1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By DV
Last Modified: శుక్రవారం, 28 ఆగస్టు 2015 (19:50 IST)

మా ఇద్దరిలో ఒకరికి ఎయిడ్స్... కనుక మీలో ఒకరికి ఎయిడ్స్... 'బెస్ట్ యాక్టర్స్' చెప్పేదేంటి..?

బెస్ట్ యాక్టర్స్ నటీనటులు : నందు, అభి, మధురిమ, షామిలి, మధు, నవీద్‌, క్రతీ, కేశ కంబటి తదితరులు; నిర్మాత : కుమార్‌ అన్నంరెడ్డి, సంగీతం : జెబి, దర్శకత్వం : అరుణ్‌ పవర్‌.
 
విడుదల తేదీ : 28 ఆగస్టు 2015.
 
కొత్త సినిమా ఏదయినా యూత్‌ను ఆకర్షించేందుకు తీస్తున్నవే. అందులోనూ మారుతీ బ్రాండ్‌ అంటేనే అలాగే వుంటుంది. ఆయన దర్శకుడిగా పలు చిత్రాలు తీశాడు. అయితే ఈసారి నిర్మాతగా వెనుక నుంచి నడిపాడు. దానికి సినిమా లవర్స్‌ సినిమా బ్యానర్‌ పెట్టాడు. కుమార్‌ అన్నంరెడ్డి నిర్మించిన సినిమా 'బెస్ట్‌ యాక్టర్స్‌', జీవితంలో అనేది ట్యాగ్‌ లైన్‌. ఫుల్‌ కామెడీ విత్‌ సస్పెన్స్‌ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన చిత్రమంటూ ప్రచారం చేశారు. మరి అలా వుందో లేదో చూద్దాం. 
 
కథ :
చిన్ననాటి నుంచి బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అయిన నందు(నందు), మధు(మధు), అభి(అభి), కృష్ణ(నవీద్‌)ల కథే ఇది. నందు (నందు) ఫాషన్‌ డిజైనర్‌. జల్సా చేస్తూ ప్రేమ, పెళ్లి అనే వాటిని అస్సలు నమ్మని కుర్రాడు. మధు ఏమో సాఫ్ట్‌వేర్‌లో తను కోరుకున్న ప్రమోషన్‌ రాక, ప్రేమించిన అమ్మాయికి తన ప్రేమని చెప్పలేక బాధపడుతుంటాడు. మూడేళ్ళు లవ్‌ చేసిన అమ్మాయికి పెళ్ళికి నో చెప్పడంతో కృష్ణ శోకసముద్రంలో మునిగిపోతాడు. ఇక డైరెక్టర్‌ అయ్యి ఇండస్ట్రీని మార్చేద్దాం అనుకున్న అభి అవకాశాల కోసం తిరిగితిరిగి విసుగెత్తిపోతాడు. 
 
అలా రకరకాల సమస్యల్లో ఉన్న వీళ్ళంతా సమస్యల్నించి బయటపడాలని గోవా వెళ్తారు. గోవాకి వచ్చి అమ్మాయిల వేటలో ఉన్న నందు, మధులకు జయసుధ(మధురిమ), జయప్రద(కేశ కంబటి)లు పరిచయం అవ్వడం, రెండో రోజుకే వారి మధ్య ప్రేమ పక్వానికి రావడం జరుగుతుంది. ఆ తర్వాత జయసుధ, జయప్రదలు కనపడరు. నందు, మధులకు కాల్‌ చేసి మాలో ఒక్కరికి ఎయిడ్స్‌ ఉంది, అంటే మీ ఇద్దరిలో కూడా ఒకరికి ఎయిడ్స్‌ అని చెప్పి పెట్టేస్తారు. దాంతో అసలు కథ మొదలవుతుంది. ఆ తర్వాత వారు అనుభవించే నరకం ఏమిటనేది వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
 
