శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By ivr
Last Modified: శుక్రవారం, 25 మే 2018 (17:43 IST)

హాయిగా వెళ్లి రావచ్చు 'అమ్మమ్మగారిల్లు'కి... రివ్యూ రిపోర్ట్

'అమ్మమ్మగారిల్లు' అని టైటిల్‌ చూడగానే చక్కటి కుటుంబ కథాచిత్రమని అర్థమయిపోతుంది. 'ఛలో' తరువాత నాగశౌర్య నుండి వచ్చిన చిత్రం కావడంతో మరింత ఆసక్తి నెలకొంది. కొత్తగా సినీరంగంలోకి ప్రవేశించి, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నుంచి వచ్చిన నిర్మాతలు ఈ సినిమా తీయడంతో ఎల

అమ్మమ్మగారిల్లు నటీనటులు: నాగశౌర్య, షామిలి, రావు రమేష్‌, సుమిత్ర, శివాజీరాజా, హేమ, ఏడిద శ్రీరామ్‌, షకలకలశంకర్‌, గాంధీ తదితరులు, సాంకేతికత : సినిమాటోగ్రఫర్‌ : రసూల్‌ ఎల్లోర్‌, సంగీతం : కళ్యాణ రమణ, నిర్మాత : రాజేష్‌, ఎడిటర్‌ : జె.పి, దర్శకత్వం: సుందర్‌ సూర్య.
 
'అమ్మమ్మగారిల్లు' అని టైటిల్‌ చూడగానే చక్కటి కుటుంబ కథాచిత్రమని అర్థమయిపోతుంది. 'ఛలో' తరువాత నాగశౌర్య నుండి వచ్చిన చిత్రం కావడంతో మరింత ఆసక్తి నెలకొంది. కొత్తగా సినీరంగంలోకి ప్రవేశించి, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నుంచి వచ్చిన నిర్మాతలు ఈ సినిమా తీయడంతో ఎలా తీశారనేది కూడా వుంది. మరి ఈ శుక్రవారమే విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
 
కథ:
పిఠాపురం లోని చలపతిరావు, సుమిత్రలది ఉమ్మడి కుటుంబం. వారికి ముగ్గురు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు. సంతోషంతో హాయిగా అందరూ వుండాలని భావించే తండ్రి తత్త్వానికి భిన్నమైన తత్త్వం పెద్ద కొడుకు రావు రమేష్‌ది. ఆస్తి కోసం తండ్రితో వాదనకు దిగి బావ సుమన్‌పై చేయిచేసుకుంటాడు. ఈ హఠాత్‌పరిణామాన్ని తట్టుకోలేక గుండెనొప్పితో చలపతిరావు కాలంచేస్తాడు. అప్పటికీ కోపం చల్లారదు. తండ్రి దశ దినకర్మ చేయకుండానే తన కుటుంబంతో బయటకు వెళ్ళిపోతాడు రావురమేష్‌. 
 
ఆ తర్వాత మిగిలిన నలుగురూ తలో దిక్కుకు వెళ్ళిపోతారు. ఇదంతా చిన్నతనంలో సంతోష్‌(నాగశౌర్య) కళ్ళముందే జరుగుతుంది. ఇక తను పెద్దయ్యాక.. ఒంటరిగా వున్న అమ్మమ్మ కళ్ళలో సంతోషం చూడాలని తపిస్తాడు. అందుకు మిగిలిన నాలుగు కుటుంబాల్ని పిఠాపురం ఎలా రప్పించాడు? ఆ తర్వాత ఏమి జరిగింది? అనేది మిగిలిన సినిమా కథ.
 
