శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By IVR
Last Modified: గురువారం, 10 జులై 2014 (14:41 IST)

ఉత్కంఠ‌తను రేకెత్తించే ‘దృశ్యం’... రివ్యూ రిపోర్ట్

'దృశ్యం' నటీనటులు : వెంకటేష్, మీనా, కృతిక, బేబీ ఎస్తర్ర‌, వికాలె, బెన‌ర్జీ, కాదంబ‌రి కిర‌ణ్‌, చ‌ల‌ప‌తిరావు, అన్నపూర్ణమ్మ‌, స‌మీర్‌, ప‌రుచూరి వెంక‌టేశ్వర‌రావు త‌దిత‌రులు; కెమెరాః ఎస్‌.గోపాల్‌రెడ్డి, సంగీతం: ఎస్.శరత్, నిర్మాత: డి. సురేష్ బాబు, రాజ్ కుమార్ సేతుపతి, దర్శకత్వం: శ్రీప్రియ.
 
తెలుగులో వెంక‌టేష్ సినిమాల‌కు ఓ ఆద‌ర‌ణ ఉంది. మ‌హిళ‌లు ఎక్కువ‌గా ఇష్టప‌డే న‌టుడు ఆయ‌న‌. ఫ్యామిలీ ఎమోష‌న్స్ బాగా పండించే న‌టుడు. క‌నుక‌నే `ఆడ‌వారి మాట‌కు అర్థాలే వేరులే` చిత్రాలంటే ప్రేక్షకులు కూడా చూస్తుంటారు. క‌థానాయ‌కుడిగా ఇద్దరితో క‌లిసి వ‌చ్చే చిత్రాల‌ను కూడా చేస్తున్న త‌రుణంలో సోలో హీరోగా చేసిన సినిమా ‘దృశ్యం’. ఇది మ‌ల‌యాళంలో మోహ‌న్‌లాల్ న‌టించిన సినిమాను అదే పేరుతో రీమేక్ చేశారు. 
 
త‌మిళంలో సినిమాలు తీసే రాజ్ కుమార్ సేతుపతి స‌హ‌కారంతో డి. సురేష్ బాబు క‌లిసి నిర్మించారు. మల‌యాళంలో వంద రోజులు ఆడింద‌న్న ఈ సినిమాను తెలుగులో ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలంటే వేచి చూడాల్సిందే.
 
కథగా చెప్పాలంటే :
విజ‌య‌న‌గ‌రం ద‌గ్గర‌లోని రాజవరం అనే ఊరిలో క‌థ మొదలవుతుంది. రాంబాబు(వెంక‌టేష్‌) అక్కడి పోలీసు స్టేష‌న్‌లో కూర్చొని ఉంటాడు. అప్పుడే డ్యూటీలోకి వ‌చ్చిన కొత్త కానిస్టేబుల్, రాంబాబును చూసి.... ఈయ‌న‌ వ‌ల్లే పోలీసు స్టేష‌న్ మొత్తం ట్రాన్సఫ‌ర్ అయింద‌ని చెబుతాడు. ఎందుకు అలా జ‌రిగింద‌నేది ఫ్లాష్‌బ్యాక్‌. ఆ ఊరిలో జ్యోతి కేబుల్ నెట్వర్క్స్ పెట్టుకున్న రాంబాబు(వెంకటేష్) తన కుటుంబం... భార్య ఇద్దరు పిల్లలైన‌... (మీనా), అంజు (కృతిక), అను (బేబీ ఎస్తర్) హ్యాపీగా జీవిస్తుంటాడు. రాంబాబు చాలా నిజాయితీపరుడు. 

