శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By DV
Last Updated : శనివారం, 21 నవంబరు 2015 (12:37 IST)

'కుమారి 21 ఎఫ్' ఓ బ్రోతల్... హీరో ఫ్రెండ్స్ తిరుగుబోతులు...రివ్యూ

కుమారి 21 ఎఫ్ నటీనటులు: రాజ్‌ తరుణ్‌, హెబ్బా పటేల్‌, జోగి బ్రదర్స్‌, సత్య కృష్ణ తదితరులు, కథ, స్క్రీన్‌ ప్లే, మాటలు: సుకుమార్‌, దర్శకత్వం: పల్నాటి సూర్య ప్రతాప్‌, నిర్మాతలు: విజయ్‌ ప్రసాద్‌ బండ్రెడ్డి, థామస్‌ రెడ్డి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌.
 
విడుదల తేది : నవంబర్‌ 20, 2015
 
తెలుగు సినిమాల కథలు కొత్తగా వుండాలంటే ఎక్కడో కథల్ని, సంఘటల్ని బేస్‌ చేసుకుని చేస్తుంటారు. ప్రేమకథలు ముడిసరుకు చాలానే వుంటుంది. ఢిల్లీ, ముంబైలో యువతీయువకులు చాలా ఫాస్ట్‌గా వుంటారు. అందుకే పాస్ట్‌గా వుంది అంటుంటారు. అలాంటి అమ్మాయి తెలుగు ప్రాంతానికి వచ్చి వుంటే ఎలా వుంటుందనేది చిత్రంలో పాయింట్‌. గతంలో ఆర్య, ఆర్య2 వంటి ప్రేమలో భిన్నమైన కోణాల్ని ఆవిష్కరించిన సుకుమార్‌ ఈ చిత్రానికి రచన చేశాడు. తన శిష్యుడిని దర్శకుడిగా మార్చాడు. ఇక ఇప్పుడిప్పుడే లవ్‌ చిత్రాల్లో సక్సెస్‌లు సాధిస్తున్న రాజ్‌ తరుణ్‌ హీరోగా చేసుకున్నాడు. సూర్యప్రతాప్‌ పల్నాటి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి జాతీయస్థాయి అవార్డు గ్రహీత రత్నవేలు, దేవీశ్రీప్రసాద్‌ సంగీతం అందించడం విశేషం. మరి అంతగా పనిచేయడానికి ఈ చిత్రంలో ఏముందో చూద్దాం.
 
కథ :
ఓ కాలనీలో నలుగురు స్నేహితులు. యువకులు కాబట్టి తాగడం, తినడం, అమ్మాయిల్ని ఏడిపించడం, నచ్చితే డబ్బు ఇచ్చి అనుభవించడమే పనిగా పెట్టుకుంటారు. అందులో ఒకడు రాజ్‌ తరుణ్‌. (హీరో కాబట్టి అంత చెడ్డవాడుకాదు) హీరో తండ్రి తన తల్లిని, తనను దూరం చేశాడని కసి. కారణం సరిగ్గా తెలుసుకోడు. ఎవరితోనో బైక్‌లో చూశాననీ, ఇంటికి వస్తే.. ఎవరో అమ్మాయి చెప్పులు మన గుమ్మం ముందు వున్నాయని తల్లి చెప్పేయగానే నమ్మేస్తాడు. అదే అనుమానంతో ఆమె చెప్పాపెట్టకుండా వేరే వచ్చేస్తుంది. పైగా తను నర్సు కూడా. ఇక రాజ్‌ తరుణ్‌ స్నేహితులు తమకిష్టమైన పనులు చేసేస్తుంటారు. కంటికి నచ్చిన అమ్మాయికి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు ఇచ్చి అనుభవించడం లాంటివి అన్నమాట. 
 
అలాంటి బ్యాచ్‌లో వున్న రాజ్‌ తరుణ్‌.. మోడల్‌ అయిన కుమారిని ప్రేమిస్తున్నాడంటే నమ్మరు. ఇప్పటి అమ్మాయిల్లో అసలు లవ్వేలేదు. ఎందరితోనో అన్ని పనులు కానిచ్చేసి వుంటారంటూ మైండ్‌ డైవర్ట్‌ చేస్తారు. సహజంగానే ఆమెపై అనుమానం పుడుతుంది. దానికోసం ఓ టెస్ట్‌ పెట్టడంతో అది బెడిసికొడుతుంది. ఇక ఇద్దరూ దూరమవుతారు. కానీ రాజ్‌ తరుణ్‌ ఆ అమ్మాయి ప్రేమను మర్చిపోలేడు. 
 
