శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By dv
Last Updated : శుక్రవారం, 20 నవంబరు 2015 (09:50 IST)

సరదాగా ఓ క్రైమ్‌ సినిమా చూశామన్న ఫీల్‌ కలిగించే చిత్రం... కమల్ హాసన్ 'చీకటి రాజ్యం'

నటీనటులు: కమల్‌ హాసన్‌, త్రిష, మధుశాలిని, ప్రకాష్‌రాజ్‌ తదితరులు
సంగీతం: జిబ్రాన్‌, నిర్మాత: కమల్‌హాసన్‌, దర్శకత్వం: రాజేష్‌ ఎం. సెల్వ.
విడుదల: 20.11.2015. శుక్రవారం.
 
కమల్‌ హాసన్‌ చిత్రాలంటే ఏదో భిన్నమైన నటన, గెటప్‌లు, కొత్త కథనం ఉంటాయి. ఎప్పుడో 'ఈనాడు' సినిమా తర్వాత తెలుగులో స్ట్రెయిట్‌ సినిమా తను చేయలేదు. తమిళ చిత్రాలే తెలుగులో అనువాదమవుతూ వచ్చాయి. అలాగే ఇదీనూ. కానీ ఏకకాలంలో తీయడంతో స్ట్రెయిట్‌ చిత్రంగా ముద్ర వేశారు. తన దగ్గర పనిచేస్తున్న సెల్వనే దర్శకుడిగా పరిచయం చేస్తూ తీసిన చిత్రమిది. తమిళంలో 'తూంగావనం'.. దీపావళికి విడుదలైంది. పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. అయితే తెలుగులో మాత్రం శుక్రవారం విడుదల చేశారు. కాగా, ఇది 'స్లీప్‌లెస్‌ నైట్‌' అనే ఫ్రెంచ్‌ చిత్రానికి రీమేక్‌.. ఒక రోజులో జరిగే కథ. అదేమిటో చూద్దాం.
 
కథ: 
నార్కోటిక్‌ అండర్‌ కవర్‌ పోలీసు ఆఫీసర్‌ కమల్‌ హాసన్‌. అతని స్నేహితుడు పాణి. ఇద్దరూ ఓ అర్థరాత్రి వరకు ఓ కారు కోసం కాపుకాస్తారు. తెల్లారగానే హైవేలో ఓ కారురాగానే ఎటాక్‌ చేస్తారు. గొడవల్లో ముఠాలోని ఒకడు చనిపోతాడు. కారులో బ్యాగ్‌లో ఉన్న మాదకద్రవ్యాల్ని చేజిక్కుకుంటారు. ఆ బ్యాగ్‌లో కోట్లు విలువచేసే డ్రగ్‌ ఉంటుంది. అందులో మూడు ప్యాకెట్లు అమ్ముకుని తన అప్పులు తీర్చుకోవాలనుకుంటాడు పాణి. అదే టైంలో చీకటి వ్యాపారాలు చేసి పైకొచ్చి నైట్‌క్లబ్‌ నడుపుతున్న ప్రకాష్‌ రాజ్‌ నుంచి ఫోన్‌ వస్తుంది. నీ కొడుకు కావాలంటే ఆ డ్రగ్ బ్యాగ్ ఇచ్చేయమని కోరగా, దీన్ని పాణికి చెప్పడం.. అతను వద్దనడం.. గొడవపడడం జరిగిపోతుంది. ఈ డ్రగ్ బ్యాగ్ తీసుకుని నైట్‌క్లబ్‌కు వెళ్ళిన సమయంలో ఈ కేసును పరిశోధించే.. త్రిష చూస్తుంది. అతన్ని వెంబడించి టాయిలెట్‌లో దాసిన బ్యాగ్‌ను మరోచోటదాస్తుంది. ఈ విషయం తన పై అధికారికి చెబుతుంది. అతను వచ్చి దాన్ని వేరేచోట దాచేస్తాడు. ఇక ప్రకాష్‌ రాజ్‌ వద్ద తన కొడుకు ఉన్నాడో లేదో చూడాలని వచ్చి... సేఫ్‌ అనుకున్నాక. బ్యాగ్‌ కోసం వెనక్కివెళ్ళిన కమల్‌కు.. బ్యాగ్‌ కన్పించదు.. ఇక ఆ తర్వాత జరిగే డ్రామానే మిగిలిన సినిమా...
 
