గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 25 అక్టోబరు 2021 (11:08 IST)

మహిళలు అరుదుగా ఉంటారు. వరుడు కావలెను చూసి ఆస్వాదించండి – పూజాహెగ్డే

Nagashourya, Rituvarma, Lakshmi Soujanya, Pooja Hegde, Suryadevara Nagavanshi
నాగశౌర్య, రీతూవర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్న చిత్రం ‘వరుడు కావలెను’. పి.డి.వి.ప్రసాద్‌ సమర్పణలో ప్రఖ్యాత నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రమిది. ఈ నెల 29న థియేటర్‌లలో విడుదల కానుంది. సినిమా ప్రమోషన్‌ను మేకర్స్‌ వినూత్నంగా నిర్వహిస్తున్నారు. ఇటీవల ట్రైలర్ ను  విడుదల చేసిన చిత్ర యూనిట్‌, శనివారం సంగీత్‌ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ముఖ్య అతిథిగా అగ్ర కథానాయిక పూజాహెగ్డే హాజరయ్యారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్. రాధా కృష్ణ ( చినబాబు), చిత్ర నాయకా, నాయికలు నాగశౌర్య, రీతు వర్మ, దర్శకురాలు లక్ష్మీ సౌజన్య, నిర్మాత సూర్యదేవర నాగ వంశీ, సప్తగిరి, మాటల రచయిత గణేష్‌ రావూరి, సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్, గేయ రచయిత రాంబాబు గోశాల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
పూజాహెగ్డే మాట్లాడుతూ, ‘హీరోయిన్‌ని అతిథిగా ఆహ్వానించడం అరుదుగా జరుగుతుంది. నన్ను అతిథిగా ఆహ్వానించడం ఆనందంగా ఉంది. ఆ క్రెడిట్‌ చిన్నబాబు, వంశీలకు దక్కుతుంది. హారికా అండ్‌ హాసిని నా ఫ్యామిలీ బ్యానర్‌. చినబాబుగారు నన్ను ఇంట్లో మనిషిలా చూస్తారు. కరోనా వల్ల ఎంతో బాధపడ్డాం. కాస్త రిలాక్స్‌ అవ్వడం కోసం థియేటర్‌లోనే సినిమా చూడండి. దర్శకత్వ శాఖలో మహిళలు చాలా తక్కువ ఉంటారు. ‘వరుడు కావలెను’ మహిళా దర్శకురాలు తెరకెక్కించిన మంచి ప్రేమకథ. అందరూ సినిమా చూసి మీ బాధల్ని మరచిపోండి. దర్శకురాలిగా సౌజన్యకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా. ఈ సినిమా హిట్టై టీమ్‌కు మంచి పేరుతోపాటు నిర్మాతలకు లాభాలు రావాలి. ఇదే జోష్‌తో సక్సెస్‌ పార్టీలో కలుద్దాం’’ అని అన్నారు.
 
నాగశౌర్య మాట్లాడుతూ, 2018లో కథ విన్నాను. వెంటనే ఓకే చేశా. 2019లో షూటింగ్‌ మొదలుపెట్టాం. ఈ జర్నీలో రెండుసార్లు కరోనా మహమ్మారిని చూశాం. చాలా కష్టపడి సినిమా పూర్తి చేసి విడుదల వరకూ వచ్చాం. సినిమా అవుట్‌పుట్‌ ఒక రేంజ్‌లో వచ్చింది. ‘మన కుటుంబం మంచిది’ అని ఎంత గర్వంగా చెప్పుకుంటామో.. మా సినిమా బాగా వచ్చిందని అంతే గర్వంగా చెప్పుకొంటాం. ఇది ఓవర్‌ కాన్షిడెన్స్‌ కాదు. సినిమా పట్ల ఉన్న నమ్మకం. సినిమాకు బాగా వచ్చిందని తెలిసి ఎన్నో ఓటీటీ ఆఫర్లు వచ్చాయి. అయినా నిర్మాతలు థియేటర్‌ రిలీజ్‌ కోసమే వేచి చూశారు. సౌజన్య అక్క ఎన్నో సంవత్సరాలుగా అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేస్తూ ఓ మంచికథ రాసుకుంది. ఈ సినిమాతో దర్శకురాలిగా అవకాశం అందుకుంది. మంచి అవుట్‌పుట్‌ కోసం చాలా పోరాడింది. ఈ సినిమా హిట్‌తో తన కష్టానికి తగ్గ ప్రతిఫలం తప్పకుండా దక్కుతుంది. విశాల్‌ చంద్రశేఖర్‌ అందించిన సంగీతంతో మేం మొదటి సక్సెస్‌ అందుకున్నాం. భూమి పాత్రకు రీతూవర్మ పర్ఫెక్ట్‌గా సూట్‌ అయింది. తనతో మళ్లీమళ్లీ పని చేయాలనుంది. చినబాబుగారు, వంశీలతో జర్నీ చాలా అందంగా ఉంటుంది. కథను, సినిమాను ప్రేమించే నిర్మాతలు వీరు. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి చాలా అవసరం. మంచి కథకు ఎక్కడా వెనకాడకుండా బడ్జెట్‌ పెడతారు. ఈ నెల 29న విడుదల కానున్న మా చిత్రానికి ఎలాంటి భయం లేకుండా అందరూ రావాలి. థియేటర్ల దగ్గర కొవిడ్‌ నిబంధనలు అన్ని పాటిస్తున్నాం’’ అని అన్నారు.
 
రీతూవర్మ మాట్లాడుతూ, ప్రేమ, అనుబంథం ఇతివృత్తంగా పూర్తిగా కుటుంబ కథాంశంతో రూపొందిన చిత్రమిది. ఈ కథ నాకు దొరకడం అదృష్టంగా భావిస్తున్నా. లక్ష్మీ సౌజన్య మంచి కథతో దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతంలో మంచి డాన్స్‌ నంబర్స్‌ కుదిరాయి. శౌర్య సపోర్ట్‌తో నా వర్క్‌ చాలా ఈజీ అయింది. హీరోయిన్‌ను అతిథిగా పిలవడం రేర్‌గా జరుగుతుంది. మా ఈవెంట్‌కు పూజా రావడం చాలా ఆనందంగా ఉంది. మా అందరికీ సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది’’ అని అన్నారు.
 
నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ, కథా బలం, కుటుంబ కథా చిత్రాల మీద మా సంస్థ దృష్టి పెడుతుంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌, యువతకు బాగా ఆకట్టుకునే చిత్రమిది. అతిథిగా హాజరైన పూజాహెగ్డేకు కృతజ్ఞతలు. సహకరిస్తున్న అభిమానులకు, మీడియాకు చాలా థ్యాంక్స్‌’’ అని అన్నారు.
 
సంగీత దర్శకుడు విశాల్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ, కథకు తగ్గ పాటలు, నేపథ్య సంగీతం కుదిరాయి. ఈ సినిమాలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంద‌ని అన్నారు.