శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By DV
Last Modified: శుక్రవారం, 16 డిశెంబరు 2016 (19:37 IST)

'నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్'... అంతమందా? రివ్యూ రిపోర్ట్

'కుమారి 21 ఎఫ్‌'లో హెబ్బా పటేల్‌ పాత్ర యువతను పిచ్చెక్కిస్తుంది. సిటీ అమ్మాయంటే చాలా ఫాస్ట్‌గా వుంటుందనీ, పల్లెటూరి అబ్బాయిలయితే మెచ్యూర్డ్‌ లెవల్స్‌ వుండవనీ.. ఈ రెండింటికి భేదాన్ని ఆ చిత్రంలో సుకుమార్‌ చూపించాడు. ఇప్పుడు అదే అమ్మాయి విలేజ్‌ నుంచి సి

'నాన్న నేను నా బాయ్‌ ఫ్రెండ్స్‌' నటీనటులు : హెబ్బా పటేల్‌, తేజస్వి, రావు రమేష్‌, అశ్విన్‌ బాబు, పార్వతీశం, నోయెల్‌, సన తదితరులు, సాంకేతిక విభాగం : ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, సంగీతం: శేఖర్‌ చంద్ర, నిర్మాత : బెక్కెం వేణుగోపాల్‌, కథ- సాయికృష్ణ, స్క్రీన్‌ప్లే-మాటలు: ప్రసన్న కుమార్‌, దర్శకత్వం: భాస్కర్‌ బండి.
 
'కుమారి 21 ఎఫ్‌'లో హెబ్బా పటేల్‌ పాత్ర యువతను పిచ్చెక్కిస్తుంది. సిటీ అమ్మాయంటే చాలా ఫాస్ట్‌గా వుంటుందనీ, పల్లెటూరి అబ్బాయిలయితే మెచ్యూర్డ్‌ లెవల్స్‌ వుండవనీ.. ఈ రెండింటికి భేదాన్ని ఆ చిత్రంలో సుకుమార్‌ చూపించాడు. ఇప్పుడు అదే అమ్మాయి విలేజ్‌ నుంచి సిటీకి వస్తే ఎంత ఫాస్ట్‌గా మారిపోతుంది.. చివరకు పల్లెటూరి ప్రేమలే అసలైన ప్రేమగా తెలియజెప్పే కాన్సెప్ట్‌.. 'నాన్న నేను నా బాయ్‌‌ఫ్రెండ్స్‌'. సినిమా చూపిస్త మావ.. చేసిన బెక్కెం వేణుగోపాల్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు దిల్‌ రాజు ముందుకు రావడంతో ఈ చిత్రంపై మరింత క్రేజ్‌ ఏర్పడింది. 'కొత్త బంగారు లోకం'లా వుందన్న ఆయన మాటలు నిజమా! కాదా! చూద్దాం.
 
కథ : 
రాఘవరావు (రావు రమేష్‌) దంపతులకు చాలాకాలం తర్వాత కూతురు పుడుతుంది. కూతురు పద్మావతి (హెబ్బా పటేల్‌) అంటే పంచప్రాణాలు. ఎడ్డెం అంటే తెడ్డెం అనే రకమని జ్యోతిష్యుడు చెప్పడంతో.. ఎలాగైనా ఆమె కోసం ఎడ్డెమంటే ఎడ్డెం అనేందుకు ఎం.పి. పదవిని త్యాగం చేస్తాడు. కాలేజీ తప్పినా పాసయిందని అబద్ధం చెప్పి తృప్తిపడతాడు. ఉద్యోగం చేయాలనుందని చెబితే హైదరాబాద్‌ పంపిస్తాడు. అక్కడ బంధువైన స్నేహితురాలు తేజస్వి చాలా ఫాస్ట్‌. ప్రియుడ్ని ఈజీగా మార్చేసే రకం. ఐతే తన కుమార్తెకు రాఘవరావు పెండ్లి చేయాలనుకుంటే.. అమెరికాలో ఓ అబ్బాయిని ప్రేమించానని, నాలుగు నెలల తర్వాత అతన్ని పరిచయం చేస్తానని తప్పించుకుంటుంది. అయితే తను చెప్పిన అబద్ధాన్ని నిజం చేయడానికి నెట్‌లో ఏరికోరి ముగ్గురు అబ్బాయిల్ని ఎంపిక చేసి వారితో ఒకరికి తెలీకుండా ఒకరితో ప్రేమాయణం సాగిస్తుంది. వారిలో ఒక్కరినే ఎంపిక చేసుకొనే క్రమంలో కొన్ని పరీక్షలు పెట్టినా.. అందరూ పాస్‌ అవ్వడంతో ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో వున్న టైంలో పద్మావతి అమ్మకి విషయం తెలిసి ఊరికి తీసుకెళుతుంది. ఈ విషయం తెలిసిన ఆమె నాన్న ఏంచేశాడన్నది మిగిలిన కథ. 
 
