1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: మంగళవారం, 21 జులై 2015 (20:04 IST)

ప్రముఖ రంగస్థల తొలి తరం సినీ నటి టి.కనకం కన్నుమూత

తెనుగు కనకం.. తొలి తరం నటీమణుల్లో ఒకరు. చిన్నతనంలోనే నటి అయిన ఆమె బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమాల్లో చాలా పాత్రలు పోషించారు. ఒక్కో సినిమాకు 30 నుంచి 40 వేల పారితోషికం తీసుకున్న రోజుల్లో ఆమె ఇల్లు కనకంలా కళకళలాడేది. బంధువులంతా దరిచేరారు. 12 ఏటనే పెండ్లి చేయాలనుకుంటే ఇంటి నుంచి పారిపోయి మదరాసు చేరింది. అక్కడ సినిమాల్లోకి ప్రవేశించింది. కాసుల గలగల మధ్య పెరిగిన ఆమె.. విధి రాత.. నడి వయస్సులో... ప్రమాదంలో.. నడుంకు తీవ్రమైన గాయమైంది. అంతే.. ఆమె నడిచే స్థితిలోకి రాలేకపోయింది. మంచానికే పరిమితమైంది. బంధువులంతా దూరమయ్యారు... వేలకువేలు మందులకు ఖర్చయింది. విజయవాడలో పెజ్జోనిపేటలో ఉన్న ఆమె మంగళవారం... అనగా 21.7.2015న ఉదయం 7గంటలకు మరణించింది. 88 ఏళ్ళ వయసులో చివరికి అనారోగ్యంతో విజయవాడలో కన్నుమూశారు.
 
నేపథ్యం..
ఒకప్పుడు రంగస్థల నటులంటే ప్రజల్లో ఎంతో ఆకర్షణ వుండేది. ఈలపాట రఘురామయ్య, అద్దంకి శ్రీరామమూర్తి, స్థానం నరసింహారావు, వేమూరి గగ్గయ్య లాంటివారు నాటక ప్రదర్శనకు ఆయా ఊళ్ళలో వస్తే జనం విరగబడి వచ్చేవారు. అదేవిధంగా అప్పట్లో ఆడవారి పేర్లు కొన్ని జగత్ప్రసిద్ధాలు... వాటిల్లో ఒక పేరు కనకం! ఇప్పటికీ ఏ రేలంగో, చలమో, రాజబాబో నంగినంగి మాటలతో కనకం... కనకం... అంటూ తమ ఉపకథానాయిక చుట్టూ తిరిగే సన్నివేశాలు పాత సినిమాల్లో కనిపిస్తూనే ఉంటాయి. 
 
స్త్రీ పాత్రలను, పురుష పాత్రలను సమ ప్రతిభతో పోషించి రక్తి కట్టించిన వారిలో కనకం ఒకరు. అందుకే ఆమె 'చింతామణి'గా ఎంత పేరు సంపాదించారో కృష్ణ, నారద వంటి పాత్రల్లోనూ అంతే పేరు తెచ్చుకోగలిగారు. విజయవాడ కృష్ణమ్మ ఒడ్డున పిచ్చికగూళ్ళు కట్టుకున్న బాల్యాన్ని కనకం తన గుండెల్లో పదిలపరచుకోగలిగారు. 1927లో ఖరగ్‌పూర్‌లో అప్పారావు, సోళాపురమ్మ దంపతులకు జన్మించిన టి.కనకం, హైస్కూల్లో చదివే రోజుల్లోనే చక్కని తెలుగు, హిందీ పాటలు పాడుతూ అందర్నీ ఆకట్టుకునేవారు. ఉపాధ్యాయులు ఆమె పాటని ప్రోత్సహించారు. ఇంట్లోనూ ఆటపాటలకు ఆదరణ ఉండటంతో, చదువుతో పాటు ఆటపాటల్లోనూ ఆమె రాణించారు. స్వయంగా కుటుంబ సభ్యులు, బంధువులైన హార్మోనిస్టు దుర్గారావు, నటులు నల్లంచి అప్పారావులు ఆమెకు ప్రేరణగా నిలిచారు. 
 
1948లో గుంటూరుకి చెందిన ''నాట్యసమితి'' స్థాపకులు కూర్మా వేణుగోపాల స్వామి ''ప్రతిమాసుందరి'' నాటకం చేపట్టారు. అందులో ప్రతిమాసుందరి వేషం పవర్‌తో వేయిస్తే బాగుంటుందో అని అన్వేషిస్తున్నపుడు కనకం పేరును కొందరు ప్రతిపాదించారు. నిండైన యవ్వనం, చక్కని గాత్రం, అభినయం అన్నీ నచ్చడంతో కూర్మా వేణుగోపాలస్వామి ప్రతిమాసుందరి పాత్రకు కనకంని ఎంపిక చేశారు. ఆ నాటిక రచయిత, దర్శకులు కూడా ఆయనే. అందువల్ల కొత్త నటి అయిన కనకం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సంభాషణలు పలకడం మొదలుకొని హావభావాలు అన్నీ నేర్పించారు. సూక్ష్మగ్రాహి అయిన కనకం ప్రతిమాసుందరి పాత్రకి జీవం పోసి నాటకాభిమానుల ప్రశంసలేకాదు, విమర్శకుల మెప్పు సైతం పొందారు. దాదాపు అదే సమయంలో వావిలాల సోమయాజులు ''నాయకురాలు'' నాటకం చేపట్టారు. అందులో ఆనాటి మేటి నటీనటులుగా పేరుపొందినవారు నటించారు. 
 
