంద్ గారికి మీకూ మళ్లీ ఫిదా అయిపోయాను. ..
 
..ఆడియో కార్యక్రమంలో ఆరోజు నేను మాట్లాడలేదు. కానీ ఈరోజు నేును ఒక గీతరచయితగా కాకుండా 50 ఏళ్లుగా నేను పుట్టి పెరిగిన తెలంగాణ పక్షాన నేను ఇవ్వాళ బాధ్యతపడి మాట్లాడుతున్నాను. ఇది అవసరంగా నేను మాట్లాడుతున్నాను. ఎక్కువ టైమ్ మాట్లాడుతున్నాను. ఒప్పుకుంటాను. కాని ఇవ్వాళ ఇక్కడ నేను ఇది మాట్లాడటం ఒక అవసరం, ఒక ఆగత్యం, ఒక చారిత్రక సందర్భం కాబట్టి అవసరంగా నేను మాట్లాడుతున్నాను...
 
..పోతే చతుర్విధ అభినయాల్లో సాత్వికం చాలా కష్టం. క్రౌర్యాన్ని అద్భుతంగా పలికించవచ్చు. కానీ జింకపిల్లలాగా ఉన్న సాయి పల్లవితో ఎక్కడా కదలకుండా, మెదలకుండా కంటి చూపులతో పెదవి విరుపులతో ఉఫ్ అనేటటువంటి చిన్ని చిన్ని ఎక్స్‌ప్రెషన్లతో సినిమా మొత్తంలో పరిగెడుతున్న జింకతో  నిలబడి మెయిన్‌టెయన్స్ చేసిన వరుణ్ తేజ్‌కి మాత్రం నేను చేతులెత్తి హ్యాట్సాఫ్ చెబుతున్నాను. అలా చేయడం ఈజీ విషయం కాదు. ఆ అమ్మాయిని అలా మీరు ఎగురకూడదు. అలా మీరు మాట్లాడకూడదు అంటూ మెత్తగా చెప్పడం..నేను అద్భుతంగా ఫీలయ్యాను. అందుకే నా పాట మీద కాకుండా మిగతా విషయాలే చెప్పా. మరొక్క సారి శేఖర్ సర్‌కి భావోద్వాగాలకు భాషా భేదాలు, భౌగోళిక భేదాలు లేవని నిరూపించినటువంటి ఒక దృశ్యం శిల్పి, దృశ్య కావ్య కర్త శేఖర్ కమ్ములు గారికి అలాగే తొలిసారే అయినప్పటికీ అద్భుతమైన బ్రేక్ తెచ్చుకున్న సంగీత దర్శకుడు శక్తి గారికి ధన్యవాదాలు చెబుతున్నా. ఇంకో విషయం ఏమిటంటే. మాతో పాటు సమానంగా ఊసుపోదు పాట రాసిన అమ్మాయి చైతన్య పింగళికి, నాకన్న ఒక వంద మార్కులు ఎక్కువ తెచ్చుకున్నందుకు నిజంగా నిన్ను అభినందిస్తున్నానమ్మా.. థాంక్యూ. 
 
ఇక వనమాలి. మేమిద్దరం చాలా కాలంగా పాటలు రాస్తున్నాం. కానీ నేను రాయవలసిన తెలంగాణ పాటను వనమాలి చేత రాయించారు. చిన్న అసూయ కలిగింది అబ్బ.. ఏంది పిల్లగాడ, గుండె కాడ. ఈ లొల్లి.. ఈ లొల్లి అనేది మాది కదా. నాది కదా.. వనమాలికి ఎట్లొచ్చె.. అనుకున్నాను. సూపర్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్యూ. 
 
నేను కూడా భావోద్వేగానికి గురై ఫిదా అయ్యాను కాబట్టే ఈ మాటలన్నీ మాట్లాడాను. థాంక్యూ..