శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By DV
Last Updated : శుక్రవారం, 23 అక్టోబరు 2015 (19:18 IST)

సోసోగా... కొలంబస్‌.. రివ్యూ రిపోర్ట్..!

నటీనటులు : సుమంత్‌ అశ్విన్‌, శీరత్‌ కపూర్‌, మిస్తీ చక్రవర్తి, పృథ్వి, శ్రీమన్నారాయణ తదితరులు.
సంగీతం : జితిన్‌, నిర్మాత : అశ్వినీ కుమార్‌ సహదేవ్‌, దర్శకత్వం : రమేష్‌ సామల.
 
ఎం.ఎస్‌. రాజు వారసుడిగా 'అంతకుముందు ఆ తరువాత', 'లవర్స్‌', 'కేరింత' సినిమాలతో హీరోగా చేసిన సుమంత్‌ అశ్విన్‌ తాజాగా 'కొలంబస్‌' అనే చిత్రంతో ముందుకు వచ్చాడు. అయితే టైటిల్‌లో ఏదో కనుగొన్నవాడిగా పేరు పెట్టినా.. అది కథకు సూటయిందా? లేదా? అనేది తెలుసుకోవాలంటే సినిమాలోకి వెల్లాల్సిందే.
 
కథ :
ప్రేమ విఫలమయి జైలు శిక్ష అనుభవిస్తున్న అశ్విన్‌ (సుమంత్‌ అశ్విన్‌), జైలు నుంచి బయటకొచ్చాక మళ్ళీ తన ప్రేమను తిరిగి దక్కించుకునేందుకు ప్రయత్నిస్తాడు. తన ప్రేయసి ఇందు (మిస్తీ చక్రవర్తి) కోసం వేట మొదలుపెడతాడు. ఆమె స్నేహితుల్ని సంప్రదిస్తాడు. ఈ ప్రయాణంలో తనకు పరిచయమైన నీరజ (శీరత్‌ కపూర్‌) అన్ని విధాలా అతడి ప్రయత్నాల్లో సహాయం చేస్తూంటూంది. ఈ ప్రయాణంలో అనుకోకుండానే అశ్విన్‌, నీరజ దగ్గరవుతారు. ఇలాంటి పరిస్థితుల్లో అశ్విన్‌ ప్రయాణం ఎటువైపు సాగింది? అతడి నిజమైన ప్రేమను ఎలా కనుక్కున్నాడు? ఇందు, నీరజ ఇద్దరిలో చివరకు అశ్విన్‌ ఎవరికి దగ్గరవుతాడు? అన్న ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
 
పెర్‌ఫార్మెన్స్‌:
అశ్విన్‌గా సుమంత్‌ అశ్విన్‌ సూటయ్యాడు. డైలాగ్‌ డెలివరీలో, కామెడీ టైమింగ్‌లో సుమంత్‌ పరిణతి సాధించాడు. ఇక శీరత్‌ కపూర్‌ నీరూ పాత్రలో చాలా బాగా నటించింది. కొన్ని చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్‌ వదిలేస్తే ఓవరాల్‌గా మంచి పర్ఫామెన్స్‌ ఇచ్చింది. మిస్తీ చక్రవర్తి తనకిచ్చిన పాత్రకు వీలైనంత మేర న్యాయం చేసింది. ఇక సప్తగిరి కొన్నిచోట్ల నవ్వించే ప్రయత్నం చేశాడు. అశ్విన్‌ తల్లిగా నటించిన రోహిణి ఉన్నంతలో ఆ పాత్రకు ఓ అర్థాన్ని తెచ్చిపెట్టింది. మిగిలిన వారు పర్వాలేదు.
 
సాంకేతిక విభాగం :
రమేష్‌ సామల ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీలోని కొత్త పాయింట్‌ను దర్శకుడిగా బాగానే డీల్‌ చేశాడు. ఎమ్మెస్‌ రాజు అందించిన కథను సినిమాగా చెప్పే ప్రయత్నంలో దర్శకుడిగా చాలావరకు సక్సెస్‌ అయ్యాడు. అయితే క్యారెక్టరైజేషన్స్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకొని కథను ఆ కోణంలో నడిపించి ఉంటే ఈ సినిమాకు బాలీవుడ్‌ రొమాన్స్‌ జానర్‌ సినిమాల్లో కనిపిస్తోన్న కొత్తదనం తోడయి సినిమాను మరో ఎత్తులో నిలబెట్టేది. 
 
ప్రీ క్లైమాక్స్‌లో దర్శకుడి పనితనం బాగా ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రాఫర్‌ భాస్కర్‌ సామల పనితనం చాలా బాగుంది. ఒక మోస్తారు బడ్జెట్‌ సినిమా అయినా కూడా ఎక్కడా ఆ ఫీల్‌ రాకుండా చూడడంలో సినిమాటోగ్రాఫర్‌ పనితనం చూడొచ్చు. ఎడిటర్‌ కె.వి.కృష్ణారెడ్డి పనితనం పర్వాలేదు. కొన్నిచోట్ల సన్నివేశానికి, సన్నివేశానికి మధ్య తీసుకున్న ఎఫెక్ట్‌ కట్స్‌ ఇబ్బంది కలిగిస్తాయి. జితిన్‌ అందించిన మ్యూజిక్‌ బాగుంది. పాటలన్నీ సినిమాలో కలిసిపోయేవే కావడం కూడా కలిసివచ్చింది. ఇక ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌ బాగున్నాయి.
 
విశ్లేషణ:
ప్రేమకథను ఇద్దరు హీరోయిన్లను పెట్టి.. ఒక హీరోయిన్‌ ప్రేమకోసం తపన పడుతూ.. రెండో ఆమె ద్వారా.. ఆ ప్రేమను గెలుచుకోవాలని.. చివరి ఆమెతోనే ప్రేమలో పడడం.. క్లుప్తంగా కథ.. ఇదిఇంతకుముందు కొన్ని చిత్రాల్లో వచ్చినా... సుమంత్‌ అశ్విన్‌తో ఎం.ఎస్‌. రాజు సాహసం చేయించాడనే చెప్పాలి.   సుమంత్‌ అశ్విన్‌, శీరత్‌ కపూర్‌ల సమాంతర కథను వీలైనంత ఫ్రెష్‌గా చూపడం గురించి చెప్పుకోవచ్చు. ఈ సన్నివేశాలన్నీ కొంత ఫన్నీగా, ఆసక్తికరంగా ఉండడంతో చాలా బాగా ఆకట్టుకుంటాయి.
 
మిస్తీ, సుమంత్‌ల క్యారెక్టర్స్‌కు సరైన క్యారెక్టరైజేషన్‌ లేదు. చివర్లో సుమంత్‌ క్యారెక్టర్‌కు ఓ జస్టిఫికేషన్‌ ఇచ్చే ప్రయత్నం జరిగినా అది కృత్రిమంగా కనిపిస్తుంది. ఇక సుమంత్‌, మిస్తీల లవ్‌స్టోరీ చాలా సాదాసీదాగా ఉంది. హీరో క్యారెక్టర్‌ తన ప్రేమ కోసం ఎంతదూరమైన వెళ్ళినపుడు ఆ ప్రేమలో నిజాయితీ, ఫీల్‌ ఉండాలి. ఇక్కడ క్యారెక్టర్‌ను దృష్టిలో పెట్టుకొని చూసినపుడు అవి మిస్‌ అయినట్టు కనిపిస్తుంది.
 
ఇక ఈ సినిమాలో ట్రయాంగిల్‌ స్టోరీకి ఎంచుకున్న పాయింట్‌ కొత్తగా ఉన్నా, ఒకదశలో సినిమా మొత్తం ఒకే ఒక్క సింగిల్‌ పాయింట్‌తో నడుస్తూ వచ్చిన సన్నివేశాలే వస్తూన్నాయా అనే ఫీలింగ్‌ కలిగిస్తుంది. సప్తగిరి కామెడీ ట్రాక్‌ నవ్వించే ప్రయత్నం చేసినా, ఆ ట్రాక్‌ కథకు సరిగ్గా కుదరలేదు. ఫస్టాఫ్‌లో చాలా చోట్ల సినిమాకు కథా గమనం అంటూ ఒకటి లేకుండా సినిమా అలా అలా ఎయింలెస్‌గా సాగిపోతుంది. ఇక రొమాంటిక్‌ కామెడీల్లో ఉండే అసలైన ఫన్‌ ఈ సినిమాలో చాలా చోట్ల మిస్‌ అయింది. అశ్విన్‌, ఇందులను కలిపేందుకు నీరూ వేసే కొన్ని ప్లాన్స్‌ మరీ సినిమాటిక్‌గా ఉన్నాయి. 
 
పేమను వెతికి పెట్టేందుకు మొదలైన ప్రయాణంలో అనుకోకుండా కనిపించే మరో కొత్త ప్రేమకథ, కొత్త ఎమోషన్‌, ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీలో కొత్తదైన కాన్సెప్ట్‌ లాంటి పాజిటివ్‌ పాయింట్స్‌తో వచ్చిన కొలంబస్‌, ఒకే సింగిల్‌ పాయింట్‌తో సాదాసీదాగా చివరివరకూ నడవడం, క్యారెక్టరైజేషన్‌లో సరైన క్లారిటీ లేకపోవడం, ఇంతకుముందే చూసినట్టనిపించే కథ వంటి మైనస్‌ పాయింట్స్‌తో ప్రేమను కనిపెట్టే ప్రయత్నంలో చివరిదాకా వచ్చి సక్సెస్‌ సాధించినా మధ్యలో చాలాసార్లు తడపడ్డాడు. పెద్ద శాస్త్రవేత్త పేరును పెట్టి... సాదాసీదా లవ్‌స్టోరీకి పెట్టడం సూట్‌కాలేదు.
 
రేటింగ్‌: 2.5