 
అదే ఊరిలో బాగా లంచాలకు మరిగిన వీరభద్రం(రవి కాలే)కి రాంబాబుకి అస్సలు పడదు.    కాగా, ఒకరోజు స్కూల్ టూర్ నిమిత్తం అంజు ఓ ఊరు వెళుతుంది. అక్కడ ఐజి గీత ప్రభాకర్(నదియా) కుమారుడు వరుణ్ ఆడ‌వాళ్ళ ఫొటోలు తీస్తాడు. హైద‌రాబాద్ అమ్మాయి గొడ‌వ చేస్తుంది. ఓసారి అంజు ఊరు వ‌చ్చిన వ‌రుణ్‌.... కనపడకుండా పోతాడు. దీనికి కార‌ణం రాంబాబే అయి ఉంటాడని వీరభద్రం ఐజీకి చెబుతాడు. దాంతో అతని ఫ్యామిలీ ఇరుక్కుంటుంది. ఆ కేసుకి రాంబాబు ఫ్యామిలీకి ఏమన్నా సంబంధం ఉందా? లేక వీరభద్రం కావాలనే ఇరికించాడా? చివరికి రాంబాబు ఫ్యామిలీ ఆ కేసు నుంచి బయటపడ్డారా? లేదా అన్నది చూడాల్సిందే.
 
న‌టీన‌టులు... 
న‌ట‌నాప‌రంగా వెంక‌టేష్‌... అమాయ‌కుడిగానూ, తెలివిమీరిన వాడిగా బాగా చేశాడు. నాల్గవ త‌ర‌గ‌తి ఉత్తీర్ణత అయినా... లోక‌జ్ఞానాన్ని త‌ను చూసే సినిమాల‌ ద్వారా ఎలా పొందాడ‌నేది ఇందులో కీల‌కం. దాన్ని చ‌క్కగా చేశాడు. 10వ‌ త‌ర‌గ‌తి ఫెయిల్ అయిన జ్యోతిగా మీనా న‌టించింది. కుటుంబాల్లో ఉండే అల్లరి చిలిపి స‌ర‌దాలు ఇందులో బాగానే ఉన్నాయి. అవినీతి పోలీసుగా ర‌వి కాలే బాగానే చేశాడు. ఐజీగా న‌దియా జీవించింది. ఆమె భర్తగా సీనియ‌ర్ నరేశ్ చేశాడు. వెంకీ – సప్తగిరి మధ్య వచ్చే సన్నివేశాలు, అలాగే కొన్ని ఫ్యామిలీ సన్నివేశాలు ప్రేక్షకులను నవ్విస్తాయి. ఇంకా మిగిలిన పాత్రలు మామూలే.
 
సాంకేతిక నిపుణులు : 
ద‌ర్శకురాలు శ్రీప్రియ మలయాళ వెర్షన్‌లోని సీన్స్‌ని పిన్ టు పిన్ దించినా థ్రిల్లింగ్ మూమెంట్స్‌ని ఆడియన్స్‌కి కనెక్ట్ చెయ్యడంలో మాత్రం పూర్తిగా సక్సెస్ అయ్యింది. అలాగే నటీనటుల నుంచి మంచి నటనను రాబట్టుకున్నారు. ఇక సినిమాకి శరత్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి చాలా హెల్ప్ అయ్యింది. థ్రిల్లింగ్ మూమెంట్స్‌కి అతను ఇచ్చిన మ్యూజిక్ ఆడియన్స్‌లో ఉత్కంఠని మరింత పెంచేస్తుంది. అలాగే ఎస్ గోపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి మరింత హెల్ప్ అయ్యింది. 
 
సినిమా అంతా పచ్చని పల్లెటూరి వాతావరణాన్ని చాలా బాగా చూపించాడు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ బాగుంది. ఆయన ఇంకాస్త ట్రై చేసి ఫస్ట్ హాఫ్‌లో ఇంకాస్త రన్ టైం తగ్గించి ఉంటే సినిమా ఇంకా చాలా బాగుండేది. అలాగే జీటు జోసెఫ్ అందించిన కథ – కథనం, పరుచూరి బ్రదర్స్ రచన, డార్లింగ్ స్వామి డైలాగ్స్ కూడా బాగున్నాయి. సురేష్ బాబు – రాజ్ కుమార్ కలిసి నిర్మించిన ఈ చిత్ర నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
 
