బుధవారం, 27 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : గురువారం, 19 మార్చి 2020 (10:46 IST)

సినిమా ఇండస్ట్రీ గురించి వి.ఎన్.ఆదిత్య సంచలన వ్యాఖ్యలు..!

మనసంతా నువ్వే సినిమాతో దర్శకుడిగా పరిచయమై.. ఫస్ట్ మూవీతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ వి.ఎన్.ఆదిత్య. ఆతర్వాత శ్రీరామ్, నేనున్నాను, మనసు మాట వినదు, బాస్, ఆట, రెయిన్ బో, రాజ్, ముగ్గురు... ఇలా విభిన్న కథా చిత్రాలను అందించిన వి.ఎన్.ఆదిత్య గత కొంత కాలంగా తెలుగులో సినిమాని డైరెక్ట్ చేయలేదు. 
 
తాజాగా వాళ్లిద్దరి మధ్య అనే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్‌ని తెరకెక్కించారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. అయితే... ఈ సినిమా చేసే క్రమంలో తనకు ఎదురైన అనుభవాలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసారు. త‌న‌ని హీరోలు, హీరోయిన్లు ఎలా తిప్పించారో, ఈ క‌థ‌ని ఎలా రిజెక్ట్ చేశారో చెబుతూ ఓ సెటైరిక‌ల్ పోస్ట్ ని ఫేస్ బుక్ లో పెట్టారు వి.ఎన్. ఆదిత్య‌. 
 
ఇంతకీ ఆయన ఫేస్ బుక్ లో ఏం పోస్ట్ చేశారంటే... నలభైయేళ్లు దాటిన దర్శకుడి తో పని చేయనండి.. కాబట్టి మీ కథ కూడా వినను..సారీ.. అని ఒక హీరో అన్నారు. కథ బావుంది, కానీ డైలాగ్ వెర్షన్ వినకుండా డెసిషన్ చెప్పను. ఇంకో మూడు నెలలాగి స్క్రిప్ట్ పూర్తిగా అయ్యాక చూద్దాం..: అని ఇంకో హీరో అన్నారు. హీరోయిన్ నచ్చలేదు, ఆమెని చూస్తే ప్రేమించాలనిపించట్లేదు. సో, సినిమా వదిలేసుకుంటాను అని మరో మరో హీరో అన్నారు. 
 
రెమ్యునరేషన్ ముప్ఫై ఐదు లక్షలు ఇస్తే గానీ చేయను.. అని వేరే హీరో అన్నారు. రెమ్యునరేషన్ పదిహేను లక్షలు, కారవాన్ కంపల్సరీ, మేనేజర్‌కి కమీషన్, హీరోయిన్ గా పెద్ద పేరున్న హిందీ అమ్మాయి ఉంటే, కథ కూడా వినను.. అని ఓ హీరో అన్నారు. ఫలానా హీరో అయితే నేను చేయను.. అని ఓ హీరోయిన్ చెప్పింది. 
 
స్టార్ హీరో కాకపోతే నేను చేయను..అని  ఇంకో హీరోయిన్, ఇంత యంగ్ స్టోరీని ఇంత సీనియర్ డైరెక్టర్ హ్యాండిల్ చేయలేరు. సో,నేను చేయను.. అని వేరే హీరోయిన్ అన్నారు. మనసంతా నువ్వే రోజులు కావండి.. ఇప్పుడు ఈయన డైరెక్షన్ లో సినిమా ఎందుకు.. అని ఓ నిర్మాత కి ఒక సినీ ప్రముఖుడి సలహా ఇచ్చారు.
 
అసలు మీతో సినిమా తీయడానికి ఇప్పుడు నిర్మాతలు, ఆర్టిస్టులు ఎందుకొస్తారు. హ్యాపీగా కథలు వింటూ శాలరీ తీస్కోండి.. డైరెక్షన్ గురించి ఆలోచించకండి..అని ఇంకో సినీ ప్రముఖుడు క్లాసు తీసుకున్నాడు. అన్నీ అయ్యాయి.. సమాధానం కూడా ఇప్పుడు రెడీ అయ్యింది. అదే " వాళ్ళిద్దరి మధ్య.." సినిమా. 
 
ధైర్యంగా నిలబడిన కొత్త నిర్మాత అర్జున్ దాస్యన్ గారికి, నమ్మి చేసిన హీరో విరాజ్ అశ్విన్ కి, కొత్త హీరోయిన్ నేహా కృష్ణకి, వెన్నుదన్నుగా నిలచిన ప్రసాద్ ల్యాబ్ అధినేత రమేష్ ప్రసాద్ గారికి, రాజ్ మాదిరాజు గారికి,
స్క్రీన్ ప్లే రైటర్ సత్యానంద్ గారికి, మాటల రచయిత వెంకట్.డి.పతికి, సంగీత దర్శకురాలు మధుస్రవంతి గారికి, మొదట మొహమాట పడినా, రాను రాను అద్భుతంగా పాత్ర పోషించిన వెంకట్ సిద్ధారెడ్డి గారికి, అగ్రజులు సాయి శ్రీనివాస్ వడ్లమాని గారికి, మిత్రులు శ్రీకాంత్ అయ్యంగార్ కి, పనిచేసిన అందరు నటీనటులకి, సాంకేతిక నిపుణులకి.. అందరికీ పేరుపేరునా శత సహస్ర వందనాలు... అంటూ దర్శకుడు వి.ఎన్.ఆదిత్య తెలియచేసారు. 
 
ఫేస్ బుక్‌‌లో పోస్ట్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా విజయం పై వి.ఎన్.ఆదిత్య చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఏప్రిల్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి.. ఈ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారని.. విమర్శించిన వాళ్లందరికీ ఈ సినిమాతో సమాధానం చెబుతారని.. బిగ్ సక్సస్ సాధిస్తారని ఆశిద్దాం.