శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By DV
Last Updated : శుక్రవారం, 20 ఫిబ్రవరి 2015 (20:54 IST)

యాక్షన్‌ పోటుతో నరేష్‌... బందిపోటు... రివ్యూ రిపోర్ట్

బందిపోటు నటీనటులు: అల్లరి నరేష్‌, ఈష, సంపూర్ణేష్‌ బాబు, తనికెళ్ళ భరణి, రావు రమేష్‌, పోసాని కృష్ణమురళి, చంద్రమోహన్‌, సప్తగిరి తదితరులు
 
సాంకేతికసిబ్బంది : 
కెమెరా: పి.జి.వింద, సంగీతం: కళ్యాణ్‌ కోడూరి, ఎడిటింగ్‌: ధర్మేద్ర కాకరాల, నిర్మాతలు: రాజేష్‌ ఈదర, నరేష్‌ ఈదర, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.
 
విడుదల తేదీ: 20.2.2015
ఇటీవల అల్లరి నరేష్‌ చిత్రాల్లో స్టఫ్‌ అంతా పోయింది. సుడిగాడు తర్వాత తను ఏం చేసినా అన్నీ అందులో చూపించేసరికి అల్లరి నరేష్‌ను మరో కొత్తకోణంలో చూడలేకపోతున్నారు. అందుకే దాని తర్వాత వచ్చిన చిత్రాలన్నీ ప్లాప్‌ అవుతున్నాయి. ఈ విషయాన్ని పసిగట్టిన నరేష్‌ స్వంత బేనర్‌లో బందిపోటుగా ట్రై చేశాడు. 'అంతకు ముందు ఆ తర్వాత' చిత్ర డైరెక్టర్‌ మోహనకృష్ణ ఇంద్రగంటి కలిసి చేసిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా నరేష్‌ మార్క్‌ కామెడీ అందించిందో, మోహనకృష్ణ మార్క్‌ ఫీల్‌ని కలిగించిందో తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్ళాల్సిందే.

 
కథ : 
విశ్వనాథ్‌(అల్లరి నరేష్‌) తెలివైన ఒక దొంగ. దొంగలకు దొంగ. సమాజంలో వుండే పెద్ద దొంగల్ని దోచుకోవడమే అతని పాలసీ. అవసరానికి మించి అక్రమంగా సంపాదించిన వారిని టార్గెట్‌ చేస్తూ మోసం చేస్తుంటాడు. ఇతని కదలికల్ని కనిపెట్టిన జాహ్నవి(ఈష) విశ్వనాథ్‌ ముందు ప్రత్యక్షమై వీడియో చూపిస్తుంది. అంటే బ్లాక్‌మెయిల్‌ అన్నమాట. తనకు కావాల్సిన వ్యక్తి క్వాలిటీస్‌ నీలో వున్నాయంటూ.. ఓ హెల్ప్‌ చేయమంటుంది. దాని సారాంశం ముగ్గురు వ్యక్తుల కెరీర్‌ను నాశనం చేయాలి. మోసం చేయాలి అన్నమాట. ఇదీ ఆమె డీల్‌. 
 
వారే మకరందరావు(తనికెళ్ళ భరణి), శేషగిరి(రావు రమేష్‌), భలేబాబు(పోసాని కృష్ణమురళి)లు. దానికి విశ్వ సరేనంటాడు. ఈ ఆపరేషన్‌కి తనకి ఎలాంటి ఫీజూ వద్దని, దానికి కూడా ఒక కారణం వుందని, అది తర్వాత చెప్తానంటాడు. మరి ఆ ముగ్గురినీ ఎలా మోసం చేశాడు? వారి దగ్గర ఎలా డబ్బు కొట్టేశాడు?   అనేది మిగతా కథ. 
 
పెర్‌ఫార్మెన్స్‌ : 
అల్లరి నరేశ్‌ గతంలో వున్న హుషారుగానూ, గ్లామర్‌గానూ కన్పించకపోవడం కారణం సబ్జెక్ట్‌ దొంగగా అవ్వడమేగానీ ఇందులో కథకు సరిపడలేదనే చెప్పాలి. మాటల్లో విసుర్లు సెటైర్లు లేకుండా లాజిక్కుగా మాట్లాడే సంభాషణలు కాస్త విసుగు తెప్పిస్తాయి. కానీ రొటీన్‌ పాత్రలకు భిన్నంగా   కొత్త కాన్సెప్ట్‌తో సినిమా చెయ్యాలని అనుకోవడం అభినందించాల్సిన విషయం. సంపూర్ణేష్‌ బాబు కూడా నటించడం కొంత ప్లస్‌ అయింది. టి.వి.లో న్యూస్‌ రీడర్‌గా కనిపించే పాత్రలో సప్తగిరి కాసేపు నవ్వించే ప్రయ్నతం చేశాడు. హీరోయిన్‌గా ఈష నటించడానికి పెద్దగా లేకపోయినా... నరేష్ కంటే పెద్దదిగా అనిపిస్తుంది. శుభలేఖ సుధాకర్‌ హీరోయిన్‌ తండ్రిగా చేశాడు. మిగిలినవి పర్వాలేదు.
 
 
టెక్నికల్‌గా.. 
ఫోటోగ్రఫీ పి.జి.వింద ఫోటోగ్రఫీ చాలా ఎక్స్‌ట్రార్డినరీగా వుంది. ముఖ్యంగా ఫారిన్‌లో తీసిన రెండు పాటలు వేటికవే అన్నట్టుగా చాలా అందంగా వున్నాయి. ఇప్పటివరకు ఎవరూ చెయ్యని లొకేషన్స్‌లో పాటలు తీసినట్టుగా అనిపించింది. హీరో ఇంట్రడక్షన్‌ సాంగ్‌ని చాలా రిచ్‌గా తీశారు. ఇందులో గ్రాఫిక్‌ వర్క్‌ కూడా బాగుంది. మోహనకృష్ణ నేరేషన్‌కి తగ్గట్టుగానే కళ్యాణ్‌ కోడూరి మ్యూజిక్‌ కూడా వుంది. 
 