మరలా తిరిగి వచ్చినా.. నీకు నన్ను ప్రేమించే మెచ్యూర్టీ లేదని అంటోంది. తను ప్రేమించిన అమ్మాయి ఏం చేసినా ఆమె సుఖం కోసమే తానున్నాననేంత బోల్డ్‌గా ఆలోచించే వ్యక్తే తనకు కావాలని చెబుతుంది. దీంతో రాజ్‌ తరుణ్‌.. మనస్సు మారిపోతుంది. అలాంటి స్థితిలో కుమారి ముంబైలో ఓ బ్రోతల్‌ అనే నిజం బయటపడుతుంది. ఆ తర్వాత రాజ్‌ తరుణ్‌ ఏం చేశాడు? అతని స్నేహితులు ఇతన్ని ఏం చేశారనేది మిగిలిన కథ.
 
పెర్‌ఫార్మెన్స్‌:
ఇందులో నటించడానికి అందరూ నటులే. రాజ్‌ తరుణ్‌ మొదటినుంచి ఒకటే స్టైల్‌. అలానే ఈ సినిమాలో చేశాడు. అతని స్నేహితులు కూడా ఇప్పటి యూత్‌లా బిహేవ్‌ చేశారు. ప్రత్యేకంగా చెప్పాల్సింది హెగ్డాపటేల్‌.. కుమారి పాత్ర చేయడం. ఆమె చాలా బోల్డ్‌గా నటించేసింది. అంతకుముందు మరో నటిని తీసుకుని కొన్ని సీన్స్‌ చేశాక మార్చేశారు. ఇక ఈ కుమారి.. చాలా ఫాస్ట్‌గా వుంటుంది. మందుకొట్టడం, లిప్‌కిస్‌లు ఇవ్వడం, బాయ్‌ఫ్రెండ్స్‌తో కలిసి తిరగడం చాలా క్యాజువల్‌గా చేసేసింది. చిత్రంలో హైలైట్‌ ఆ అమ్మాయిదే. మిగిలిన పాత్రలన్నీ కథకు సపోర్ట్‌గా నిలిచాయి.
 
టెక్నికల్‌గా...
కెమెరా పనితనం రత్నవేలు. ఆయన విజువలైజేషన్‌ బాగుంది. ఎన్నో పెద్ద చిత్రాల్లో పనిచేసిన ఆయన తొలిసారిగా చిన్న చిత్రానికి పనిచేశాడు. దేవీశ్రీప్రసాద్‌ కూడా అంతే. నేపథ్య సంగీతం బాగుంది. 'ఎట్లా ప్రేమించను..' అనే పాటకు మాస్‌బీట్‌ బాగా చేశాడు. బోగంమేళం సాంగ్‌ కూడా బాగుంది. ఇవన్నీ యూత్‌ కోసమే. సంభాషణల పరంగా చాలా కట్స్‌ వున్నాయి.. బూతులు సెన్సార్‌ కట్‌ అయ్యాయి. మిగిలిన డిపార్ట్‌మెంట్‌లు పర్వాలేదు. మాటలపరంగా పంచ్‌ డైలాగ్‌లు అనేవి వుండవు. దర్శకుడు కొత్తవాడయినా.. సుకుమార్‌ మార్క్‌ బాగా కన్పిస్తుంది. కథ, కథనం విషయంలో అది తెలిసిపోతుంది. 
 
విశ్లేషణ
సుకుమార్‌ జీవితంలో జరిగిన కథనే తీసుకున్నాడని చెప్పాడు. హాలీవుడ్‌లో 'ఎ గాళ్‌ నెక్ట్స్‌ డోర్‌' అనే చిత్రానికి స్పూర్తి కాదు అని కూడా ప్రకటించారు. అయితే కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించడం ఈ చిత్రానికి ప్రధాన హైలైట్‌. ఇప్పటివరకు సుకుమార్‌ నుండి ఎన్నో ప్రేమకథలను మనం చూశాం. '1' నేనొక్కడినే అంటూ మహేష్‌తో కొత్తగా చేయించిన ప్రయోగం ఎవ్వరికీ అర్థం కాలేదు. అది మహేష్‌ చేయడం మైనస్‌గా మారింది. అలాగే ఈ చిత్రానికి ఇప్పుడిప్పుడే మంచి పేరుతెచ్చుకుంటున్న రాజ్‌ తరుణ్‌ చేయడం సాహసమే. 
 