విశ్లేషణ:
ఇటువంటి కథ వినగానే 'గోవిందుడు అందరివాడే', 'శతమానం భవతి' చిత్రాలు స్పురిస్తాయి. గతంలో చాలా కథలు ఇలానే వుంటాయి. కానీ ఇందులో ఇప్పటి తరానికి ఏ విధంగా చెబితే నచ్చుతుందో దర్శకుడిగా సుందర్‌ సూర్య తీసుకున్న పద్ధతి డిఫరెంటుగా వుంటుంది. తను చెప్పాలనుకున్నది సూటిగా చెప్పాడు. ఎవరేమైతే నాకేంటి తనే నెంబర్‌1గా ఎదగాలనుకునే పాత్రలో రావు రమేష్‌ జీవించాడు. ఆఫీసులో టెన్షన్‌ను ఇంట్లో ఇంటెన్షన్‌ చేయలేకపోతున్న పాత్రను శివాజీరాజాలో చూపించాడు. విదేశీ మోజుతో అక్కడి అమ్మాయినే పెండ్లి చేసుకుని కెరీర్‌లోనే ఆనందం వుందనుకునే పాత్ర రవిది. మనిషి కంటే బంగారానికే విలువిచ్చే హేమ, మంచీచెడు తెలిసినా పరిస్థితుల్నిబట్టి సర్దుకుపోయే పాత్ర సుధది. ఇలా ఐదు పాత్రల్లో జీవితాన్ని విశ్లేషించాడు. కానీ వీరందరి పాత్రల కంటే కథకు బలమైన పాత్ర రావు రమేష్‌ది. 
 
కథ మొత్తాన్ని తన భుజాల మీదనే మోసేశాడు. గతంలో 'బ్రహ్మోత్సవం'లో పోషించిందే అయినా అలవాటైన పాత్రలో మరోసారి తనలోని నటన తీవ్రతను తెరపై చూపారు. ఆ తర్వాత అమ్మమ్మ పాత్రలో సుమిత్ర నిండుతనాన్ని తెచ్చారు. హీరో నాగశౌర్య తన నటనలో మంచి పరిణితి కనబర్చగా హీరోయిన్‌ షామిలి నటనతో పర్వాలేదనిపించింది. హీరో నాగశౌర్యకు వెన్నంటి వుండే చిన్ననాటి స్నేహితుడిగా షకలక శంకర్‌ ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేశాడు.
 
సాంకేతిక విభాగం :
చిత్రంలో సంభాషణపరంగా ఆకట్టుకున్నాడు దర్శకుడు. 'కోపాన్ని బయటకు తీస్తేనే మనిషి లోనిది బయటకు వస్తుంది', వీరికి అమ్మమ్మను అయ్యాను. ఆస్తి అయినా బాగుండూ ఎవరో ఒకరు పంచుకునేవారంటూ.. సెంటిమెంట్‌ డైలాగ్స్‌ హృదయాన్ని టచ్‌ చేస్తాయి. 'మాట్లాడితే వినాలి అనిపించాలి. అనాలి అనిపించకూడదంటూ.. సన్నివేశపరంగా చక్కగా రాసుకున్నాడు. రాసుకున్న స్టోరీ పాతదే అయినా ఎమోషనల్‌ సన్నివేశాల్ని పండించే ప్రయత్నం చేశాడు. చిత్ర కెమెరామెన్‌ రసూల్‌ ఎల్లోర్‌ పనితీరు బాగానే ఉంది. కొన్నిచోట్ల విజువల్స్‌ సరిగా కుదరలేదు. కళ్యాణ రమణ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ బాగుంది. సినిమాలోని రెండు పాటలు చూడటానికి, వినడానికి బాగున్నాయి. ఇక ఈ చిత్ర నిర్మాత రాజేష్‌ పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
 
తీర్పు:
ఇటువంటి సినిమాలకు కథ ముందే తెలిసిపోవడం ప్రేక్షకుల ఊహకు తగ్గట్టే సినిమా సాగడం వలన సినిమా చూస్తున్నంత సేపు కొత్తగా ఏదో చెబుతున్నాడనిపించదు కానీ చక్కటి ఫీల్‌గుడ్‌ సినిమా చూశామన్న ఫీలింగ్‌ కలుగుతుంది. ఫస్టాఫ్‌ వరకు బాగానే సాగిన ఈ చిత్రం ద్వితీయార్థంలో కథనం కాస్త నెమ్మదిస్తుంది. ఏదిఏమైనా రణగొణధ్వనులు, హింస, వల్గారిటీ లేని ఇటువంటి చిత్రాన్ని కుటుంబంతో కలిసి హాయిగా చూడొచ్చు.
 
రేటింగ్‌: 3.25/5