గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By DV
Last Modified: శుక్రవారం, 4 నవంబరు 2016 (16:46 IST)

ఆర్పీ 'మనలో ఒక్కడు' మీడియాపై బాణాలు... రివ్యూ రిపోర్ట్

మనలో ఒక్కడు నటీనటులు: ఆర్‌పి. పట్నాయక్‌, అనిత, సాయికుమార్‌, నాజర్‌, శ్రీముఖి, గొల్లపూడి మారుతీరావు, తనికెళ్ళ భరణి, రఘుబాబు, బెనర్జీ, జయప్రకాష్‌రెడ్డి, జెమిని సురేష్‌ తదితరులు నిర్మాత: గురజాల జగన్‌ మోహన్‌, కథ, కథనం, సంగీతం, దర్శకత్వం: ఆర్‌పి పట్నాయక్

మనలో ఒక్కడు నటీనటులు: ఆర్‌పి. పట్నాయక్‌, అనిత, సాయికుమార్‌, నాజర్‌, శ్రీముఖి, గొల్లపూడి మారుతీరావు, తనికెళ్ళ భరణి, రఘుబాబు, బెనర్జీ, జయప్రకాష్‌రెడ్డి, జెమిని సురేష్‌ తదితరులు
 
నిర్మాత: గురజాల జగన్‌ మోహన్‌, కథ, కథనం, సంగీతం, దర్శకత్వం: ఆర్‌పి పట్నాయక్‌, 
 
న్యూస్‌ ఛానల్స్‌ ఎక్కువయ్యాక.. రోజూ ఏదో ఒక కొత్త న్యూస్‌ వస్తూనే వుంటుంది. స్క్రోలింగ్‌ పేరుతో సెస్సేషనల్‌ న్యూస్‌గా బ్రేకింగ్‌ న్యూస్‌గా ఒక విషయాన్ని పదేపదే చూపిస్తూ.. ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకోలేని స్థితిలో ప్రజలు వుండేలా చేస్తుంది ఇప్పటి మీడియా. ఇందుకు మీడియాలోని ఇగోయిస్టుల వల్లే జర్నలిజం విలువలు పడిపోతున్నాయి. ప్రముఖులు, సామాన్యుల్లోని అవినీతిని ఎండగట్టే మీడియాను వారిలో వున్న అవినీతిని కూడా ఎండగట్టాలంటే ఏంచేయాలి.. దానికి ఓ సామాన్యుడు ఏం చేశాడనేది .. మనలో ఒక్కడు అంటూ.. ఆర్‌పి పట్నాయక్‌ ముందు నుంచీ చెప్పాడు. మరి ఆయన చెప్పి దానిలో నిజమెంతో చూద్దాం.
 
కథ : 
కృష్ణమూర్తి (ఆర్‌పి పట్నాయక్‌) ఓ కాలేజీ లెక్చరర్‌. విద్యార్థుల్ని తన పిల్లల్లాగా భావించే రకం. అనిత ఆయన భార్య. ఇంటివద్దే డాన్స్‌ పాటలు బోధిస్తుంది. భార్యభర్తలంటే చుట్టుపక్కలవారికి ఎంతో గౌరవం. మరోవైపు 'మూడో కన్ను' అనే ఛానల్‌ ఓనర్‌ ప్రతాప్‌ (సాయికుమార్‌) ఏదో ఒక సెన్సేషనల్‌ న్యూస్‌ కోసం అడ్డదారులు తొక్కుతుంటాడు. పొలిటికల్‌గా వున్న పెద్ద చేపను పట్టాలనే క్రమంలో ఫెయిలవుతాడు. ఆ సమయంలో అనుకోకుండా.. కాలేజీ అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదుతో లైంగిక వేధింపులకు గురిచేస్తున్న లెక్చరర్‌ కృష్ణమూర్తి అని టీవీల్లో ప్రచారం చేసేస్తాడు. 
 
ఇది తెలిసిన కాలేజీ యాజమాన్యం కృష్ణమూర్తిని తీసేస్తుంది. చుట్టుపక్కలవారూ అసహ్యించుకుంటారు. ఇల్లు గడవని పరిస్థితికి వస్తుంది. ఫిర్యాదు చేసిన అమ్మాయి వద్దకు వెళితే.. అది మీరు కాదని.. ప్రాక్టికల్‌ ల్యాబ్‌ కృష్ణమూర్తని చెబుతుంది. ఆ తర్వాత ఆ అమ్మాయి కన్పించకుండా పోతుంది. ఛానల్‌ వారు తాము చేసిన తప్పును సరిద్దుకునే ప్రసక్తే లేదని తేల్చి చెబుతారు. చిన్ననాటి స్నేహితుడి అండతో తనపై పడిన మచ్చను చెరుపుకోవాలని కృష్ణమూర్తి ఓ నిర్ణయానికి వస్తాడు. అది ఏమిటి? ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగిలిన సినిమా.
 
