శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By ivr
Last Modified: శుక్రవారం, 2 జూన్ 2017 (19:14 IST)

చూపులతో కొలతలేసే 'ఫ్యాషన్‌ డిజైనర్‌' ఫూల్... రివ్యూ రిపోర్ట్

రాజేంద్రప్రసాద్‌, వంశీ కాంబినేషన్‌లో 32 ఏళ్ళనాడు వచ్చిన 'లేడీస్‌ టైలర్‌'కు సీక్వెల్‌గా అదే దర్శకుడు 'ఫ్యాషన్‌ డిజైనర్‌ సన్నాఫ్‌ లేడీస్‌ టైలర్‌' పేరుతో తెరకెక్కించాడు. అప్పటి తరానికి నచ్చిన ఆ చిత్రాన్ని మరో కోణంలో తీస్తున్నాడనగానే ఆసక్తి వున్నా.. వంశీ

ఫ్యాషన్ డిజైనర్ నటీనటులు: సుమంత్‌ అశ్విన్‌, అనిషా ఆంబ్రోస్‌, మనాలి, మానస, కృష్ణభగవాన్‌, కృష్ణుడు తదితరులు,
సంగీతం: మణిశర్మ, నిర్మాత: శ్రీధర్‌రెడ్డి, దర్శకత్వం: వంశీ.
 
రాజేంద్రప్రసాద్‌, వంశీ కాంబినేషన్‌లో 32 ఏళ్ళనాడు వచ్చిన 'లేడీస్‌ టైలర్‌'కు సీక్వెల్‌గా అదే దర్శకుడు 'ఫ్యాషన్‌ డిజైనర్‌ సన్నాఫ్‌ లేడీస్‌ టైలర్‌' పేరుతో తెరకెక్కించాడు. అప్పటి తరానికి నచ్చిన ఆ చిత్రాన్ని మరో కోణంలో తీస్తున్నాడనగానే ఆసక్తి వున్నా.. వంశీ పేరు వినగానే.. ప్లాప్‌ అయిన 'దొంగరాముడు అండ్‌ పార్టీ' నుంచి 'వెన్నెల్లో హాయ్‌ హాయ్‌' వరకు అపజయం పాలయిన ఆరు సినిమాలు గుర్తుకువస్తాయి. ఒకప్పుడు సితార, మంచుపల్లకి, మహర్షి, అన్వేషణ, సరదాగా కాసేపు, ఏప్రిల్‌ 1 విడుదల', లేడేస్‌ టైలర్‌' వంటి కోనసీమ అందాలతో చక్కటి సంగీతంతో ప్రేక్షకుల్ని అలరించిన ఆయన ఇప్పటి తరానికి తగినట్లు మారాడా... లేదా... అనే సందేహం చాలామందిలో నెలకొంది. అయినా ఆయనతో సినిమా తీయాలని పట్టుబట్టి నిర్మాత ఈ సినిమా తీశాడు. అదెలా వుందో చూద్దాం.
 
కథ :
కోనసీమలోని ఓ గ్రామంలో గోపాలం (సుమంత్‌ అశ్విన్‌) తన తండ్రి నుంచి అబ్బిన లేడీస్‌ టైలర్‌ వృత్తి కొనసాగిస్తాడు. ఇప్పటి ట్రెండ్‌ను బట్టి 'ఫ్యాషన్‌ డిజైనర్‌'గా పిలిపించుకుంటాడు. టేపుతో కొలతలు కొలవకుండా చూపుల్తోనే కొలతలు వేసి సరిగ్గా సరిపోయేట్లు కుట్టడం అతని ప్రత్యేకత. ఇక్కడ ఎంత పేరుంటే ఏం వుపయోగం.. పట్టణంలో కొట్టు పెట్టి 'ఫ్యాషన్‌ డిజైనర్‌' అవ్వాలన్నదే అతని కోరిక. కానీ ఆర్థికంగా లేకపోవడంతో ఏదో చేయాలని ఆలోచించిన గోపాలంకు ఓ జ్యోతిష్యుడు చేయి చూసి కోట్లమందిలో ఒక్కరికి వుండే మన్మథ రేఖ నీకు వుందని.. ఏ అమ్మాయిని చూసినా ఇట్టే ఆకర్షితురాలవుతుందని చెబుతాడు. దాంతో ఊరిలో ఆస్తిపరురాలైన గోదెల రాణిని ప్రేమించేస్తాడు. ఆ తర్వాత ఆమెకంటే ఊరి పెద్ద గంగరాజు మేనకోడలు అబ్బులుని అలాగే ప్రేమిస్తాడు. ఇద్దరికంటే బాగా ఆస్తిపరులైన అమెరికా నుంచి వచ్చిన మహాలక్ష్మిని కూడా ప్రేమించేస్తాడు. చివరికి విషయం ముగ్గురికీ తెలిశాక ఏమయింది? అనేది మిగిలిన సినిమా.
 
