గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 మే 2022 (17:11 IST)

ఆస్పత్రి కాదు... ఉపాధి చూపించండి.. చిరుకు కోట కౌంటర్

kota Srinivasa Rao
సినీ కార్మికుల కోసం ఓ ఆస్పత్రిని నిర్మిస్తానంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాస రావు కౌంటర్ ఇచ్చారు. ఆస్పత్రి నిర్మాణం కాదు ఆకలితో అలమటిస్తున్న కార్మికులకు మూడు పూటల అన్నం తినేలా ఉపాధి కల్పించాలని ఆయన కోరారు. 
 
ఇదే అంశంపై ఆయన తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడుతూ, ఇటీవల మే డే రోజు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఏర్పాట్లు చేసిన కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ, సినీ కార్మికుల కోసం ఆస్పత్రిని కడతానని చెప్పడం సరైంది కాదన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ప్రచారానికి ఉపయోగపడతాయేగానీ, కార్మికులకు ఏమాత్రం లాభించవన్నారు. అందువల్ల చిరంజీవి అనవర హామీలు ఇవ్వడం మానుకోవాలన్నదే తన కోరిక అన్నారు. 
 
ముఖ్యంగా, ఇలాంటి హామీ ఇచ్చేబదులు ఉపాధి లేక, పనికోసం అలమటిస్తున్న సినీ కార్మికులకు ఉపాధి చూపించాలని హితవు పలికారు. సినీ కార్మికులు రోజుకు మూడు పూటలు తిండి కోసం అల్లాడుతుంటే చిరంజీవి ఆస్పత్రి కడతానని చెప్పటం భావ్యం కాదన్నారు. 
 
ఇలాంటి పరిస్థితుల్లో వారికి ఏదైనా పని కల్పించి ఓ దారి చూపించాలి కానీ, ఇపుడు ఆస్పత్రి అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. కార్మికులకు ఉపాధి చూపిస్తే నాలుగు డబ్బులు సంపాదించుకుంటారని, ఆ డబ్బుతో వారు ఏ ఆస్పత్రిలో అయినా వైద్యం చేయించుకుంటారని అన్నారు.