ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్

''ప్రాజెక్ట్-కె'' లో విశ్వనటుడు : అధికారికంగా ప్రకటించిన టీమ్‌

kamal haasan
హీరో ప్రభాస్ - దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం "ప్రాజెక్టు-కె". ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఈ సినిమా నుంచి ఓ క్రేజీ అప్‌డేట్‌ను పంచుకుంది చిత్రబృందం. ఈ భారీ ప్రాజెక్ట్‌లో మరో స్టార్‌ హీరో భాగం కానున్నట్లు తెలిపింది. గతకొన్నిరోజులుగా ఈ సినిమాలో అగ్ర కథానాయకుడు కమల్‌ హాసన్‌ నటిస్తున్నారంటూ వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. 
 
ఇప్పుడు ఇదేవిషయాన్ని ఖరారు చేస్తూ మూవీ టీమ్‌ ప్రకటన విడుదల చేసింది. కమల్‌ హాసన్‌ ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓ ప్రత్యేక వీడియోను 'ప్రాజెక్ట్‌-కె' బృందం విడుదల చేసింది. ఇక ఇందులో కమల్‌ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. 
 
అలాగే, ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణే, దిశా పటానీ ముఖ్యపాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మునుపెన్నడు చూడని భారీ దృశ్యరూప చిత్రంగా, అతిపెద్ద సైన్స్‌ ఫిక్షన్‌ డ్రామాగా ఇది తెరకెక్కుతోంది.
 
ఇప్పటికే దాదాపు 80 శాతం షూటింగ్‌ పూర్తయినట్లు తెలుస్తోంది. 'ప్రాజెక్ట్‌ కె' అనే వర్కింగ్‌ టైటిల్‌తో మొదలైన ఈ సినిమా పేరుని, మోషన్‌ పోస్టర్‌ని జులై 3న అమెరికాలో ఆవిష్కరిస్తున్నట్లు సమాచారం. ఆ దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.