శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By DV
Last Updated : శుక్రవారం, 29 జులై 2016 (16:19 IST)

'జక్కన్న' ఆత్మ బయటకొస్తుంది... యాక్షనా...? కాదు ఓవరాక్షన్... రివ్యూ

హాస్య నటుడి నుంచి హీరోగా మారిన సునీల్‌.. సరైన సక్సెస్‌ కోసం ఎదురుచూస్తున్నాడు. మర్యాదరామన్న.. తర్వాత అంత గుర్తింపు వచ్చిన చిత్రం రాలేదు. 'పూలరంగడు' కాస్త ఊరట ఇచ్చిన తర్వాత వచ్చిన కృష్ణాష్టమి డిజాస్టర్

జక్కన్న సినిమా నటీనటులు : సునీల్‌, మన్నార్‌ చోప్రా, నాగినీడు, ప్రద్యుమ్న సింగ్‌, రఘు, పోసాని కృష్ణమురళి, జీవా, ఆశిష్‌ విద్యార్థి, చిత్రం శ్రీను తదితరులు. సాంకేతిక వర్గం... సంగీతం: దినేష్‌ కనకరత్నం, సాహిత్యం: శ్రీమణి, కాసర్ల శ్యామ్‌, బేనర్‌: ఆర్‌పిఎ క్రియేషన్స్‌, నిర్మాత: సుదర్శన్‌ రెడ్డి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వంశీకృష్ణ.
 
హాస్య నటుడి నుంచి హీరోగా మారిన సునీల్‌.. సరైన సక్సెస్‌ కోసం ఎదురుచూస్తున్నాడు. మర్యాదరామన్న.. తర్వాత అంత గుర్తింపు వచ్చిన చిత్రం రాలేదు. 'పూలరంగడు' కాస్త ఊరట ఇచ్చిన తర్వాత వచ్చిన కృష్ణాష్టమి డిజాస్టర్‌ అయింది. దీంతో ఎలాగైనా సక్సెస్‌ కొట్టాలనే తన ఫార్మెట్‌లోకి వెళ్ళి సినిమా చేశాడు. ఎంత హీరో అయినా సునీల్‌ నుంచి కామెడీ ఆశిస్తారు. అది కొన్ని చిత్రాల్లో లోపించింది. ఈసారి మాత్రం అది మిస్‌ కానని చెప్పిన సునీల్‌.. 'రక్ష' దర్శకుడు వంశీకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని 'ప్రేమకథా చిత్రమ్‌' నిర్మాత సుదర్శన్‌ రెడ్డి నిర్మించారు. శుక్రవారం నాడు విడుదలైన ఈ చిత్రం ఎలా వుందో చూద్దాం.
 
కథ : చిన్న సాయం చేసినా తిరిగి ఎంతోకొంత సాయం చేయడమే మానవత్వం.. అనేది చిన్నతనంలోనే మాస్టారు చెప్పిన మాటను బుర్రకెక్కించుకుంటాడు గణేష్‌ (సునీల్‌). తనకు గాయమైతే క్లాస్‌మేట్‌ చిత్రం శ్రీను కట్టుకట్డాడన్న కృతజ్ఞతతో.. సాయం పేరుతో ఇష్టమైన ఐస్‌క్రీమ్‌ల్ని అతిగా స్నేహితుడికిచ్చి ఆసుపత్రిపాలు చేస్తాడు. అంటే.. చచ్చేంత ప్రేమ ఒలకపోస్తాడన్నమాట. మరి పెద్దయ్యాక ఆ సాయం చేయాలనే కోరిక ఇంకా పెరుగుతుంది. విశాఖలో కింగ్‌గా వెలిగే రౌడీ బైరాగి కోసం వెతుక్కుంటూ గణేష్‌ వస్తాడు. తనెలా వుంటాడో తెలీకుండా ఊరిని ఏలేస్తుంటాడు బైరాగి.

