శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By PNR
Last Updated : శుక్రవారం, 11 జులై 2014 (12:06 IST)

వెంకటేష్ - మీనల 'దృశ్యం' చిత్రం ఎలావుందంటే..?

విక్టరీ వెంకటేష్, మీనా, నదియా, నరేశ్, రవి కాలే, కృతిక, బేబి ఎస్తేర్ నటించిన ‘దృశ్యం’ సినిమా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైంది. డి.సురేష్ బాబు, రాజ్ కుమార్ సేతుపతి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి నటి శ్రీప్రియ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎలా వుందో ఓసారి చూద్దాం. ‘దృశ్యం’ సినిమా సస్పెన్స్, థ్రిలర్, ఫ్యామిలీ డ్రామాల మేళవింపుగా రూపొందిన సినిమా. పోలీస్ ఆఫీసర్లయిన నదియా, నరేష్‌ల కుమారుడు వరుణ్ కనిపించకుండా పోతాడు. దాంతో పోలీసులకి ఒక చిన్న పల్లెటూరిలో కేబుల్ ఆపరేటర్‌గా ఉన్న రాంబాబు (వెంకటేష్) అనే కుటుంబం మీద అనుమానం కలుగుతుంది. 
 
భార్యా, భర్త, ఇద్దరు ఆడపిల్లలతో సంతోషంగా సాగిపోతున్న ఆ కుటుంబంలోకి పోలీసులు ప్రవేశిస్తారు. ఆ కుటుంబానికి వరుణ్ కనిపించకుండా పోవడానికి సంబంధమేంటి? ఆ కుటుంబాన్నే ఎందుకు అనుమానించారు? పోలీసుల విచారణ నుంచి రాంబాబు కుటుంబం తప్పించుకుందా? ఈ కుటుంబమే వరుణ్‌ని కిడ్నాప్ చేసిందా? అసలేం జరిగింది? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ‘దృశ్యం’ సినిమాను వెండితెపై చూడాల్సిందే.
 
కేబుల్ ఆపరేటర్ రాంబాబుగా వెంకటేష్ విభిన్నమైన పాత్రలో ఆకట్టుకున్నారు. ఆయన కొన్ని సన్నివేశాలలో చక్కటి ఎమోషన్స్ పలికించారు. చాలాకాలం తర్వాత మీనాకి మరో మంచి పాత్ర దొరికింది. వెంకటేష్ కుమార్తెలుగా నటించిన కృతిక, బేబీ ఎస్తేర్ ప్రశంసనీయమైన నటన ప్రదర్శించారు. నదియా, నరేష్ జంట నటనకు మంచి మార్కులే పడ్డాయి. వెంకటేష్ కుటుంబాన్ని వేధించే కానిస్టేబుల్‌గా నటించిన రవి కాలే ఆకట్టుకున్నారు. ప్రేక్షకులకు చక్కని అనుభూతి కలిగేవిధంగా శ్రీప్రియ ‘దృశ్యం’ చిత్రాన్ని మలిచి సక్సెస్‌ను సొంతం చేసుకున్నారు.