తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన దిగ్గజ దర్శకుడు, నిర్మాత యు. విశ్వేశ్వర రావు విశ్వేశ్వర రావు ఇకలేరు. ఆయన 92 సంవత్సరాల వయసులో చెన్నైలో గురువారం ఉదయం చనిపోయారు. కరోనా సోకిన ఆయన టి నగర్‌లోని హబీబుల్లా రోడ్డు 3వ వీధిలోని ఆయన సొంత నివాసంలోనే కన్నుమూశారు. ఈయన స్వర్గీయ ఎన్టీరామారావు గారి వియ్యంకులు. ఎన్టీఆర్ కుమారుడు మోహన్ కృష్ణకు మామ. విశ్వేశ్వర రావు కుమార్తె శాంతిని మోహన్ కృష్ణ పెళ్లి చేసుకున్నారు. కానీ, కరోనా వైరస్ కారణంగా చనిపోవడంతో విశ్వేశ్వర రావు మృతదేహాన్ని చెన్నై కార్పొరేషన్ సిబ్బంది వచ్చి తీసుకెళ్లారు.
దీనిప్ ప్రముఖ తెలుగు నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ మాట్లాడుతూ, విశ్వేశ్వర రావుకు ఇద్దరు అమ్మాయిలు, మంజు, శాంతి, కుమారుడు ధనుంజయ్. నిర్మాత దర్శకుడుగా విశ్వేశ్వర రావు తెలుగు సినిమాకు ఆణిముత్యాల లాంటి సినిమాలు అందించారు. నిరాడంబరుడు, నిగర్వి, ఉన్నదున్నట్టు మాట్లాడే స్వభావం కలిగినవాడు.
నిర్మాత, దర్శకులు యు.విశ్వేశ్వరరావు సంపన్నుల కుటుంబంలో జన్మించాడు. వీరికి మూడుసంవత్సరాల వయసు ఉన్నప్పుడే తండ్రి మరణించాడు. మేనమామ ఇతనిని చేరదీశాడు. 8 సంవత్సరాల వయసు వచ్చేవరకు అక్షరాభ్యాసం జరగలేదు. ఆ తర్వాత బడికి వెళ్లినా చదువు ఆగిపోయింది. అప్పుడు వ్యవసాయం చూసుకునే వాడు. వీరి బావ దావులూరి రామచంద్రరావు ఇతడిని బాగా చదివించాలని నిర్ణయించాడు.
ఫలితంగా ఇతడు తన 14వ యేటనుండి ముదినేపల్లి, గుడివాడ, ఏలూరు, విజయనగరాలలో చదివి బి.ఎస్.సి.పట్టా సంపాదించాడు. తరువాత గుడివాడ హైస్కూలులో ఉపాధ్యాయుడిగా చేరాడు. తనకు చదువు చెప్పిన టీచర్ల సరసనే సహ ఉపాధ్యాయుడిగా పనిచేయడం అతనికి వింతగా అనిపించింది.
సినిమా నిర్మాతలు అట్లూరి పూర్ణచంద్రరావు, గుడివాడ స్కూలులో వీరికి శిష్యులు. తరువాత గుడివాడలో జనతా ట్యుటోరియల్ ఇన్‌స్టిట్యూట్ స్థాపించి కొంతకాలం నడిపాడు. వీరికి విదేశాలలో వెళ్ళి చదువుకోవాలనే ఆసక్తి ఉండేది. కాని అతని బావ ఎన్.టి రామారావు ప్రోద్బలంలో సినిమా రంగంలోనికి అడుగు పెట్టారు.
మొదట ఇతడు పి.పుల్లయ్య వద్ద దర్శకత్వ శాఖలో సహాయకుడిగా చేరాడు. కన్యాశుల్కం, జయభేరి చిత్రాలకు పుల్లయ్య వద్ద పనిచేశాడు. ఆ సమయంలో బాలనాగమ్మ సినిమాకు తమిళ డబ్బింగ్ హక్కులు కొని నిర్మాతగా మారాడు. ఆ చిత్రం విడుదలై అతడికి లాభాలు తీసుకువచ్చింది. దానితో తన కుమార్తె శాంతి పేరుతో విశ్వశాంతి అనే సంస్థను స్థాపించి 15 తమిళ, తెలుగు డబ్బింగ్ సినిమాలు నిర్మించాడు.
ఆ ఉత్సాహంతో రామారావుతో కంచుకోట, నిలువు దోపిడి, పెత్తందార్లు, దేశోద్ధారకులు వంటి భారీ చిత్రాలను నిర్మించి విజయవంతమైన నిర్మాతగా పేరు సంపాదించుకున్నాడు. విశ్వేశ్వర రావు తన ఆశయాలను ప్రతిబింభించే చిత్రాలను నిర్మించాలనే ఉద్దేశంతో అలాంటి చిత్రాలకు దర్శకత్వం వహించేందుకు ఎవరూ ముందుకురారని తనే దర్శకుడిగా మారారు.
ఈయన మహానటుడు రామా రావు గారితో కంచుకోట (1967), నిలువు దోపిడి (1968), పెత్తందార్లు (1970), దేశోద్ధారకులు (1973) వంటి చిత్రాలను నిర్మించారు. అలాగే, తీర్పు (1975), నగ్నసత్యం (1979), హరిశ్చెంద్రుడు 1981), కీర్తి కాంత కనకం, (1983) వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలు అప్పటి సామాజిక సమస్యలపై ఎక్కుపెట్టిన అస్త్రాలుగా చెప్పవచ్చు.
1986లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్.టి.రామారావు వున్నప్పుడు హైదరాబాద్‌లో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం జరిగింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులుగా యు. విశ్వేశ్వర రావు, ఆంధ్ర ప్రదేశ్ చలన చిత్ర అభివృద్ధి సంస్థ అధ్యక్షులుగా డి.వి.ఎస్ రాజు వున్నారు. ఆ చిత్రోత్సవం అంత ఘనవిజయం కావడానికి రామారావుకి చేదోడు వాదోడుగా వున్నది రాజు, విశ్వేశ్వర రావు.
ఎన్.టి. రామారావు కుమారుడు మోహన కృష్ణ కు విశ్వేశ్వరరావు రావు అమ్మాయి శాంతిని ఇచ్చారు. అలా రామారావుకి విశ్వేశ్వర రావు వియ్యంకుడు. అలాగే నటుడు, నిర్మాత మాగంటి మురళి మోహన్ కుమారుడు రామమోహన్‌కు విశ్వేశ్వర రావు మనవరాలు అంటే మంజు కుమార్తె రూపతో వివాహం జరిగిందని వివరించారు.