పెర్‌ఫార్మెన్స్‌ :
నటనాపరంగా అనిత పర్వాలేదు. డాన్స్‌ టీచర్‌గా ఆమె అలరిస్తుంది. ప్రధాన పాత్ర లెక్చరర్‌ కృష్ణమూర్తి. ఆ పాత్రలోని అమాయకత్వం వరకు బాగానే చేశాడు ఆర్పీ. కానీ ఆ పాత్రే హీరోయిజం చూపించాలి కాబట్టి అందుకు తగిన చురుకుదనం లోపించింది. మూడోకన్ను అధినేత.. తనే అందరినీ శాసించే వ్యక్తిగా సాయికుమార్‌ నటన హైలైట్‌గా నిలిచింది. ఎడిటర్‌గా రఘుబాబు ఇప్పటి ఛానల్స్‌ ఎడిటర్లను కళ్ళకు కట్టినట్లు చూపించాడు. కేంద్రమంత్రిగా నాజర్‌ నటించాడు. ముగింపులో ఆయన సాయికుమార్‌తో పాల్గొన్న చర్చ ఆసక్తికరంగా సాగుతుంది. జయప్రకాష్‌ రెడ్డి పాత్ర ఏమీ తెలియనివారు చర్చాగోష్టిలో వున్నట్లుగా చూపించాడు. 
 
టెక్నికల్‌గా... కథ, కథనం, మాటలపై శ్రద్ధ పెట్టాడు. సంభాషణలు అనుకూలంగా సన్నివేశపరంగా వున్నాయి. సంగీతపరంగా మధురం పాట ఆహ్లాదకరంగా వుంది. జేసుదాస్‌ పాడిన మరోపాట వినసొంపుగా వుంది. ఎడిటింగ్‌ ఓకే.
 
విశ్లేషణ :
దర్శకుడే నటుడయితే బాగానే వుంటుంది. రెండింటికి న్యాయం చేయడం పెద్ద పరీక్షే. లెక్చరర్‌గా ఆయన నటించినా.. ఆ పాత్రలోని ఎమోషన్స్‌ను బాగా పండించలేకపోయాడు. ప్రతి న్యూస్‌ను ఛీటింగ్‌ చేస్తూ ఛానల్స్‌ ఎలా మభ్యపెడుతున్నాయనేది.. ఢిల్లీనుంచి ప్రత్యేక విలేకరి అంటూ.. ఓ వ్యక్తి ఇక్కడే చెట్టు కింద వుండి చెప్పడం.. ఇప్పటి ఛానల్స్‌పై సెటైర్‌. అసలు జర్నలిస్టులు సమాజానికి నాలుగో కన్ను. వారు ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలి. నిజాన్ని చెప్పగలగాలి. అలాంటి జర్నలిజం స్వార్థపరుడు, అవినీతిపరుడైన వాడి చేతిలో పడితే ఎలా వుంటుందనేది మూడో కన్ను ఛానల్‌ ఎపిసోడ్‌. పాత బస్తీలో గొడవలు సద్దుమణిగినా.. ఇంకా వున్నట్లే భ్రమింపజేలా వార్తలు వేయడం జర్నలిజాన్ని మెట్టు దించే ప్రయత్నం. అలా అని నిక్కచ్చిగా వున్న సీనియర్‌ జర్నలిస్టు గొల్లపూడి కూడా పెద్ద ఛానల్‌ ముందు నిలబడలేనివాడు. ఏది ఏమైనా.. సమాజంలో జరిగే ప్రతి విషయాన్ని మూలాల్లోకి వెళ్ళి శోధించకుండా పైపైన మెరుగులు చూసేసి దాన్ని బ్రేకింగ్‌ న్యూస్‌గా వేసే ఛానల్స్‌కు చెంపపెట్టులా చిత్ర ముగింపు ఇచ్చాడు ఆర్‌.పి.
 
స్ట్రింగ్‌ ఆపరేషన్ చేసే మీడియాను.. ఓ సామాన్యుడు స్ట్రింగ్‌ ఆపరేషన్‌ చేసి వారు ఎంత ఫూలిష్‌గా వున్నారనేది చెప్పే ప్రయత్నమే ఈ సినిమా. తనపై తప్పుడు వార్తలు ప్రసారం చేసి.. దాన్ని సరిద్దుకునే ప్రయత్నం కూడా చేయకుండా ఇగోతో మరింతగా హర్ట్‌ చేసిన సాయకుమార్‌ లాంటి ఇగోయిస్టులను ఆర్‌పి చెప్పిన ముగింపు మీడియాకు కనువిప్పు కలగాలనే ప్రయత్నం చేశాడు. ఒకరకంగా ఇటువంటి ప్రయోగం పెద్ద సాహసమే. మీడియాలో ఆడవారిపట్ల ఎలా ప్రవర్తిస్తారనేది కూడా చిన్నగా టచ్‌ చేసి చూపించాడు. ఇవన్నీ పలానా జర్నలిస్టు కదా! అనేట్లుగా అనిపిస్తాయి. నిక్కమైన జర్నలిస్టుగా గోయంక పేరును ప్రస్తావిస్తూ.. అలాంటి జర్నలిజం ఇప్పుడు చనిపోయిందంటూ చెబుతాడు. మొత్తంగా ఓ మంచి ప్రయత్నం చేశాడు ఆర్‌పి. ఇటువంటి చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూడవచ్చు.
 
రేటింగ్ ‌: 2.5/5