శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: మంగళవారం, 25 ఆగస్టు 2015 (20:11 IST)

మురళీమోహన్ అనగానే పరుగులు తీశారక్కడికి... కానీ అక్కడ ఏం జరిగిందంటే...

రాష్ట్రం విడిపోయింది. కెసిఆర్‌, చంద్రబాబు ఇద్దరూ తెలుగు రాష్ట్రాలని పాలిస్తున్నారు. చంద్రబాబు కూడా విజయవాడ నుంచే పాలన సాగిస్తున్నారు. అలాంటిది హైదరాబాద్‌లో వున్న ఫిలిం ఛాంబర్‌ రెండుగా విడిపోవడంలో తప్పులేదని పలువురు నిర్మాతలు పట్టుపడుతున్నారు. వారంతా మీడియా ముందుకు వచ్చి అత్యవసర సమావేశం అంటూ.. మెసేజ్‌లు ఇచ్చి విలేకరులను ఆహ్వానించారు. కానీ అక్కడ ప్రముఖ నిర్మాతలెవ్వరూ లేకపోగా, ఇటీవలే ఛాంబర్‌ ఎన్నికల్లో ఓడిపోయిన కొందరు కన్పించేసరికి మీడియా షాకైంది. 
 
మురళీమోహన్‌ అత్యవసర సమావేశం అని మెసేజ్‌లో వుంది. కానీ ఛాంబర్‌ ఎగ్జిక్యూటివ్‌ మురళీమోహన్‌రావు అనే వ్యక్తి వున్నాడు. ఆయన కనపడేసరికి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇందుకు మీడియా అంతా... లైవ్‌లు ఏర్పాటు చేసుకున్నారు. దానికి కారణం. మురళీమోహన్‌ అనే పేరు వుండడంతో పాటు.. పవన్‌ కళ్యాణ్‌.. మురళీమోహన్‌పై ఏదో అన్నాడనీ, దాని గురించి వివరణ ఇస్తారని భావించారు. మరోవైపు. డి.సురేష్‌ బాబు అక్రమాలు అంటూ ఆయన చేసిన పనుల్ని ఎండగడుతున్నట్లు వారంతా చెప్పారు. అయితే చివరికి వారు చెప్పింది ఏమంటే...
 
1) డి.సురేష్‌బాబు థియేటర్లలో శ్రీమంతుడు సినిమాను వారే బ్లాక్‌లో అమ్ముతున్నారు. దీనిపై ప్రశ్నిస్తే.. మీకు సంబంధం లేదని తిరిగి ప్రశ్నిస్తున్నారు.
 
2) డి. సురేష్‌బాబు ఎన్నికల్లో అక్రమాలు చేసి గెలిచారు. ఇందుకు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి.
 
3) తెలుగు అనేపదం మనది కాదా! అని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తే ఏమని చెప్పాలి.. అందుకే తెలుగు ఫిలింఛాంబర్‌ ఆఫ్ కామర్స్‌ను తెలివిగా ఆ పెద్దలు పేరు మార్చారు. కానీ దానికి మేం వ్యతిరేకం. తెలంగాణ తెలుగు ఛాంబర్‌, ఆంధ్ర తెలుగు ఛాంబర్‌ అని పేర్లు మార్చాలి.
 
4) రెండుగా విడిపోతే... మా ఎగ్జిబిటర్‌, డిస్ట్రిబ్యూర్‌, నిర్మాతల సమస్యలు పరిధి మేరకు పరిష్కరించేందుకు వీలుంటుంది.
 
5) ఇద్దరి సమస్యల్ని సినీ పెద్దలు దాసరి వంటివారు ఎవరైనా సరైన సంధానకర్తగా వుండి పరిష్కరించాలి.
 
కాగా, వీటిపై రేపు.. అంటే బుధవారం నాడు ఛాంబర్‌ ఎగ్జిక్యూటివ్‌ సమావేశంలో వారంతా ప్రస్తావించనున్నారు. కర్టెన్‌రైజర్‌గా ముందురోజు మీడియాకు చెప్పారు. అదీ సంగతి.