సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 5 జనవరి 2022 (15:23 IST)

కొడాలి నాని ఎవరు.. నాకు తెలిసింది నేచురల్ స్టార్ నాని మాత్రమే : ఆర్జీవీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి కొడాలి నానికి టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ దిమ్మతిరిగిపోయేలా షాకిచ్చారు. అస్సలు ఈ కొడాలి నాని ఎవరు అంటూ ప్రశ్నించారు. తనకు తెలిసిందనా నేచురల్ స్టార్ నాని మాత్రమే అని అన్నారు. పైగా, సినిమా టిక్కెట్ల రేట్లను నిర్ణయించడానికి ప్రభుత్వం ఎవరని ఆర్జీవీ నిలదీశారు. 
 
సినిమా టిక్కెట్ ధరల వ్యవహారంపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానికి ఆర్జీవీ ఇప్పటికే గట్టిగా కౌంటరిచ్చిన విషయం తెల్సిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకు సంపూర్ణేష్ బాబు చిత్రానికి మీ ప్రభుత్వంలో తేడా లేనపుడు.. మంత్రిగా మీకు, మీ డ్రైవర్‌కి కూడా తేడా లేదా? అని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో తనను ఉద్దేశించి మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు కూడా ఆర్జీవీ గట్టిగా కౌంటరిచ్చారు. 
 
"ఏపీ టిక్కెట్ రేట్ల విషయంలో నేను ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్నలకు సంబంధించి ఎవరో కొడాలి నాని అనే వ్యక్తి ఇచ్చిన కౌంటర్‌కి సమాధానం చెప్పమని కొందరు నన్ను అడుగుతున్నారు. నాకు తెలిసిన నాని నేచురల్ స్టార్ నాని ఒక్కడే. వాళ్లు చెపుతున్న కొడాలి నాని ఎవరో నాకు తెలియదు" అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలకు మంత్రి కొడాలి నాని ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.