శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By dv
Last Updated : గురువారం, 1 డిశెంబరు 2016 (19:35 IST)

సైకో థ్రిల్లర్‌గా 'భేతాళుడు' .. ఊహాజనితమైన కథతో 'బిచ్చగాడు'

సంగీత దర్శకుడు హీరోగా మారి చేసిన తమిళ చిత్రం తెలుగులో 'బిచ్చగాడు'గా సంచలన విజయం సాధించింది. ఆ చిత్ర ఇచ్చిన విజయంతో ఈసారి 'భేతాళుడు' అనే సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చెప్పాడు. అందుకు పోస్టర్లను, ట్రైల

నటీనటులు : విజయ్‌ ఆంటోని, అరుంధతినాయర్‌, చారుహాసన్‌ తదితరులు
 
కెమెరా: ప్రదీప్‌, సంగీతం : విజయ్‌ ఆంటోనినిర్మాత : ఫాతిమా విజయ్‌ ఆంటోనీ, దర్శకత్వం : ప్రదీప్‌ కష్ణమూర్తి.
 
సంగీత దర్శకుడు హీరోగా మారి చేసిన తమిళ చిత్రం తెలుగులో 'బిచ్చగాడు'గా సంచలన విజయం సాధించింది. ఆ చిత్ర ఇచ్చిన విజయంతో ఈసారి 'భేతాళుడు' అనే సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చెప్పాడు. అందుకు పోస్టర్లను, ట్రైలర్స్‌ను పాములన్నీ చుట్టూచేరి.. విజయ్‌ను ఏదో చేసేసినట్లుగా క్రియేట్‌ చేశాడు. ఇది మామూలు సినిమా కాదని అర్థమయ్యేలా ప్లాన్‌ చేశాడు. దానికితోడు రెండుసార్లు నోట్ల ఎఫెక్ట్‌తో వాయిదా పడ్డ సినిమాను డిసెంబర్‌ 1న విడుదల చేశాడు. అంతకుముందే 15 నిముషాల భాగాన్ని ఆన్‌లైన్‌లో విడుదల చేసి తెలీని ఉత్కంఠను క్రియేట్‌ చేశాడు. మరి సినిమాలో ఉత్కంఠ వుందా? లేదా? చూద్దాం. 
 
కథ :
దినేష్‌ (విజయ్‌ ఆంటోనీ) సాఫ్ట్‌‌వేర్‌ ఉద్యోగి. మేధావి. అయినా తన మదిలో ఎవరో మాట్లాడుతున్నారనీ. వేరే వాయిస్‌ వినిపిస్తుందని.. డాక్టర్‌ను సంప్రదిస్తాడు. సైక్రియాటిస్ట్‌ దినేష్‌ను పరీక్షించి గత జన్మ తాలూకు జ్ఞాపకాలతో బాధపడుతున్నాడని నిర్ధారిస్తాడు. అప్పుడే అతని లైఫ్‌లో వైష్ణవి (అరుంధతి నాయర్‌) వస్తుంది. ఆమె రాకతో మానసిక రుగ్మత మరింత పెరుగుతుంది. పూర్వజన్మ తాలూకూ శర్మ, జయలక్ష్మి పేర్లనే ప్రస్తావింటూవుంటాడు. ఓ సందర్భంలో మాచెర్ల వెళ్ళి అక్కడ వాకబుచేస్తే ఆ పేరుగలవారు చనిపోయారనీ.. అందులో శర్మ తనేననీ, జయలక్ష్మి తన భార్య అని గ్రహిస్తాడు. ఈ జన్మలో జయలక్ష్మే, వైష్ణవిగా వచ్చిందని నిర్ధారణకు వచ్చేస్తాడు. అందుకే ఆమెను చంపడానికి ప్రయత్నిస్తాడు. డాక్టర్‌ రాకతో ఆమె తప్పించుకుంటుంది. ఆ తర్వాత తన చుట్టూ ఏదో జరుగుతుందని గ్రహించేసరికి తనను చంపాలనే వైష్ణవి మరలా వచ్చిందనే రుజువవుతుంది. అలా ఎందుకు చేస్తుంది? ఆ రుజువేమిటి? ఆ తర్వాత ఏం జరిగింది? అనేది సినిమా.
 
పెర్‌ఫార్మెన్స్‌
నటనా పరంగా శర్మగా విజయ్‌ ఆంటోని బాగానే చేశాడు. ప్రదీప్‌గానూ కాజువల్‌గా ప్రవర్తించాడు. ఈ రెండింటి వేరియేషన్‌ బాగుంది. జయలక్ష్మిగా అరుంధతి సహజంగానే నటించింది. చారుహాసన్‌ పోలీసు కానిస్టేబుల్‌గా నటించాడు. ఇతర పాత్రలు షరా మామూలే.
 
