శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By DV
Last Modified: శుక్రవారం, 13 మార్చి 2015 (17:10 IST)

నిర్భయ నిందితులకు డా.సలీమ్‌ ట్రీట్‌మెంట్‌... రివ్యూ రిపోర్ట్

డా. సలీమ్ నటీనటులు: విజయ్‌ విన్సెంట్‌, అక్ష తదితరులు, నిర్మాత- సురేష్‌ కొండేటి, కుమార్‌ రెడ్డి. దర్శకత్వం : నిర్మల్‌ కుమార్‌.
 
పాయింట్‌: నిర్భయ నిందితులకు సలీమ్‌ తనదైన ట్రీట్‌మెంట్‌.
 
ఇటీవల సినిమా కథలు వాస్తవ సంఘటనల్లోంచి పుట్టుకొస్తున్నాయి. ఢిల్లీలో జరిగిన నిర్భయ వుందంతం అందరినీ కుదిపేసింది. సినిమా రంగంలోనూ అలజడి నెలకొంది. అందులో తనవంతు బాధ్యతగా నిర్మాత, నటుడు అయిన విజయ్ విన్సెంట్‌ చేసిన ప్రయత్నమే డా. సలీమ్‌. ఈ చిత్రాన్ని తమిళంలో నిర్మిస్తే బాగానే ఆడింది. దాన్ని కాస్త ఆలస్యమైనా తెలుగులో నేడే విడుదల చేశారు. అయితే అప్పటికే ఇలాంటి కథతో ఎన్‌టిఆర్‌ జూనియర్‌ 'టెంపర్‌' చేయడంతో ఈ సినిమాపై ఎఫెక్ట్‌ బాగానే పడే అవకాశం ఉంది. మరి ఈ చిత్రంలో సలీమ్‌ ఏం చెప్పాడో చూద్దాం.

 
కథ : 
డా. సలీమ్‌(విజయ్‌ విన్సెంట్‌) అనాథ. కానీ డాక్టర్‌గా ఎదుగుతాడు. మానవతావాది. నీతిపరుడు. కార్పొరేట్‌ ఆసుపత్రిలో పనిచేస్తుంటాడు. పేషెంట్ల రక్తాన్ని డబ్బులుగా మార్చుకునే ఆసుపత్రి యాజమాన్యానికి సలీమ్‌ చేసే మానవత్వపు ఆలోచనల వల్ల ఆదాయం పడిపోతుందని భావిస్తారు. ఇంకోవైపు నిషా(అక్ష)ను పెండ్లి చేసుకోవడానికి సిద్ధమవుతాడు. అతని ప్రవర్తన నచ్చి అనాథ అయినా ఆమె ముందుకు వస్తుంది. నిశ్చితార్థం అవుతుంది. కానీ వృత్తిరీత్యా వచ్చే ఇబ్బందుల వల్ల ఆమెతో సమయాన్ని కేటాయించలేకపోతాడు. దాంతో విసుగు చెంది డ్రాప్‌ అవుతుంది. ఆ తర్వాత మానభంగానికి గురై చావుబతుకుల మధ్య వున్న ఓ యువతికి సలీమ్‌ ట్రీట్‌మెంట్‌ చేస్తాడు. కానీ తర్వాత రోజు మాయమైపోతుంది. దీనికి కారణం ఎవరు? తర్వాత ఏం జరిగింది? అనేది మిగిలిన కథ.
 
పెర్‌ఫార్మెన్స్‌ 
స్వతహాగా నృత్యదర్శకుడు అయిన విజయ్‌ ఆంటోనీ.. ఈ చిత్రంలో నటుడిగా చేశాడు. ఇంతకుముందు 'నకిలి' అనే చిత్రంలో నటించాడు. సీరియస్‌గా వుంటూ ఎక్కువ ఎక్స్‌ప్రెషన్స్‌ లేని పాత్ర చేయడంతో ఆయన్నుంచి ఎటువంటి పెర్‌ఫార్మెన్స్‌ ఆశించలేం. చాలాకాలం తర్వాత అక్ష ఇందులో హీరోకు ప్రేయసిగా నటించింది. ఆమె పాత్ర పరిమితమే. మిగిలినవారంతా పోలీసు పాత్రలు, హోంమంత్రి క్యారెక్టర్లు అంతా తమిళ నటులే. టెక్నికల్‌గా చెప్పాలంటే.. సినిమాటోగ్రఫీ బాగుంది. కథ, స్క్రీన్‌ప్లేలో విషయంలో కొత్తదనం లేకపోయినా బోర్‌ కొట్టకుండా చేయడం ప్రత్యేకత. ఎడిటింగ్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంటులు ఫర్వాలేదు. 
 
విశ్లేషణ 
ఇటువంటి కథను తీసుకుని సినిమాగా తీయడం సాహసమే. తెలుగులో ఈ పాటికే ఇటువంటి కథలు చాలా వచ్చాయి. టెంపర్‌ రాక ముందే బోల్డన్ని వచ్చేశాయి. కానీ ట్రీట్‌మెంట్‌ కొత్తగా చేయడం ఇందులో కొత్తదనం. మొదటి భాగం చాలా సరదాగా సాగుతుంది. అక్ష రీ-ఎంట్రీ అయినా.. ఆమెకు హీరోతో మధ్య సాగే సన్నివేశాలు ఎంటర్‌టైన్‌గా వుంటాయి. సెకండాఫ్‌లోనే సలీమ్‌ ఏం చేయబోతున్నాడనేది ఆసక్తికరంగా వుంటుంది. ఈ కథ ద్వారా ఏదో ఒక సందేశాన్ని ఇవ్వాలనే తలంపుతో విజయ్‌ ఆంటోని చేసిన ప్రయత్నమిది. కొన్ని సన్నివేశాలు తర్వాత ఏమవుతుందో, డాక్టర్‌ అపరాధులకు ఎలా ట్రీట్‌ చేస్తాడో తెలిసిపోతుంది. 
 
అయితే, పదవిని అడ్డం పెట్టుకుని రాజకీయ నాయకులు ఎలా ప్రవర్తిస్తారో.. సమాజానికి తమ వారసుల్ని ఎలా తీసుకువస్తారో చూపించాడు. పోలీసు వ్యవస్థ కూడా ఎలా పనిచేస్తుందో చూపించాడు. ఈ రెండు రంగాలు ప్రజలతో ఏవిధంగా ఆడుకుంటారనేది సారాంశం. అందుకు సలీమ్‌ ఇచ్చిన ముగింపు గొప్పదేమీ కాకపోయినా ఫర్వాలేదు అనిపిస్తుంది.