ఎన్‌.టి.రామారావు, పాతూరి రామశాస్త్రి, పూర్ణిమ, సినీ దర్శకులు మల్లికార్జునరావు తదితరుల సరసన కనకం నటించారు. ఆమె ధరించిన పాత్ర మంచాల. ఆమె సరసన నటించిన 'బాలచంద్రుడు' మల్లికార్జునరావు. ఆ నాటకానికి ఎంతో ప్రత్యేకత ఉంది. అలాగే చారిత్రక ప్రాధాన్యం కూడా ఉంది. ఆ నాటకాన్ని దాని నిర్వాహకులు తోట రత్తయ్య, యడవల్లి అబద్ధయ్య తదితరులు విజయవాడ, గుంటూరు, తెనాలి, బాపట్ల వంటి ప్రాంతాలకే పరిమితం చేయక ఆంధ్ర దేశంలో బరంపురం నుంచి మద్రాసు వరకు అనేక వేదికల మీద ప్రదర్శించారు. అంతేకాదు ఇతర రాష్ట్రాలలోను ఎన్నో ప్రదర్శనలిచ్చారు. అలా మాంచాలగా కనకం తన నాటక విన్యాసాన్ని వేలాది నాటక ప్రియులందరి ముందు ప్రదర్శించగలిగారు. అటువంటి నాటకప్రియుల్లో ఒకరుగా ఆ నాటకాన్ని చూసిన సినీ దర్శకులు బి.ఎ.సుబ్బారావు ఆమెని సినిమాలకు పరిచయం చేయడం విశేషం. 
 
ప్రతిభావంతులకి ఏ చిన్న అవకాశం వచ్చినా దాన్ని వారు సమర్థంగా ఉపయోగించుకోగలిగితే అవకాశాలకు కొదవుండదు. కనకం విషయంలో అదే జరిగింది. సినిమాల్లో వెంటవెంటనే ఆమెకు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. కీలుగుర్రం, షావుకారు, పల్లెటూరి పిల్ల, గుణసుందరి, లేత మనసులు, అవే కళ్ళు, భక్తప్రహ్లాద... ఇలా తెలుగు తమిళ చిత్రాల్లో నటించి కనకం మంచి పేరు పొందారు. ఆమె పాటలు కూడా పాడగలగడంతో అప్పటి సినీనటులు నల్లరామమూర్తితో కలసి గ్రామ ఫోన్‌ రికార్డులు కూడా ఇచ్చారు. అలా ఆమె ఒకవైపు నాటకరంగంలో ఉంటూనే మరోవైపు చిత్ర రంగంలోనూ రాణించారు. కనకం నటిగా 'చింతామణి' పాత్రలో బాగా రాణించారని నాటి విమర్శకులంటారు. ఆమె 'చింతామణి'గా నటిస్తున్న సందర్భంలో పల్లెల నుంచి ఎడ్ల బండ్లు కట్టుకొని నాటక ప్రియులు వచ్చేవారని, ఆ పాత్ర ఆమెకు అంత ఖ్యాతి తెచ్చిందంటారు. 
 
స్త్రీ పాత్రలకే పరిమితం కాక కనకం శ్రీకృష్ణతులాభారం వంటి నాటకాల్లో ముఖ్యపాత్ర అయిన నారదుడి పాత్రను పంతో సునాయాసంగా పోషించారు. కనకం కృష్ణ పాత్రలో శిక్షణ పొందారు. ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడిగా సాగే కృష్ణ పాత్రలో... పీసపాటి, రఘురామయ్య వంటి హేమాహేమీలు నటిస్తున్న నాటకాల్లో కృష్ణ పాత్ర ధరించి మెప్పించారు. నెల్లూరు, హైదరాబాదు, మద్రాసు వంటి చోట్ల కనకం ఘన సన్మానాలందుకొన్నారు. స్థానం నరిసింహారావు పేరుతో వెలసిన అవార్డును హైదరాబాదు త్యాగరాయ గానసభలో అందుకొన్న కనకం పేరుకు తగినట్లే మంచితనం, అంకిత తత్వం మూర్తీభవించిన కనకం వృద్ధాప్యం, ఒంటిరి జీవితంతో విజయవాడలో చాలా దయనీయ స్థితిలో ఆమె చాలాకాలం జీవితం గడిపారు. కొంతమంది సినీ ప్రముఖులు అప్పుడప్పుడు కనకంకు డబ్బు సహాయం చేశారు. కానీ అంతిమ దశలో ఆమె ఇబ్బందులు పడ్డారు.