శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By dv
Last Updated : గురువారం, 1 సెప్టెంబరు 2016 (14:02 IST)

పక్కా... కథ పాతదే... జయహో జనతా... రివ్యూ రిపోర్ట్

ఎన్‌టిఆర్‌ విజయం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో కొరటాల శివ రాసుకువచ్చిన కథ "జనతా గ్యారేజ్"‌. రెండేళ్ళనాడే ఈ కథను అనుకున్నా.. ఇప్పటికి వర్కౌట్‌ అయిందని చెప్పారు.

నటీనటులు : ఎన్టీఆర్‌, మోహన్‌‌లాల్‌, నిత్యా మీనన్‌, సమంత, రుతుప్రభు, ఉన్ని ముకుందన్‌, సురేష్‌, సాయికుమార్‌, బెనర్జీ, అజయ్‌ తదితరులు
 
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్‌, కెమెరా: తిరు, ఎడిటర్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, నిర్మాత: నవీన్‌ ఎర్నేని, వై.రవి శంకర్‌, మోహన్‌, కథ, కథనం, దర్శకత్వం: కొరటాల శివ.
 
ఎన్‌టిఆర్‌ విజయం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో కొరటాల శివ రాసుకువచ్చిన కథ "జనతా గ్యారేజ్"‌. రెండేళ్ళనాడే ఈ కథను అనుకున్నా.. ఇప్పటికి వర్కౌట్‌ అయిందని చెప్పారు. 'మిర్చి' సినిమాతో కొరటాల శివ.. సీరియస్‌ ఎమోషన్స్‌, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను బాగా పండించాడనే పేరుతో మరలా అటువంటి ప్రయోగం చేశానని చెప్పాడు. వీరితోపాటు ఇద్దరు హీరోయిన్లు, మోహన్‌లాల్‌ అనే మలయాళ నటుడు ఉండడంతో సినిమాపై క్రేజ్‌ పెరిగింది. మరి ఆ క్రేజ్‌ ఎలా ఉందో చూద్దాం. 
 
కథ :
సత్యం (మోహన్‌ లాల్‌) ఓ గ్రామంలో వెహికల్‌ మెకానిక్‌. తన సోదరుడు ఆనంద్‌తో కలిసి హైదరాబాద్‌ వచ్చి ఇక్కడే పెద్ద గ్యారేజ్‌ స్థాయికి పెంచేలా చేసి ‘జనతా గ్యారేజ్‌’ అనే పేరు పెట్టేస్తాడు. పనికోసం వచ్చిన అజయ్‌, బెనర్జీ, బ్రహ్మాజీ కూడా ఆయన ఆలోచనకు కనెక్ట్‌ అవుతారు. వాహనా రిపేర్లతోపాటు సమాజానికి చెడుచేస్తున్న మనుషుల్ని కూడా రిపేరు చేస్తుంటాడు. ఆ క్రమంలో పెద్ద పారిశ్రామికవేత్త ముఖేష్‌ (సచిన్‌ ఖేడ్కర్‌) కొడుకును చంపేస్తాడు.

ప్రతిగా సత్యం తన సోదరుడి కుటుంబాన్ని పోగొట్టుకుంటాడు. ఈ గొడవలకు దూరంగా బతకమని చిన్నపిల్లాడిని వారి మామయ్య సురేష్‌కు ఇచ్చి ముంబై పంపించేస్తాడు సత్యం. ఆ పిల్లాడే ఆనంద్‌ (ఎన్టీఆర్‌). చిన్నప్పట్నుంచీ ప్రకృతిని ప్రేమించే ఆనంద్‌.. ఎన్విరాన్‌మెంట్ సైన్స్‌ విద్యార్థి. ప్రాజెక్ట్‌లో భాగంగా హైదరాబాద్‌ వస్తాడు. అనుకోకుండా జరిగిన ఓ సంఘటనతో జనతా గ్యారెజ్‌ బాధ్యత చూడాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? సత్యం ఎవరో ఆనంద్‌కు తెలిసిందా? అనేది మిగిలిన కథ. 
 
పెర్ఫార్మెన్స్‌
ఎన్టీఆర్‌ నటించడానికి అవకాశం ఉన్న కథ. తను ఈజీగా హావభావాలు చూపించేశాడు. మోహన్‌లాల్‌ గొప్ప నటుడు. ఇందులో తనేంటో చూపించడానికి అవకాశం పెద్దగా లేదు. ఎక్కువగా క్లోజ్‌షాట్స్‌, కళ్లు అటూ ఇటూ తిప్పడం... సీరియస్‌గా చూడటంతోనే పాత్రను లాగించేశాడు. హుందాగా పాత్రను మలిచాడు దర్శకుడు. ఇక ముఖేష్‌గా మరాఠీ నటుడు సచిన్‌ ఖేడ్కర్‌ నటించాడు. తను తెలుగువారికి కొత్త. బిజినెస్‌ మ్యాన్‌గా పాలిష్‌ విలన్‌గా నటించాడు. సమంత, నిత్యమీనన్‌ల పాత్ర ఓకే అనిపిస్తాయి. నిత్యకు పెద్దగా నటించే ఛాన్స్‌లేదు. మిగిలిన పాత్రలు డిటో. 
 