విశ్లేష‌ణ  : 
మొద‌టిభాగంగా సాదాసీదాగా ప‌ల్లెటూరిలో ఓ కుటుంబం, చుట్టూ ఉన్న ప్రజ‌ల మ‌ధ్య సాగుతుంది. ఇంట‌ర్‌వెల్‌లో థ్రిల్లింగ్ ఉంటుంది. ఇక సెకండాఫ్‌లో అది కంటిన్యూ అవుతుంది.  థియేటర్స్‌లో సినిమా చూసే ప్రతి ఒక్కరి చేత వావ్ సూపర్బ్ అనిపిస్తాయి. ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ని జోడించి చూపించడం ఇదే తొలిసారి కావడం వలన ఆడియన్స్ థ్రిల్‌కి ఫీలవుతారు. సెకండాఫ్ మొత్తం చాలా గ్రిప్పింగ్‌గా అందరూ సీట్లో నుంచి కదలకుండా నెక్ట్స్ ఏం జరుగుతుందా అని చూసేలా ఉంటుంది. 
 
ఈ సినిమా మొత్తాన్ని తన భుజాలపైన నడిపించిన వెంకటేష్ గురించి.. వెంకటేష్ ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పించడం కొత్తేమీ కాదు, కానీ ఇలాంటి థ్రిల్లింగ్ సినిమాలో చేయడం మాత్రం ఇదే తొలిసారి. రాంబాబు పాత్రలో అద్భుతమైన నటనని కనబరిచాడు. చాలారోజుల తర్వాత మళ్ళీ తెలుగుతెరపై కనిపించిన మీనా వెంకటేష్‌కి భార్య పాత్రలో చక్కగా సరిపోయింది. తన పాత్రకి పూర్తి న్యాయం చేసింది. ఎప్పటిలానే వెంకీ – మీనాల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. అలాగే ఈ సినిమాతో పరిచయమైన కృతిక, బేబీ ఎస్తర్ లు తమ పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించేలా నటనని కనబరిచారు.
 
ఈ సినిమాకి రన్ టైం కాస్త ఎక్కువ కావడం వల్ల కొన్నిచోట్ల బోరింగ్‌గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మొదటి 15 నిమిషాలు చాలా స్లోగా అనిపిస్తుంది. అలాగే ఫస్ట్ హాఫ్‌లో వచ్చే కొన్ని సీన్స్ ఏదో పెట్టాలి కాబట్టి పెట్టినట్టుగా అనిపిస్తాయి. మన నేటివిటీకి తగ్గట్టు ఇంకాస్త కొన్ని మార్పులు చేసి ఉంటే బాగుండేది. అలాగే మలయాళం సినిమా చూసిన వారికి ఈ సినిమా పెద్దగా నచ్చదు. దానికి ప్రధాన కారణం డైలాగ్స్‌తో సహా సీన్ టు సీన్ అలానే ఉండటం. ఆ సినిమాలోని లోకేషన్స్‌నే ఇందులో ఉపయోగించడం వలన మాలయాళ వెర్షన్ చూసిన వారికి పెద్దగా కనెక్ట్ కాకపోవచ్చు.
 
ఇది మలయాళ సినిమాకి రీమేక్ అయినా సినిమా ఉన్న కంటెంట్ యూనివర్సల్ కాన్సెప్ట్ కావున తెలుగు ఆడియన్స్‌కి కూడా బాగా కనెక్ట్ అవుతుంది. తెలుగు ఆడియన్స్ మునుపెన్నడూ చూడని విధంగా ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లో ఉండే కొన్ని థ్రిల్లింగ్ మూమెంట్స్, ఎమోషనల్ సీన్స్, నటీనటుల పెర్ఫార్మన్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్స్ అయితే అలాగే రొటీన్‌కి విభిన్నంగా కోరుకునే వారికి కావాల్సిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, అలాగే ఆసక్తికరంగా సాగే సినిమా చూడాలనుకునే వారిలో ఉత్కంఠతని కలిగించే అంశాలు ఈ సినిమాలో ఉండడం వలన ముందుగా బీ.సీ సెంట‌ర్ల‌కు బాగా ఎక్కుతుంది. ఎ సెంట‌ర్‌కు ఫర్వాలేద‌నిపిస్తుంది. రేపు రిలీజ్ అయ్యాక ఎంత రేంజ్ చూడాలి.