శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 3 డిశెంబరు 2016 (16:17 IST)

రాంగోపాల్ వర్మకు 'వంగవీటి' రాధా డేంజరస్ వార్నింగ్... అయినా వెనక్కి తగ్గేది లేదంటున్న ఆర్జీవీ

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు వంగవీటి రాధా డేంజరస్ వార్నింగ్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. వంగవీటి చిత్రంలో తన తండ్రి పాత్రను నెగెటివ్‌గా చూపించినట్టయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తు

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు వంగవీటి రాధా డేంజరస్ వార్నింగ్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. వంగవీటి చిత్రంలో తన తండ్రి పాత్రను నెగెటివ్‌గా చూపించినట్టయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ ఆయన డైరక్టుగా హెచ్చరిక చేసినట్టు సమాచారం. గతంలో విజయవాడ రాజకీయాలకు కేంద్రబిందువుగా ఉన్న వంగవీటి రంగా జీవిత కథ ఆధారంగా వంగవీటి చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించారు. వాస్తవ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని ఆయన నిర్మించారు. అయితే, ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు కొందరి మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ వంగవీటి రాధా, మరికొందరు హైకోర్టులో వేసిన పిల్‌పై శుక్రవారం విచారణ జరగడం, ఈ సినిమాలోంచి ‘కమ్మ కాపు’ పాటను తీసేస్తామని కోర్టుకు సినిమా నిర్మాతలు నివేదించడంతో, విచారణను కోర్టు పూర్తి చేయడం కూడా తెలిసిందే. 
 
అయితే, దీంతో సంతృప్తిపడని రాధా అభిమానులు శనివారం విజయవాడలోని కేఎల్ విశ్వవిద్యాలయంలో జరగనున్న ఈ సినిమా ఆడియో విడుదల లోపు సినిమాను రాధా కుటుంబ సభ్యులకు చూపించి, ఆ తర్వాత సెన్సార్‌కు పంపాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం నుంచి బెజవాడలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో రాధా కుటుంబ సభ్యులను కలిసి, తన ప్రయత్నాలను వాళ్లకు వివరించాలని నిశ్చయించుకున్న వర్మ విజయవాడ వచ్చీ రావడంతోనే వంగవీటి రంగా భార్య రత్నకుమారి, రంగా కుమారుడు రాధాకృష్ణతో సమావేశమయ్యారు. 
 
మొట్టమొదటిసారి రంగా కుటుంబ సభ్యులతో వర్మ భేటీ కావడంతో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. భేటీ ముగిసిన తర్వాత వర్మ తన ట్విట్టర్‌లో సమావేశ వివరాలను ట్వీట్ చేశాడు. కొద్దిసేపటి క్రితమే రంగా కుటుంబ సభ్యులను కలిశానని, భేటీ సంతృప్తికరంగా జరగలేదని ట్వీట్ చేశాడు. సమస్యలున్నాయని, కానీ తాను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, ఏం జరుగుతుందో చూద్దాం అంటూ ట్వీట్ చేశాడు. తాను ఇలాంటి సీరియస్ వార్నింగ్స్‌ చాలా చూశానని, కానీ నవ్వుతూ బెదిరించడం తొలిసారి చూశానని, ఇది చాలా ప్రమాదకరమని.. అయినప్పటికీ ‘వంగవీటి’ సినిమాపై వెనక్కు తగ్గేదే లేదని స్పష్టం చేశాడు.