పెర్‌ఫార్మెన్స్‌
చిత్రంలో ప్రధాన పాత్ర నందు. తనలోని ఈజ్‌, ఎనర్జీ లెవల్స్‌ తన పాత్రకి పూర్తి న్యాయం చెయ్యడంలో హెల్ప్‌ అయ్యింది. అన్ని సీన్స్‌ లోనూ బాగా చేసాడు. ఇకపోతే లడ్డుగా కనిపించిన అభి తన పాత్రలో బాగానే నవ్వించాడు. తన ఎక్స్‌‌ప్రెషన్స్‌, డైలాగ్‌ మాడ్యులేషన్‌ కూడా బాగుంది. హీరోయిన్స్‌లో చిన్న పాత్రే అయినా సినిమాకు కీలకం అయిన పాత్రలో షామిలి చూడటానికి బ్యూటిఫుల్‌గా ఉంటూనే, మంచి నటనని కబరించింది. ఈ మూవీతో పరిచయం అయిన క్రతీ బాగుంది. లవ్‌ సీన్స్‌‌లో బాగా చేసింది. ఈ సినిమాకి గ్లామర్‌ అట్రాక్షన్‌ మధురిమ మరియు కేశ కంబటి. వీరిద్దరూ కనిపించే ప్రతి సీన్‌లో అందాల ఆరబోత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమాలో వీరివి సినిమాని టర్న్‌ చేసే పాత్రలు. పెర్ఫార్మన్స్‌‌తో పాటు అందాల ఆరబోత బాగా ఎక్కువ చేసిన వీరిద్దరూ ముందు బెంచ్‌ వారిని బాగా ఆకట్టుకుంటారు. 
 
టెక్నికల్‌గా...
విశ్వదేవ బత్తుల సినిమాటోగ్రఫీ కనులవిందుగా ఉంది. సింపుల్‌గా అందంగా చూపించాడు. ఇక జెబి అందించిన సాంగ్స్‌ డీసెంట్‌గా ఉన్నాయి. అలాగే బ్యాక్‌‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కూడా సినిమాకి కావాల్సిన స్థాయిలోనే ఉంది. ఉద్దవ్‌ ఎస్‌.బి ఎడిటింగ్‌ బాగాలేదు. సినిమాలో ఉన్న చాలా లాగ్స్‌ని కట్‌ చేసి స్పీడప్‌ చేసుంటే బాగుండేది. కిట్టు డైలాగ్స్‌ ఫర్వాలేదు. పంచ్‌ డైలాగ్‌లు పెద్దగా లేవు. ఇక ప్రధానంగా దర్శకుడు అరుణ్‌ పవార్‌ ఎంచుకున్న కథలో కొత్తదనం ఏమీ లేదు. కథా విస్తరణలో కొన్నికొన్ని ఎపిసోడ్స్‌ని బాగా రాసుకున్నాడు. కథనం ఇంకా బాగా రాసుకోవాల్సింది. ఎందుకంటే కథ యావరేజ్‌ లేదా రొటీన్‌ అయిన కథనంతో మేజిక్‌ చేస్తే సినిమా హిట్‌. ఆ ఫార్ములాని సరిగా ఫాలో అవ్వలేదు, అందుకే కథనం బోరింగ్‌గా ఉంటుంది. ఇక దర్శకుడిగా మాత్రం ఫర్వాలేదనిపించుకున్నాడు. నిర్మాత కుమార్‌ అన్నంరెడ్డి నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి. ఒక మంచి క్వాలిటీ ఉన్న సినిమాని అందించడానికి తను పూర్తి సపోర్ట్‌ ఇచ్చారని తెలుస్తుంది.
 
విశ్లేషణ:
బెస్ట్‌ యాక్టర్స్‌ అంటే సినిమా రంగంలో వున్న ఇబ్బందులు, లొసుగులు వుంటాయనే మొదట్లో భ్రమ కల్గించాడు. కాకపోతే కామెడీ థ్రిల్లర్‌గా తీయాలని చూశాడు. దానిలో పూర్తి న్యాయం జరగలేదు. థ్రిల్‌ అయ్యే పాయింట్‌ చూపిస్తూ అక్కడక్కడా బాగా నవ్వించగలగాలి. కానీ ఈ రెండింటిలో ఏదీ ఈ సినిమాలో జరగలేదు. సినిమా స్టార్టింగ్‌ బాగుంది, కానీ ఆ తర్వాత అనుకున్న స్థాయిలో ఎక్కడా కామెడీ లేదు. పంచ్‌ డైలాగ్‌ మాత్రం ఎక్కువ ఉన్నాయి.