విశ్లేషణ :
కథాపరంగా చూసుకుంటే దర్శకుడు వంశీ తాను తీసిన పాత సినిమాల్లోని పాయింట్‌నే దించేసి ఇప్పటి తరానికి చూపించే ప్రయత్నం చేశాడు. అదే ఊరు, అదే మనుషులు, అవే పాటల్ని చూపించి బోర్‌ కొట్టించేశాడు. రాజేంద్రప్రసాద్‌ చేసిన లేడీస్‌ టైలర్‌ను పోలిక చేసుకుంటారనే విషయాన్ని కూడా మర్చి సుమంత్‌ అశ్విన్‌ను పెట్టి తీయడం సాహసమే అని చెప్పాలి. కథ, కథనంలో ఎక్కడా నవ్యత వుండదు. సంభాషణలు సరేసరి. కోనసీమ యాసలో వున్నా దాన్ని పలికే విధానం ప్రధాన లోపం. 
 
కథకు తగిన నటీనటులు ఒక్కరూ లేకపోవడం విశేషం. సంగీతపరంగా, సాహిత్యపరంగా ఎక్కడా నూతనత్వం కన్పించకపోగా విసుగు పుడుతుంది. అప్పటికప్పుడు సన్నివేశాలు రాసుకుని చేసినట్లుగా కొన్ని సన్నివేశాలు కన్పించడం విడ్డూరం. లేడీస్‌ టైలర్‌లో సుందరం పాత్రకు జమ్మజచ్చ (పుట్టుమచ్చ) ఎవరికుంటే ఆమెనే పెండ్లి చేసుకోవాలనేది ఆయన ఎయిమ్‌. ఈ చిత్రంలో హీరోకే మన్మథరేఖ వుంటుంది. దానిద్వారా ఆస్తిపరురాలైన అమ్మాయిని ఇట్టే వలలో వేసుకోవాలని చూస్తాడు. 
 
ఈ పాయింట్‌ అయినా కరెక్ట్‌గా చెప్పాడంటే.. అదీ లేదు. చివర్లో.. అది మన్మథ రేఖ కాదు. చిన్నప్పుడు వాతపెడితే వచ్చిన మచ్చ అది అంటూ.. మేనమామ కృష్ణభగవాన్‌ కేరళ జ్యోతిష్యుడితో చెప్పడంతో శుభంకార్డు పడుతుంది. దాంతో చూసే ప్రేక్షకుడు ఫూల్‌ అయిపోతాడు.
 
ఇక, ముగ్గురిని ప్రేమలో పడేయడానికి హీరో పడిన పాట్లు ప్రేక్షకుడికి విసుగుపుట్టిస్తాయి. ఎక్కడా సహజత్వం కన్పించదు. అంతా కృతకంగా వుంటుంది. హీరోకు లిప్‌ సింకే కాదు. పక్కన పాత్రలు ఎంటర్‌టైన్‌ చేయాలని చూస్తాయి కానీ వినోదాన్ని పండించలేవు. అయితే నాయికల అందాల్ని కనువిందు చేయడంలో వంశీ సఫలం అయ్యాడనే చెప్పాలి. కానీ అదొక్కటే సినిమాను నిలబెట్టదు. 32 ఏళ్ళనాడు అలరించిన ప్రేక్షకులకు ఇప్పటి ప్రేక్షకులకు ఎంతో వ్యత్యాసముంది. వారికి తగినట్లు దర్శకుడు మారితేనే ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇక నటీనటులపరంగా, టెక్నికల్‌గా చెప్పుకోవడానికి పెద్దగా ఏమీలేదు.