ప్రేమ అనేది రెండు మనస్సుల మధ్య ఒక అమ్మాయికి అబ్బాయి గురించి గతం తెలీదు. అలాగే అబ్బాయికి కూడా. కానీ.. ప్రేమ అనేది తనకే దక్కాలి. తనను కాకుండా ఇంకెవరిని ప్రేమించకూడదనేది అబ్బాయిల మెంటాలటీ. అలానే అమ్మాయిలది కూడా. ఇదంతా గతం. ఇప్పటి జనరేషన్‌ అలా లేరు. ఫేస్‌‌బుక్‌ టెక్నాలజీతో ఎంతోమందితో ఫ్రెండ్‌షిప్‌, పబ్‌లకు, షికార్లుకు వెళ్ళడం.. ఏదో నచ్చకపోతే బ్రేకప్‌ చేయడం.. ఇలాంటి తరుణంలో స్వచ్ఛమైన ప్రేమ, పవిత్రత అనే ఓ కుర్రాడికి అన్నీ ఈజీగా తీసుకునే అమ్మాయికి మధ్య జరిగే కథను ఆసక్తికరంగా దర్శకుడు నడిపాడు. కానీ.. ఆ కోవలో కొన్ని సన్నివేశాలు శ్రుతిమించాయి. అదేమంటే.. కథకు అవి వుండాలనేది అతని రూల్‌. 'బాయ్స్‌' చిత్రంలో హైస్కూల్‌ చదివే కుర్రాళ్ళే అమ్మాయిల్తో ఎంజాయ్‌ చేస్తారంటూ చూపించారు. అదే ఇంకా శ్రుతిమించి.. కుమారి 21ఎఫ్‌గా మారింది. 
 
ఇందులో కొన్ని సన్నివేశాలు కుటుంబంతో చూడలేం. కేవలం యువకులు మాత్రమే చూడతగ్గ చిత్రమిది. అలాఅని యువతులు చూడకూడదు అనికాదు. వారుకూడా అంతే మెచ్చూర్డ్‌గా వుంటే చూడొచ్చు. యూత్‌ చెడిపోతున్నారంటూ.. ఇలాంటి కథల్తో సినిమా తీసి దర్శకనిర్మాతలు యూత్‌ జేబుల్ని కొట్టవచ్చవనే ఆలోచనతో సినిమాలు తీస్తున్నారు. అలాంటి ప్రయత్నమే ఈ సినిమా. సిగరెట్‌ తాగితే క్యాన్సర్‌ వస్తుందని... సినిమాలో సన్నివేశం వచ్చినప్పుడుల్లా ఒకటికి రెండుసార్లు ఆ సీన్‌ కింద స్లైడ్‌ వేస్తుంటారు. 
 
అదే సినిమాలో... శ్రుంగారం శ్రుతిమించిన సన్నివేశాలు వుంటే.. దాన్ని గురించి ఎందుకు పట్టించుకోరో అర్థంకాదు. అది ప్రకృతి సహజం అనుకుంటే పొరపాటు... బూతు గురించి చాంతాడంట కథను చెప్పేసి.. అది ఎలా చేస్తున్నారో చూపించేసి... చివరికి చేస్తే ఇలా అవుతారనేది చూపించేసి.. ఇదే సందేశం.. అంటూ తామోదో గొప్ప సినిమా చూపించామని భుజాలు కొట్టుకోవడం చాలా తప్పు. ఆ ప్రభావం సమాజంపై పడుతుంది. ఇప్పటి యూత్‌ చెడిపోతున్నారంటూ సినిమాలే తీయాల్సిన పనిలేదు. అయితే ప్రతిసారి ఇలాంటి చిత్రాలనే ఆదరిస్తారనే గ్యారంటీ లేదు. ఇలాంటి సినిమాలను ఇప్పటి యూత్ చేరదీస్తారో లేదో చూడాలి మరి.
 
రేటింగ్‌: 2/5