సాంకేతిక విభాగం :
తిరు సినిమాటోగ్రఫీ ఓకే. లైటింగ్‌, ఫ్రేమింగ్‌, షాట్‌ మేకింగ్‌ అన్నీ పద్ధతిగా ఉండి సినిమాకు అందాన్ని తెచ్చిపెట్టాయి. సంభాషణు పంచ్‌లేకుండా సన్నివేశపరంగా రాసేశారు. దేవీశ్రీ ప్రసాద్‌ బాణీతోపాటు బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ బాగానే ఇచ్చాడు. సాహిత్యపరంగా ‘ప్రకృతికి వందనం..’ బాగుంది. విజువల్‌ ఎఫెక్ట్స్‌ సాదాసీదాగా ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రొడక్షన్‌ వాయిస్ చాలా బాగున్నాయి. అయితే ఎడిటింగ్‌ విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సివుంది. కొన్ని సన్నివేశాలు కట్టెకొట్టెతెచ్చే అన్నట్లుగా చూపించాడు. లోతుగా ఆలోచిస్తేగానీ ఈ సీన్‌కు ఇది అర్థం అయ్యేలా లేదు.
 
విశ్లేషణ
ఈ సినిమా కేవం రెండు క్యారెక్టర్లు. ఒకటి.. ప్రకృతిని ప్రేమించేవాడు. రెండోవాడు.. మనుషుల్ని ప్రేమించేవాడు.. అని దర్శకుడు మొదటి నుంచి చెబుతూనే ఉన్నాడు. తగినట్లుగానే పాత్రలు ఉన్నాయి. అయితే.. ప్రకృతిని ప్రేమించేవాడు దాన్ని నాశనం చేసేవారిని అంతే ఇదిగా నాశనం చేస్తాడు. ఒకరకంగా రక్తపాతం సృష్టిస్తాడు. ఒక్కసారిగా పాత్రను పెంచుతూ.. మరోసారి దించేసిదిగా ఉంది హీరోపాత్ర. కథాపరంగా చెప్పాలంటే.. కొత్త కథేమికాదు. బ్యాక్‌డ్రాప్‌ మారిందంతే. రెండు పాత్రలను పెట్టుకొని వాటి చుట్టూ అల్లిన కమర్షియల్‌ కథ. చాలా పాతది, ఇప్పటికే బోర్‌ కొట్టినది కావడం అతిపెద్ద మైనస్‌. ఇక ఫస్టాఫ్‌లో అసలు కథ పరిచయం కాకపోవడం, సెకండాఫ్‌లో మొదటి ఇరవై నిమిషాల తర్వాత సినిమాలో కథే లేకపోవడం కూడా నిరాశపరిచింది. ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్‌కి వచ్చేసరికి సినిమా తేలిపోయింది.
 
పాటపరంగా ‘జయహో జనతా..’ అంటూ ఈ సమయంలోనే వచ్చే మాంటేజ్‌ సాంగ్‌ చాలా బాగుంది. ఇక ‘పక్కాలోకల్‌’ అంటూ స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ చేసిన ఐటమ్‌ సాంగ్‌ మరెవరైనా చేసినా బాగుండేది. హీరోయిన్‌గా చేసిన అమ్మాయి.. అదే హీరోతో ఐటంగాళ్‌గా చేయడం కాస్త మెట్టు దిగినట్లే. కాగా,   సమంత, నిత్యా మీనన్‌కన్నా.. హీరోతో సరైన లవ్‌ట్రాక్‌ లేకపోవడం చిత్రానికి మరో లోపం. తన గత రెండు సినిమాల్లోనూ ఒక బమైన అంశానికి తోడు సినిమాకు అలవాటైన ఫార్మెట్‌లో చెప్పి సక్సెస్‌ కొట్టిన కొరటాల శివ, ఈసారి పూర్తిగా కమర్షియల్‌ పంథాని మాత్రమే నమ్ముకొని చేసిన సినిమా ‘జనతా గ్యారెజ్‌’.

ఒక మంచి కమర్షియల్‌ సినిమాకు కావాల్సిన రెండు బమైన పాత్రలను ఎంచుకున్న ఆయన, వాటిచుట్టూ పూర్తి స్థాయిలో కట్టిపడేసే కథ, కథనాన్ని రాసుకోవడంలో విఫలమయ్యాడని చెప్పొచ్చు. కథ ప్రారంభంలో 1980 దశకం అని చెబుతాడు. ఒకప్పుడు ఎన్‌టిఆర్‌, మోహన్‌బాబు తండ్రీ కొడుకులుగా నటించిన 'కొండవీటి సింహం' ఛాయలు ఇందులో కన్పిస్తాయి. చెడువైపు పయనించే కొడుకునే శిక్షించే తండ్రి కథ అది. ఇదీ అంతే. కాకపోతే.. బ్యాక్‌డ్రాప్‌, నటీనటులు మారారు. మంచి పాయింట్‌ అయినా ఈ కథను ఇంకా ఎఫెక్ట్‌గా చెప్పవచ్చు. టోటల్‌గా చూస్తే తీసేసే సినిమా కాదు. చూడతగ్గదే. ఏవరేజ్‌ సినిమా.
 
రేటింగ్‌:.. 3/5