అలాంటివాడిని పబ్లిక్‌ చేసి.. పోలీసులకు దొరికేలా చేస్తాడు గణేష్‌. కానీ.. ఇంకోవైపు.. అతన్ని అరెస్ట్‌ చేయనీయకుండా.. మరలా ఎదో ఎత్తువేసి బైరాగిని కాపాడుతుంటాడు. ఇలా ఎందుకు చేస్తున్నాడంటే... ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్ళాల్సిందే. చిన్నతనంలో ఓ రౌడీ నుంచి తన ప్రాణాన్ని కాపాడాడన్న కృతజ్ఞతతో గణేష్‌.. బైరాగిని రక్షిస్తుంటాడు. మరి.. తనను పబ్లిక్‌ చేసిన బైరాగి... గణేష్‌పై కక్ష పెట్టుకుని ఎటాక్‌ చేస్తాడు. ఆ తర్వాత ఏమయింది? మరి మన్నార్‌ చోప్రా పాత్ర ఏమిటి? అనేది మిగిలిన సినిమా.
పెర్‌ఫార్మెన్స్‌ : సునీల్‌ నటన గురించి కొత్తగా చెప్పేదేముంది. హాస్య నటుడిగా పంచ్‌డైలాగ్‌తో పడేసేవాడు. హీరో అయినా ప్రేక్షకులు తన నుంచి ఆశిస్తున్నారని అవే ఫాలో అయ్యాడు. డాన్స్‌ బాగా చేశాడు. ఎంటర్‌టైన్‌ చేసే హీరోగా చేశాడు. ఇక హీరోయిన్‌గా మన్నార్‌ చోప్రా పెద్దగా చేసింది లేదు. నటనలో ఓనమాలు కూడా తెలీవు. కమేడియన్‌ సప్తగిరి.. మార్షల్‌ఆర్ట్స్‌ గురువుగా ఎంటర్‌టైన్‌ చేశాడు. జబర్‌దస్త్‌ బ్యాచ్‌ ఇద్దరు తమ పరిధిలో కామెడీని పండిచే ప్రయత్నం చేశారు. 30 ఇయర్స్‌ ఇండస్ట్రీ పృథ్వీ.. ఎస్‌ఐ కటకటాల కట్టయ్యగా అలరించాడు. పంచ్‌ డైలాగ్‌లతో ప్రాసలతో బాలయ్యను ఇమిటేట్‌ చేస్తూ ఎంటర్‌టైన్‌ చేశాడు. పోసాని.. కోయదొరగా నటించాడు. గణేష్‌ తండ్రిగా నాగినీడు, బైరాగి తండ్రిగా రాజారవీంద్ర నటించారు.
 
టెక్నికల్‌గా...
సంగీతపరంగా దినేష్‌ ఫర్వాలేదు. ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. సాహిత్యం కూడా ప్రాస కలిపాడు. మాస్‌ ప్రేక్షకుల్ని అలరించేట్లుగా వుంది. వంశీకృష్ణ.. ఎక్కువగా పంచ్‌ డైలాగ్‌లతో సినిమాను లాగించేశాడు. అవికూడా మాస్‌ను ఇంప్రెస్‌ చేసే విధంగా వున్నాయి. 'ఏసేయ్‌మంటారా!' అంటే.. ఏసి ఏయమంటారా! అన్న చందంగా అన్ని డైలాగ్‌లు వుంటాయి. యాక్షన్‌ పార్ట్‌ కాస్త ఎక్కువైంది. అందులో గ్రాఫిక్స్‌ కూడా వున్నాయి. 
 
