శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By DV
Last Modified: శుక్రవారం, 11 సెప్టెంబరు 2015 (16:10 IST)

'హోరాహోరీ...' నా లడ్డూలా ఉంది... రివ్యూ రిపోర్ట్

హోరాహోరీ నటీనటులు:  దిలీప్‌, దక్ష, రాఘవ, షీనా, చెష్వా, వైజాగ్‌ ప్రసాద్‌, డి.ఎస్‌ రావు తదితరులు; సంగీతం: కళ్యాణి కోడూరి, నిర్మాత: దామోదర ప్రసాద్‌, కథ-కథనం-దర్శకత్వం: తేజ.
 
పాయింట్‌: ప్రేమించిన అమ్మాయి కోసం హీరో విలన్ల పోరాటం.
 
ప్రేమకథ చిత్రాలంటే చాలా జాగ్రత్తగా తీయాలి. అందులో అనుభవం వున్న తేజ... చిత్రం, నువ్వునేను, జయం వంటి చిత్రాలు తీసేసి.. అప్పటి యూత్‌ను బాగా ఆకట్టుకున్నాడు. మళ్ళీ కొంతకాలం గ్యాప్‌ ఇచ్చి.. ఈసారి కూడా అలాంటి లవ్‌ కథనే సెలక్ట్‌ చేసుకోవడం సాహసమే. ప్రేమకు చావులేదు. కథలకు తక్కువ లేదు. కానీ తీసే విధానంలోనే వున్నది తేడా. 80ల్లో లాగులు, బెల్‌బాటం ఫ్యాంటులు కుర్రాళ్లు ధరించేవారు. బెల్‌బాటం ఫ్యాంట్‌ను చూసుకుని మురిసిపోయేవారు. 
 
కానీ నేడు.. అలా కాదు. లాగులు, ఫ్యాంటులు కేవలం స్టైల్‌ కోసమే వేస్తున్నారు. అవి కూడా చిరిగిపోయినవి వేసుకుని ఇదే నేటి ఫ్యాషన్‌ అంటూ యువత తిరుగుతుంటే.. వారు ఆలోచించే ధోరణిలోనే మార్పు వచ్చింది. ఒక దర్శకుడుగా తేజ అలాంటి మార్పును గమనించినట్లులేదు. తన రూటే కరెక్ట్‌ అనే దానికి వచ్చేశాడు. అదెలాగో చూద్దాం.
 
కథ:
మైథిలి(దీక్ష) అన్నయ్య పోలీసు ఆఫీసర్‌. ఆమె పెళ్ళి కోసం మర్డర్‌ చేసిన గూండా పరమేష్ నుంచి 25 లక్షలు లంచం తీసుకుంటాడు. నేరుగా ఇవ్వడానికి ఇంటికి తెస్తాడు. అక్కడ ముస్తాబైన మైథిలిని చూసి ప్రేమించేస్తాడు. ఆమె తనకే దక్కాలని రెండుసార్లు పెండ్లి ప్రయత్నాలు చేస్తే ఇద్దరి పెండ్లి కొడుల్ని చంపిస్తాడు. దాంతో షాక్‌కు గురయిన మైథిలిని డాక్టర్లు సూచన మేరకు కొత్త ప్రాంతానికి తీసుకెళతారు. అది గ్రీనరీ బాగా వుండే కర్నాటకలోని అగుంబే అనే మారుమూల ప్రాంతం. అక్కడ చిన్న ప్రింటింగ్‌ ప్రెస్‌ పెట్టుకుని బామ్మను, అక్కను పోషిస్తున్న స్కంద(దిలిప్‌)కు పక్క ఊరిలోని ఓ వ్యక్తి పోటీ అవుతాడు. 
 
దాంతో వ్యాపారం దెబ్బతింటుంది. ఊరి పంచాయితీ ప్రకారం.. ఓ పోటీ పెడతారు. ఇరు వర్గాల్లో ఎవరు టైపింగ్‌ స్పీడ్‌గా చేయగలుగుతారో వారు గెలిచినట్లు. మిగతవారు ఆ వ్యాపారాన్ని విరమించుకోవాలి. అదే టైమ్‌లో మైథిలి వచ్చి టైపింగ్‌ నేర్చుకోవడం. పోటీగా దిగడం జరిగిపోతాయి. మూడు రౌండ్ల పోటీలో ఒక రౌండ్‌ మైథిలి గెలుస్తుంది. అప్పుడే స్కంద, మైథిలి మధ్య ప్రేమ మొలకెత్తుతుంది. అయితే ఆ ఊరికి ఓ మర్డర్‌ పనిమీద పరమేష్‌ వచ్చి, అనుకోకుండా మైథిలిని చూసి పెండ్లి చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటాడు. అప్పుడు మైథిలి అన్న ఊరుకుంటాడా? ఓ షరతు పెడతాడు. అది ఏమిటి? మరి స్కంద ఏమయ్యాడు? అనేది మిగిలిన సినిమా.
 
పెర్‌ఫార్మెన్స్‌
నటీనటుల పరంగా చెప్పుకోవాల్సింది పెద్దగా లేదు. ఆహా! ఓహో! అన్నంతలో ఎవ్వరూ నటించలేదు. చాలా పేలవంగా నటన వుంది. దిలీప్‌, దీక్షలు నటిస్తుంటే... చూసేవారికి అదో రకమైన సరదాగా వుంటుంది. విలన్‌గా చెష్వా పర్వాలేదు. రాకెట్‌ రాఘవ హాస్యం దర్శకుడు శ్రుతిమించినట్లుగా చేయించాడు. కానీ ఎక్కడా పెద్దగా నవ్వురాదు. మైథిలి అన్నగా నటించిన నటుడు కళ్యాణ్‌ రామ్‌లా అనిపిస్తాడు. కన్నడకు చెందిన నటీనటులు కూడా ఇందులో వుండటం విశేషం.
 
సాంకేతికంగా..
సినిమాకు కీలకం బ్యాక్‌గ్రౌండ్‌. ఆ విషయంలో కళ్యాణి కోడూరి బాగా చేశాడు. కథకు అనుగుణంగా మూడ్‌ను కల్గించాడు. సందర్భానుసారంగా వచ్చే మాటల్లాంటి పాటలకు తగిన విధంగా ట్యూన్స్‌ ఇచ్చేశాడు. కెమెరాకు పెద్ద పని. ఎందుకంటే.. సినిమా సగానికి పైగా వర్షంలోనే సాగుతుంది. అందుకోసం కెమెరా తడవకుండా.. తగు జాగ్రత్తలు తీసుకోవడం, ఆర్టిస్టులను ఒకటిరెండు సార్లు తడిపి నటింపచేయడం జరిగింది. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌కు పెద్దగా పనిలేదు. అలాగే కాస్ట్యూమ్స్‌ కూడా సాదాసీదా డ్రెస్‌లే. 159 నిమిషాల నిడివిని ఎలా ఎడిటింగ్‌ చేయాలన్నా.. దర్శకుడు దృష్టిలో కష్టమే. అందుకు ఎడిటర్‌కు ఒక రకంగా పరీక్షే. ఇక మిగిలిన డిపార్ట్‌మెంట్లన్నీ పరిధి మేరకు చేసేశాయి.
 
