సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ.. మెగాస్టార్ చిరంజీవి దూరం.. ఎందుకో?

chiranjeevi
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన సినీ పెద్దలు గురువారం ఉదయం భేటీ అయ్యారు. హైదరాబాద్ నగరంలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‍‌లో ఈ భేటీ ఉదయం 10 గంటల నుంచి జరుగుతుంది. ఇందులో ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహాలు పాల్గొన్నారు. 
 
చిత్రపరిశ్రమ నుంచి హీరోలు నాగార్జున, వెంకటేశ్, నితిన్, కిరణ్ అబ్బవరం, సిద్ధూ జొన్నలగడ్డ, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, బోయపాటి శీను, వీరశంకర్, హరీశ్ శంకర్, ప్రశాంత్ వర్మ, సాయి రాజేశ్, వశిష్ట, నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, సుధాకర్ రెడ్డి, సి.కళ్యాణ్, గోపి ఆచంట, శ్యాంప్రసాద్ రెడ్డి, బీవీఎస్ ప్రసాద్, కె.ఎల్ నారాయణ, మైత్రీ రవి, నవీన్ తదితరులు ఉన్నారు. వీరంతా ఎఫ్.డి.సి ఛైర్మన్, సినీ నిర్మాత దిల్ రాజు సారథ్యంలో ప్రభుత్వ పెద్దలతో సమావేశమై పరిశ్రమకు సంబంధించిన అన్ని అంశాలు చర్చిస్తున్నారు. 
 
అయితే, ఈ భేటీకి మెగాస్టార్ చిరంజీవి హాజరవుతారని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ, ఆయన హాజరుకాలేదు. అల్లు అర్జున్‌పై కేసు, అరెస్టు నేపథ్యంలో ఈ భేటీ అత్యంత కీలకంగా మారింది. ఇలాంటి సమావేశానికి చిరంజీవి ఎందుకు రాలేదన్న చర్చ సాగుతుంది. అయితే, ప్రస్తుతం చిరంజీవి హైదరాబాద్ నగరంలో లేరు. ఆయన విదేశాల్లో ఉన్నట్టు సమాచారం. అందుకే ఈ సమావేశానికి దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది.