శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By ivr
Last Modified: శుక్రవారం, 10 అక్టోబరు 2014 (16:39 IST)

ఒకే అమ్మాయి ప్రేమలో తండ్రీకొడుకులు 'దిక్కులు...' రివ్యూ రిపోర్ట్

దిక్కులు చూడకు రామయ్య నటీనటులు: నాగ శౌర్య, సన మక్బూల్, అజయ్, ఇంద్రజ తదితరులు. దర్శకత్వం- త్రికోటి; నిర్మాత- రజిని కొర్రపాటి, సంగీతం- ఎం.ఎం కీరవాణి
 
ఒకే అమ్మాయి ప్రేమలో తండ్రీ కొడుకులు పడితే ఎలా ఉంటుంది... అదే 'దిక్కులు చూడకు రామయ్య' చిత్రం. ‘ఈగ’, ‘లెజెండ్’, ‘ఊహలు గుసగుసలాడే’ వంటి సూపర్ హిట్ చిత్రాలను తీసిన నిర్మాత సాయి కొర్రపాటి సారథ్యంలో వచ్చిన మరో చిత్రం ఈ దిక్కులు చూడకు రామయ్య. ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతను రాజమౌళి దగ్గర అసిస్టెంట్ దర్శకుడుగా పనిచేసిన త్రికోటిపై పెట్టారు. నాగ శౌర్య, సన మక్బూల్, అజయ్, ఇంద్రజ కీలక పాత్రలు పోషించిన ఈ రొమాంటిక్ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు. అందరూ కలిసి దిక్కులు చూడకు రామయ్యలో ఏం చేశారో చూద్దాం.
 
కథగా చెప్పాలంటే....
 
గోపాల కృష్ణ అలియాస్ క్రిష్(అజయ్) తన పెద్దల మాటకు కట్టుబడి 15 ఏళ్ళ ప్రాయంలోనే భవాని(ఇంద్రజ)ని పెళ్లి చేసుకొని 24 ఏళ్ళకే ఇద్దరి పిల్లలకు తండ్రి అయిపోతాడు. ఐతే టీనేజ్ ముచ్చట తీరకుండానే పెళ్లి అయిపోయినందుకు బాధపడుతుంటాడు. తను మిస్ అయినదాన్ని పొందాలనుకుని లవ్ ఎంజాయ్ మెంట్ కోసం పాకులాడుతుంటాడు. ఫలితంగా లేటు వయసులో క్రిష్ కనిపించిన అమ్మాయికి లైన్ వేసి లవ్ లో పడేసేందుకు యత్నిస్తుంటాడు. 
 
ఈ క్రమంలో క్రిష్ కి సమీత (సన మక్బూల్)తో పరిచయమవుతుంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మార్చుకుంటాడు. మరోవైపు గోపాల కృష్ణ పెద్ద కొడుకు మధు(నాగ శౌర్య) కూడా సమీతతో ప్రేమలో పడతాడు. వ్యవహారం ఇలా నడుస్తుండగానే మధుకి తను ప్రేమించే అమ్మాయినే తన తండ్రి క్రిష్ కూడా ప్రేమిస్తున్నాడని, తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని తెలుస్తుంది. షాక్ తింటాడు. మరి అప్పుడు మధు ఏం చేశాడు...? తన తండ్రి కోసం ప్రేమను వదులుకున్నాడా? లేటు వయసులో తన ప్రేమని దక్కించుకోవడానికి గోపాల కృష్ణ పడ్డ కష్టం ఫలిస్తుందా అనేవి వెండితెరపై చూడాల్సిందే.
 
విశ్లేషణ 
 
ఇలాంటి కథను టచ్‌ చేయడం సాహసమే. తండ్రీ కొడుకులు ఒకే అమ్మాయిని ప్రేమించడం అనేది చాలా సెన్సిటివ్‌ పాయింట్‌. దీన్ని వెండితెరపై ఆవిష్కరించే ప్రయ్నతం చేయడం కష్టమే. ఇంతకుముందు ఇదే బేనర్‌లో 'ఊహలు గుసగుసలాడే' చిత్రాన్ని తీశారు. ఇంచుమించు అలాంటి పాయింటే. ఒక అమ్మాయిని ఇద్దరు ప్రేమిస్తారు. ఒకరు బాస్‌. మరొకరు కొలీగ్‌. కాకపోతే ఇందులో తండ్రీకొడుకులుగా చూపించారు. చిన్నపాయింట్‌ను తీసుకుని అటూఇటూ మార్చేసి లోబడ్జెట్‌తో సినిమా తీసే చిత్రాల్లో ఇది చేరుతుంది.
 
ఇందులో ప్రత్యేకంగా చెప్పాల్సింది తండ్రిగా చేసిన అజయ్‌. పాత్రకు సూటయినా.. లేటు వయుస్సులో ప్రేమలో కాస్త తడబడతాడు. కొన్నిసార్లు నవ్వు తెప్పిస్తాడు. ఇలాక్కూడా ఇతన్ను చూపించవచ్చా అన్నంతగా దర్శకుడు ప్రెజెంట్‌ చేశాడు. ఇక నాగౌశర్యకు ఇది రెండవ సినిమా. తొలి సినిమా కంటే కాస్త బెటర్‌ ఔట్‌పుట్‌ ఇచ్చాడు. వీరిద్దరికంటే హీరోయిన్‌ సన మక్బూల్‌ గురించి చెప్పాల్సి వుంది. ఆమె నటనతో ఆకట్టుకుంది. మోడ్రన్‌గానూ, క్లాస్‌గాను హావభావాలు పలికించింది. ఈమె కాకుండా చాలా కాలం తర్వాత ఇంద్రజ కన్పించడం. కొన్ని ఎమోషన్స్ బాగా పండించింది. 
 
మైనస్‌ల్లా.. చిత్ర కథనం చాలా నిదానంగా సాగుతుంది. మొదటిభాగం గూడ్సుబండిలా సాగి కొంత విసుగు తెప్పిస్తుంది. ఇంటర్‌వెల్‌ తర్వాత హుషారెక్కిస్తుంది. నవ్వుకోవడానికి బ్రహ్మాజీని పెట్టినా సాదాసీదాగా వుంటాయి. తెలుగువారికి కొత్తగా అనిపించే కథ ఇది. హాలీవుడ్‌లో ఇటువంటి చిత్రాలు చాలా వచ్చాయి. ఆ పాట్రన్‌ను రాజమౌళి శిష్యుడు తెలుగులో పరిచయం చేసే పనిచేశాడు.
 
కీరవాణి బాణీలు ఆహా! అనిపించకపోయినా పర్వాలేదు అనిపిస్తాయి. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ బాగుంది.  ఎక్కువభాగం హైదరాబాద్‌ పరిసర ప్రాంతల్లో తీశాయి. లోబడ్జెట్‌ చిత్రాల్లో ఇది చెప్పుకోవచ్చు. కెమెరా పనితరం పర్వాలేదు. ప్రధానంగా దర్శకత్వం కొద్దిగా వీక్‌గా వుంది. చెప్పేవిధానంలో ఆసక్తి లేకపోవడం, కొత్తదనం చూపించబోయే హాలీవుడ్‌ పోకడలు స్పష్టంగా కన్పించడం జరిగాయి. ఇది డిఫరెంట్‌ కాన్సెప్టులు చూసే మల్టీప్లెక్స్‌ ప్రేక్షకులకు నచ్చే సినిమాగా చెప్పవచ్చు. తండ్రీకొడుకుల ప్రేమకథలు నిజంగా హిట్టయితే.. ఇలాంటివి మరిన్ని వచ్చేవి. కీరవాణి బ్రాండ్‌ ఈ సినిమాకు పెద్దగా ఉపయోగపడదు. ఇలాంటి కథలు కొందరికి మింగుడుపడవు. బయటకు వెళ్ళడానికి దిక్కులు చూడాల్సిందే.