విశ్లేషణ
ఈ కథకు తగిన టైటిల్‌ అని దర్శకుడు చెబుతూనే వున్నాడు. అసలు హోరాహోరీ అంటే.. రామాయణంలో రాముడుకు, రావణాసురుడుకు, పాండవులకు కౌరవులకు జరిగింది అనేవాడు. కానీ అంత పెద్ద మాటలు ఈ చిత్ర కథకు అతకలేదు. హీరో విలన్ల మధ్య పోరు టైటిట్‌ అని చెబితే.. అంత బిల్డప్ అక్కడ లేదు. చాలా పేలవంగా వుంది. జయం నుంచి వస్తున్న కాన్సెప్ట్‌.. విలన్‌, హీరో ఫైట్‌.. అడవిలో జరగాలి. ఈ సినిమా కూడా అలాగే చేశాడు. సెంటిమెంట్‌గా జెండాపై కపిరాజు.. ఆంజనేయస్వామి జెండాను ఓ షాట్‌లో చూపిస్తాడు. ఇవన్నీ సినిమా విజయానికి అనుకూలిస్తాయనుకుంటే భ్రమే.
 
తను చెప్పాలనుకున్న పాయింట్‌ను ప్రేక్షకులకు ఆకర్షణీయంగా చెప్పడంలో తేజ విఫలమయ్యాడు. చాలామంది దర్శకులు తాము అప్‌డేట్‌ అయ్యామని మీడియా ముందు చెప్పుకుంటుంటారు. కానీ తేజ అప్‌డేట్‌ కాలేదు. పాత తరహాలో సినిమా తీసి హిట్‌ కొట్టాలనుకున్నాడు. అది సాధ్యపడలేదు. కథలో ఎక్కడా ఆకట్టుకునే పాయింట్‌కానీ, డైలాగ్‌ కానీ, కామెడీకానీ, సెంటిమెంట్‌కానీ పండలేదు. అంతా కృతకంగా వున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. అందరూ కొత్తవారే. వారికి బలవంతంగా ట్రైనింగ్‌ ఇచ్చి చేయించినట్లుంటుంది. హీరోయిన్‌ ఏడుస్తుందో నవ్వుతుందో అర్థం కాకుండా సీన్స్‌ వుంటాయి. 
 
హీరో అయితే సరేసరి. పైగా విలన్‌ను రావణాసురిడితో పోలవడం తప్పే. ఎందుకంటే ఇందులో విలన్‌ ప్రేమలో నిజాయితీ వుంది. క్రూరంగా అందరినీ చంపేవాడు. మైథిలి విషయంలో మారిపోతాడు. మరి అతను విలన్‌ ఎలా అవుతాడు. పతాక సన్నివేశంలో ఇతనే హీరో అనేలా వుంటుంది. ఒక హీరో డమ్మీ కాకూడదు కాబట్టి బలవంతంగా చావుబతుకుల మధ్య వున్న హీరోను.... యూత్‌.. అసలు పవర్‌ ఏమిటో ఇప్పుడు చూపిస్తాడని .. కామెడీ రాఘవ చెప్పిన డైలాగ్‌కూ... తేజ గొప్పగా ఇచ్చి బ్యాక్‌గ్రౌండ్‌.. హోరాహోరీ అంటే ఏమిటో తెలియజెప్పే సాంగ్‌తో లేచిపోతాడు... తనను చంపమని విలన్‌ను అడుతుతాడు. అలా ఇద్దరూ పోరాడుకుని చివరికి విలన్‌ చనిపోతాడు.
 
ఇలా కాన్సెప్ట్‌లు తెలుగులో కొత్తేమీకాదు. తీసేవారు కొత్తకాదు. చూసేవారు కొత్తగా వుంటారని భ్రమించిన తేజకు ఈ చిత్రం భంగపాటే. తాను చేసిందే.. కరెక్ట్‌ అనుకోవడం అన్నివిధాలా సరైంది కాదని ఈపాటికైనా తెలిసి వస్తే తేజ ముందుముందు అప్‌డేట్‌గా సినిమా తీయగలడని ఆశిద్దాం. చివర్లో ఓ మాట... రాకెట్‌ రాఘవ ఊతపదం.. నా లడ్డూలా వుంది.. అంటాడు... అది నెగెటివ్‌కు బాగా వుపయోగపడుతుంది. ఈ సినిమా కూడా కరెక్ట్‌గా సరిపోతుంది.
 
రేటింగ్‌: 1.5/5