విశ్లేషణ : 
దెయ్యం తరహా కాన్సెప్ట్‌తో 'రక్ష' చిత్రాన్ని తీసిన వంశీకృష్ణ.. సునీల్‌ను దృష్టిలో పెట్టుకుని రాసిన కథే ఇది. టైటిల్‌లో జక్కన్న పేరు పెట్టినా.. అది రాజమౌళిని పిలిచే పిలుపు కాదనీ... సినిమాలో నిక్‌నేమ్‌ జక్కన్న అని సునీల్‌ చెబుతూనే వున్నాడు. కానీ ఆయన కోసమే పెట్టినట్లు స్పష్టంగా కన్పిస్తుంది. రాజమౌళి ఫొటోను కూడా ఇందులో సందర్భానుసారంగా వాడాడు. ఇక కథలో కొత్తదనం ఏమీలేదు. రొటీన్‌ మాస్‌ ఫార్ములా. ఆమధ్య వచ్చిన రెడీ, ఢీ... వంటి ఫార్మెట్‌లను మరికొన్ని సినిమాల్లోని సీన్లను కలగలిపి రాసుకున్న కథ ఇది. విలన్‌ను హీరో బకరా చేసి ఆడించడం.. ఆయా సినిమాల్లో చూపించారు.

ఇందులో విలన్‌ను బకరా చేసినా.. అది ఆయన బాగు కోసమే అన్నది కొత్త కాన్సెప్ట్‌. చిన్నతనంలో తన ప్రాణాన్ని కాపాడిన బైరాగిని వెతుక్కుంటూ వచ్చి.. అతన్ని హీరోగా చేయడమే సునీల్‌ కాన్సెప్ట్‌. రౌడీని ఏకంగా పోలీసునే చేసేస్తాడు. అది కూడా రవితేజ 'వెంకీ' ఫార్ములానే తీసుకున్నాడు. ఆపద సమయంలో అనుకోకుండా రవితేజ పోలీసు అయినట్లే.. ఇందులో బైరాగి పోలీసు అవుతాడు. దానికి స్క్రీన్‌ ప్లే హీరో చేస్తాడు. అయితే.. చేసే విధానం అంతా మ్యాజిక్‌గా వుంటుంది. అందుకే లాజిక్కులు వెతికితే అన్నీ తప్పులే కన్పిస్తాయి. 
 
కామన్‌ ప్రేక్షకుడ్ని ఎలాగోలా ఎంటర్‌టైన్‌ చేయడమే దర్శకుడి, హీరో గోల్‌. అందుకే అప్పటికిప్పుడు ఏవేవో సీన్లు రాసుకుని.. దానికి అనుగుణంగా పంచ్‌ డైలాగ్‌లు పెట్టేసి.. మాస్‌ను బాగా ఆకట్టుకుంటుందనే నమ్మకానికి వచ్చేశారు. హీరోయిన్‌గా చేసిన మన్నార్‌ చోప్రాకు సినిమాలు కష్టమే. ఫొటోజెనిక్‌ ఫేస్‌ కాకపోవడంతో పాటు హావభావాలు పెద్దగా కన్పించలేకపోయింది. సరదాగా మాట్లాడుకునే మాటల్ని పంచ్‌డైలాగ్‌గా మలచడం.. పతాక సన్నివేశంలో.. విలన్‌ హీరోను పొడిచినా.. మరలా లేవడం.... విలన్‌ను కాపాడం.. విలన్‌ పరివర్తన చెందడం.. అనేవి పరమ రొటీన్‌ ఫార్ములా. అయినా ఇవి మాస్‌ను బాగా అలరిస్తుందని చిత్ర టీమ్‌ నమ్ముతోంది. వారు నమ్మినట్లు జరిగితే సినిమా ఆడుతుంది. లేదంటే.. సునీల్‌ పేజీలో మరో సినిమాగా మిగులుతుంది. చివరల్లో ఓ సీన్‌లో.. హీరో ఆత్మ బయటకు వస్తుంది...ఇదేంటీ డబుల్‌ యాక్షనా! అంటూ సునీల్‌ అంటాడు. కాదు ఓవర్‌ యాక్షన్‌ అంటూ ఆత్మ చెబుతుంది.. ఇది చిత్రానికి యాప్ట్‌గా అనిపిస్తుంది.
 
రేటింగ్‌: 2.5/5