సినిమాలో వున్న నాలుగు పాటలు ఆడియోపరంగా ఏమాత్రం ఆకట్టుకునేలా లేవు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మాత్రం ఫర్వాలేదు అనిపించాడు. మోహనకృష్ణ రాసిన మాటలు ఏమాత్రం ఆకట్టుకునేలా లేవు. చాలా రొటీన్‌ డైలాగ్స్‌. ఈ సినిమాకి అన్నింటికంటే పెద్ద మైనస్‌ కామెడీ లేకపోవడం. అల్లరి నరేష్‌ సినిమా అంటే కామెడీ ఎక్స్‌పెక్ట్‌ చేసి వచ్చే ఆడియన్స్‌ని హండ్రెడ్‌ పర్సెంట్‌ నిరాశపరిచే సినిమా.
 
విశ్లేషణ... 
అల్లరి నరేష్‌ సినిమా అంటే... పిల్లల్ని పెద్దల్ని అలరిస్తాడని అనుకుంటారు. కానీ పగ ప్రతీకారం అనే కాన్సెప్ట్‌తో తెరమీద కనిపించేసరికి రొటీన్‌ హీరో కథ అయిపోయింది. గతంలో ఇటువంటి కథలు చాలా వచ్చాయి. హీరో మారాడు అంతే తేడా. ఆ తేడాను కామెడీతో పండించే ప్రయత్నం చేయలేకపోయారు. సంపూర్ణేష్‌ బాబు పాత్ర తక్కువే. అతను డామినేట్‌ చేస్తాడని కొన్ని సీన్స్‌ రాసుకున్నారని మొదట్లో దర్శకుడు చెప్పాడు.
 
ఇటువంటి కథ డైరెక్టర్‌ సినిమాకి పెద్ద మైనస్‌ అయ్యాయని చెప్పాలి. ఆడియన్స్‌కి ఏమాత్రం క్యూరియాసిటీ కలిగించని కథాంశం ఇది. పైగా నేరేషన్‌ చాలా స్లోగా వుండటమే కాకుండా స్టార్టింగ్‌ టు ఎండింగ్‌ బోర్‌ కొట్టిస్తుంది. 'బందిపోటు' అనే టైటిల్‌కి తగ్గ సినిమా కాదు. మొదటి భాగం వరకు ఇద్దరు మోసగాళ్ళను ఈజీగా పడేస్తాడు హీరో. అది కూడా చాలా సిల్లీగా వుంటుంది.
 
సెకండాఫ్‌లో ఏదో వుంటుందని అనుకునే ప్రేక్షకులకు మరోసారి నీరసం ఆవహిస్తుంది. సెకండాఫ్‌ అంతా ఎన్నికల ప్రచారాలు, పొలిటికల్‌ స్టంట్‌తో పదేపదే అవే సీన్స్‌ చూపిస్తూ క్లైమాక్స్‌ వరకూ వస్తుంది. క్లైమాక్స్‌ అయినా ఏమైనా గొప్పగా వుందా అంటే అదీ లేదు. కథలో బలం లేదు, కథనంలో కొత్తదనం లేదు, అన్నింటినీ మించి సినిమాలో కామెడీ లేదు. తను అనుకున్న కథని సరిగ్గా ప్రజెంట్‌ చెయ్యడంలో డైరెక్టర్‌ ఫెయిల్‌ అయ్యాడు. 
 
ఈ సినిమాని క్యూరియాసిటీతో కాకుండా మహా ఓపికతో చూడాల్సిన పరిస్థితి ఆడియన్‌కి కలుగుతుంది. ఈ తరహా కథకి ఎక్కువ బడ్జెట్‌తో సినిమా చెయ్యాల్సిన అవసరం లేదు. ఫారిన్‌లో సాంగ్స్‌ తియ్యాల్సిన అవసరం అంతకన్నా లేదు. కామెడీ మిస్‌ అవకుండా కొత్త జోనర్‌లో సినిమా చేసి ఆడియన్స్‌ని మెప్పించాలనుకున్న నరేష్‌ ప్రయత్నం బెడిసి కొట్టిందనే చెప్పాలి. కొంత గ్యాప్‌ తర్వాత ఇ.వి.వి. సినిమా బేనర్‌ను మళ్ళీ స్టార్ట్‌ చేసి ఆ బేనర్‌ ప్రతిష్టను మరింత పెంచే సినిమా తీస్తే బాగుండేది. 
 
అయినప్పటికీ ప్రొడక్షన్‌ వేల్యూస్‌ ఏమాత్రం తగ్గకుండా సినిమా అంతా రిచ్‌గానే చూపించే ప్రయత్నం చేశారు. అయితే రొటీన్‌ కథలు చూసి విసుగెత్తిన జనాలకు అల్లరి నరేశ్‌ చిత్రాల్లో ఏదో వుంటుందని ఆశించిన వారికి భంగమే కలుగుతుంది. ఇటువంటి కథలకు నెరేషన్‌ కూడా చాలా స్పీడ్‌గా వుండాలి. చిల్లరగా ఊహించుకుని అంతే చిల్లరగా కథను అల్లుకుని.. అదే నరేష్‌ కామెడీ అంటే చూసే రోజులు పోయాయి. అందుకే ఈ చిత్రం అనుకున్నంత రేంజ్‌లో ఆడకపోవచ్చు.
 
 
రేటింగ్‌:  2.5/5