పెర్‌ఫార్మెన్స్‌... 
కమల్‌ పెర్‌ఫార్మెన్స్‌ గురించి చెప్పేదేముంది. కాప్‌ స్టోరీలు చాలానే చేశాడు. సివిల్‌డ్రెస్‌లో ఉన్న కాప్‌గా సరిపోయాడు. వయస్సు మళ్ళిన ఛాయలు కన్పిస్తున్నా... హుషారుగానే ప్లేచేశాడు. ప్రతి మూమెంట్‌లో తన నటన కనబర్చాడు. ఇక త్రిష పాత్ర కూడా అంతే. ప్రకాష్‌రాజ్‌ డిటోనే. వీరి చుట్టూనే కథ తిరుగుతుంది. కమల్‌ కొడుకుగా. నటించిన కుర్రాడిలో చిన్నతనంలో మహేష్‌బాబు గుర్తుకు వస్తాడు. ఇక మిగిలిన పాత్రలన్నీ మామూలే.
 
టెక్నికల్‌గా....
జిబ్రాన్‌ సంగీతం.. నేపథ్య సంగీతం.. బాగానేవుంది. రాత్రిలో జరిగే సమయంలో కథ గనుక దానికి తగినట్లు బ్యాక్‌గ్రౌండ్‌ ఇచ్చాడు. కెమెరా పనితనం బాగుంది. చాలా సింపుల్‌ స్టోరీ గనుక ఎడిటింగ్‌ ఎటువంటి గందరగోళం లేదు. ఒరిజినల్‌ లొకేషన్లు కాబట్టి సెట్లు వేసే అవకాశం కలగలేదు. కమల్‌ పాడిన బ్యాక్‌గ్రౌండ్‌ సాంగ్‌ చివరల్లో వస్తుంది. అదేమంత అట్రాక్షన్‌గా ఉండదు. క్రైమ్‌ స్టోరీ కాబట్టి పాటలకు అవకాశమే లేదు. డైలాగ్స్‌ పనితనం కూడా పొందికగా ఉంటుంది. 
 
విశ్లేషణ: 
క్రైమ్‌ కథలు ప్రేక్షకులకు కొత్తేమీకాదు. కానీ.. రాత్రిళ్ళు పబ్‌లలో క్లబ్‌లలో జరిగే కథలు ఇలాగే ఉంటాయనేందుకు పెద్ద ఉదాహరణ ఈ చిత్రం. ప్రజలను రక్షించాల్సిన పోలీసు వ్యవస్థలో కొందరు దుండగులతో చేతులు కలుపుతారు. మరికొందరు వృత్తికి న్యాయం చేస్తారు. ఇద్దరి ఆలోచనాపరుల కథ ఇది. దీన్ని స్క్రీన్‌ప్లేలో ఎలా ఆసక్తికరంగా మార్చాడన్నదే ప్రధానం. దాని బాధ్యత కమల్‌ తీసుకున్నాడు. ఇందులో ఎటువంటి సందేశాలు ఉండవు. అయితే.. పోలీసులోనే చెడ్డవారున్నారు. వారు చాలా తెలివిగా ప్రవర్తిస్తారు అనేందుకు ఇది చెప్పడజరిగింది.
 
127 నిముషాల నిడివిగల ఈ చిత్రాన్ని సెన్సార్‌ యు/ఏ సర్టిఫికెట్‌ ఇచ్చింది. అందులో క్రైమ్‌ అంశాలతోపాటు పబ్‌లో కిసింగ్‌ సీన్లు... కమల్‌, మధుశాలిని లిప్‌కిస్‌ల ఉంటాయి. ఇవికూడా సన్నివేశపరంగా తమనుతాము విలన్‌ల నుంచి తప్పించుకునేందుకు చేసినవే.. చిత్రం విడుదలకు ముందు ఈ సీన్లు త్రిషతో అనుకున్నారు. అలాగే పబ్లిసిటీ చేశాడు కమల్‌. ఇక సినిమా గురించి పెద్దగా చెప్పాల్సింది కూడా ఏమీలేదు. సరదాగా ఓ క్రైమ్‌ సినిమా చూశామన్న తృప్తి ఉంటుంది. 
 
ఈ చిత్రం ఫ్రెంచ్‌లో చాలా ఆసక్తికరంగా సాగుతుంది. అయితే ఈ చిత్రాన్ని కమల్‌ చేశారు కాబట్టి.. ఒక్కసారైనా చూడాలనుకుంటారు. మరో హీరో చేస్తే రక్తికట్టేదికాదేమో. మొదటిభాగం ఆసక్తికరంగా సాగుతుంది. రెండోభాగం సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ఇలాంటి సినిమాలు మైండ్‌ గేమకు సంబంధించినవి. కనుక పెద్ద హిట్‌ కాకపోయినా.. ఫర్వాలేదనేలా ఉంది. చాలా సింపుల్‌ బడ్జెట్‌తో తీసిన ఈ చిత్రం వారం రోజులు ఆడితే.. నిర్మాతకు చాలా సేఫ్‌గా ఉంటుంది. అది చాలు...
 
రేటింగ్‌: 3/5