కానీ సన్నివేశం లేకుండా అన్నిచోట్లా పంచ్‌ డైలాగ్స్‌ నవ్వించవు అన్న లాజిక్‌‌ని డైరెక్టర్‌ మిస్‌ అయ్యాడు. ఎయిడ్స్‌ ఉందని చెప్పే పాయింట్‌. దాన్ని చాలా బాగా డీల్‌ చేసారు. అక్కడి నుంచి కథ చాలా మలుపులతో థ్రిల్లింగ్‌గా ఉంటుందని ఆడియన్స్‌ ఆశిస్తారు. కానీ ఆ థ్రిల్లింగ్‌‌ని సినిమాలో కంటిన్యూ చేయలేకపోయారు. మళ్ళీ కామెడీ చూపించాలని ట్రై చేసారు. కానీ అది సరిగా వర్కౌట్‌ అవ్వలేదు. ఈ సినిమాకి హైలైట్‌ కావాల్సిన థ్రిల్స్‌, కామెడీ అక్కడక్కడా తళుక్కున మెరిసి మాయమైపోవడం, మిగతా అంతా బోరింగ్‌గా అనిపించడం ఈ సినిమాకి మొదటి బిగ్గెస్ట్‌ మైనస్‌ పాయింట్‌.
 
కథలో ఇంట్రెస్ట్‌ పాయింట్‌ పెద్దగా లేదు. ఇలాంటి ఫ్లేవర్‌ ఉన్న సినిమాలు మనకు ఇది వరకే పరిచయం ఉన్నాయి. సేమ్‌ మారుతీ ఫ్రెండ్స్‌ తీసిన 'గ్రీన్‌ సిగ్నల్‌' అనే సినిమా ఇంతకుముందు వచ్చింది. దీనికి దగ్గర పోలికలు ఉంటాయి. అయితే 2013లో వచ్చిన 'నీకోన్జాచా' అనే మలయాళ మూవీకి అనధికారిక రీమేక్‌. కథ పక్కన పెడితే కథనం అయినా వేగంగా సాగాదీత అనేది లేకుండా రాసుకొని ఉంటే బాగుండేది. సినిమా స్టార్టింగ్‌ 10 నిమిషాలు, ఎండింగ్‌ 10 నిమిషాలు, ఇంటర్వెల్‌ బాంగ్‌ తప్ప మిగతా అంతా బోరింగ్‌‌గా సాగుతుంది. దీనివల్ల సినిమా రన్‌ టైం 115 నిమిషాలే అయినా రెండున్నర గంటల సినిమా చూసాం అనే ఫీలింగ్‌ వస్తుంది. 
 
అసలు మారుతీ అనే పేరు వుండటంతో ఈ చిత్రానికి ఓపెనింగ్స్‌ వస్తాయని భావించారు. అలాగే జరిగింది. సినిమా మొదట్లో తరుణ్‌ వాయిస్‌ ఓవర్‌తో పాత్రలని పరిచయం చేసిన విధానం అందరినీ నవ్వించేలా ఉంది. ఆ తర్వాత సప్తగిరి ఇంట్రడక్షన్‌ సీన్‌, అక్కడ తను చెప్పే ఇష్యూ బాగా నవ్వు తెప్పిస్తుంది. ఇకపోతే చివర్లో తాగుబోతు రమేష్‌తో చేయించిన కామెడీ బాగా వర్కౌట్‌ అయ్యింది. అలాగే క్లైమాక్స్‌‌లో ట్విస్ట్‌‌లని రివీల్‌ చేసి అన్నిటికీ క్లారిటీ ఇచ్చే సీన్‌ చాలా బాగున్నా, సెకండాఫ్‌ నుంచి కథ సాగదీతగా అనిపిస్తుంది. ఇటువంటి కొత్త ప్రయోగాలు చేస్తూ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేయాలనుకున్నారు. కానీ ఎంతమేరకు సక్సెస్‌ అవుతుందో అనుమానే.
 
రేటింగ్ ‌: 2/5