సాంకేతిక విభాగం :
దర్శకుడు ప్రదీప్‌ కష్ణమూర్తి ఫస్టాఫ్‌ ఓపెనింగ్‌, కథనాన్ని చాలా బాగా రాసుకుని క్లీన్‌గా స్క్రీన్‌ పై ప్రదర్శించాడు. సెకండాఫ్‌‌లో ఆంటోనీ గత జన్మ కథను, మొత్తం కథనాన్ని బాగానే రాసుకున్నాడు కానీ కథ ఉన్నట్టుండి ట్రాక్‌ మారడం, క్లైమాక్స్‌ విషయాల్లో కాస్త నిరుత్సాహపరిచాడు. ఈ సినిమాకు విజయ్‌ ఆంటోనీ బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ కీలకం. జయలక్ష్మి అనే బ్యాక్‌ గ్రౌండ్‌ వాయిస్‌ ఓవర్‌ చాలా బాగా కనెక్టయ్యాయి. ప్రదీప్‌ కళైపురయత్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. షూటింగ్‌ కోసం ఎంచుకున్న లొకేషన్లను బాగా చూపించాడు. ఎడిటింగ్‌ సినిమాపై క్లారిటీ ఉండేలా చేసింది. ఇక విజయ్‌ ఆంటోనీ పాటించిన నిర్మాణ విలువలు రిచ్‌గా బాగున్నాయి.
 
విశ్లేషణ:
సినిమా ఆరంభమే ఆసక్తికరంగా మొదలైంది. విజయ్‌ ఆంటోనీ మానసిక సమస్యను చూపిస్తూ రాసిన సన్నివేశాలు, వాటిని తెరపై చాలా సున్నితంగా చూపించిన తీరు బాగున్నాయి. కొన్ని సన్నివేశాల్లో అయితే హర్రర్‌ సినిమా చూస్తున్నామా అనే భావన కలిగింది. ఇక ఆ సన్నివేశాల్లో విజయ్‌ ఆంటోనీ నటన సన్నివేశాలను మరింత ప్రభావితంగా చేసింది. అయితే మొదటిభాగమంతా జయలక్ష్మి చుట్టూ తిరగడం.. ఆమెను వెతికే క్రమంలోనే పూర్తవుతుంది. కథ కూడా నత్తనడకగా సాగడంతో సినిమా ఎటువైపు పోతుందో అర్థంకాదు. 
 
ఇక సెకండాఫ్‌లో వచ్చే ఆంటోని గత జన్మ తాలూకు కథ చాలా సహజంగా, ఇంట్రెస్టింగా అనిపించింది. ప్రస్తుత జన్మలోని దినేష్‌ పాత్రకు, గత జన్మలోని శర్మ పాత్రకు మధ్య ఆంటోనీ చూపిన వైవిధ్యం అతనిలోని నటుడిని మరోసారి ప్రూవ్‌ చేసింది. ఇక బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌, వాయిస్‌ ఓవర్‌ బాగున్నాయి.
 
కాగా, గత జన్మ తాలూకూ జ్ఞాపకాలు కథకు ఇప్పటికి వచ్చేసరికి ఓ డ్రెగ్‌ మాఫియా మనుషులపై చేస్తున్న ప్రయోగాలతో లింక్‌ కలిపాడు. దాంతో కథ ఒక్కసారిగా మరో మార్గంవైపు మళ్ళింది. రెండు సినిమాలు చూపించినట్లుగా వుంది. గత జన్మ... డ్రెగ్‌ మాఫియాను సింక్‌ చేస్తూ దర్శకుడు రాసుకున్న కథ కాస్త కన్‌ఫ్యూజ్‌గా ఉండటంతో ఏదో చెప్పాలని ట్రై చేసినట్లు కన్పిస్తుంది. అప్పటిదాకా సినిమా క్లైమాక్స్‌‌పై పెట్టుకున్న తారా స్థాయి అంచనాలు ఒక్కసారిగా నీరుగారాయి. ఇక క్లైమాక్స్‌ కూడా రొటీన్‌‌గానే ఉండటం మరొక లోపం. దర్శకుడు ఎక్కడికక్కడ సరైన కారణాలతో అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నప్పటికీ సినిమా ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్‌‌లు అసంతృప్తిగానే అనిపించాయి. ఒక రకంగా చెప్పాలంటే దర్శకుడిచ్చిన ముగింపు సరైనదే అయినా సాధారణ ప్రేక్షకుడు ఆశించే రీతిలో లేదు. ఇక మధ్యలో వచ్చే కొన్ని పాటలు కాస్త బోరుకొట్టించాయి.
 
ఇది ఓ ప్రయోగాత్మక చిత్రంగా నిలిచే చిత్రం. సైకలాజికల్‌ థ్రిల్లర్‌‌కి కాస్త హర్రర్‌ టచ్‌ ఇవ్వబడిన ఈ సినిమాలో ఫస్టాఫ్‌ కథ, కథనాలు నెమ్మదిగా సాగుతాయి. సెకండాఫ్‌ కొంత భాగం, విజయ్‌ ఆంటోనీ నటన బాగున్నా షడెన్‌గా కథ ట్రాక్‌ మారిన విధానం, నిరుత్సాహపరిచే క్లైమాక్స్‌లతో ఏవరేజ్‌ సినిమాగా నిలుస్తుంది. అయితే బిచ్చగాడు అంత లాజిక్కులు ఇందులో ఉండవు. ఊహీజనికతమైన కథ కాబట్టి.. ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారో చూడాల్సిందే.
 
రేటింగ్‌: 5/2.5