 
నటీనటులు :
నాన్న పాత్రకు బాగా నటించే అవకాశం దక్కింది. రావు రమేష్‌ కూతురును అమితంగా ప్రేమించే తండ్రిగా జీవించాడు. ప్రియుళ్ళుగా నటించిన అశ్విన్‌ బాబు, పార్వతీశం, నోయెల్‌.. తమ పరిధి మేరకు బాగా చేశారు. తేజస్వి గ్లామర్‌ పాత్రను పోషించింది. జబర్‌దస్త్‌ బ్యాచ్‌ బాగానే కామెడీకి ట్రై చేశారు. షకలక శంకర్‌ దొంగగా మెప్పించే ప్రయత్నంచేశాడు. అయితే వారంతా పవన్‌ కళ్యాణ్‌ పేరును, ఫొటోను పెట్టుకుని ఎంటర్‌టైన్‌ చేయడం విశేషం. 
 
సాంకేతిక వర్గం: 
శేఖర్‌ చంద్ర సంగీతం ఫర్వాలేదు. 'మౌనమా మౌనమా.. వెయిటింగ్‌.. పాటలు ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతం సాదాసీదాగా వుంది. ఛోటా కె.నాయుడు ఛాయాగ్రహణం ఓకే. సాయికృష్ణ కథ రొటీన్‌గానే వుంది. ప్రసన్న కుమార్‌ మాటల్లో కొన్ని ఎన్నదగ్గవి వున్నాయి. ''నా కూతురు అడిగితే ప్రాణం తప్ప ఏమైనా ఇచ్చేస్తా.. ప్రాణం ఎందుకివ్వనంటే తర్వాత తన కోరికల తీర్చడానికి నేనుండాలి కదా''.. లాంటి కొన్ని డైలాగులు ఆకట్టుకుంటాయి. కొత్త దర్శకుడు భాస్కర్‌ బండి ఫర్వాలేదనిపించాడు. కామెడీని.. సెంటిమెంటును మిక్స్‌ చేసే క్రమంలో తడబడ్డాడు. అతను చాలావరకు కమర్షియల్‌ సినిమాల స్టయిల్లో సినిమాను నడిపించాడు.
 
విశ్లేషణ : 
యూత్‌ చిత్రాల పేరుతో ఈమధ్య చాలా చిత్రాలు బూతు చిత్రాలుగా మారిపోతున్నాయి. బయట ఎక్కడో వేళ్ళమీద లెక్కించదగ్గ అమ్మాయిల పాత్రల్ని మరికాస్త ఎక్కువచేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. టైటిల్‌లోనే ఒక అమ్మాయికి ముగ్గురు బాయ్‌ఫ్రెండ్స్‌! ఏమిటి? అనేది దర్శక నిర్మాతలు ప్రేక్షకుల్ని ఆలోచించేలా చేశారు. కథ కూడా సగానికి పైగా అలానే వుంటుంది. పద్మావతి పేరు వల్ల తను పెంచుకున్న పెంపుడు కుక్క పద్మావతి అని పెట్టుకుని.. దెబ్బలు తిన్న జబర్‌దస్త్‌ నటుడు.. విసిగిపోయి.. ఒకే అమ్మాయి ముగ్గురిని ప్రేమించడం ఏమిటి? ఇదేమి శాడిజం.. పిచ్చ పీక్‌కు వెళ్ళిందనేలా డైలాగ్‌లు చెప్పడం.. ఈ చిత్రం కరెక్ట్‌గా సరిపోయింది.
 
అయితే దర్శక నిర్మాతలకు అదే కావాలి. ఏదో కొత్తదనం చూపించాలనే ప్రయత్నంలో తమ ఆలోచనలకు పదునుపెట్టి.. ఈ రకంగా యువత వున్నారంటూ సినిమాలు తీయడం విడ్డూరమే. నెగెటివ్‌గా తన కుమార్తె ప్రయాణిస్తున్నా ఎప్పటికప్పుడు తను గమనిస్తూనే.. ఆ ముగ్గురి బాయ్‌ఫ్రెండ్స్‌ కెరీర్‌ను నిలబెట్టే వ్యక్తిగా రావు రమేష్‌తో ఇప్పించిన ముగింపు సినిమాకు కీలకం. దీన్ని బేస్‌ చేసుకుని రెండుగంటల పాటు కథను సాగదీశారు. 'కొత్తబంగారు లోకం'లో కొడుకంటే ప్రాణంగా ప్రేమించే తండ్రి కళ్ళుగప్పి.. ఆ కొడుకు ఓ అమ్మాయితో లేచిపోయే ప్రయత్నం చేస్తాడు. చివరికి ఏదో మర్చిపోయి తిరిగి వెనక్కిరావడంతో... తండ్రి చనిపోతాడు. ఆ తర్వాత అతనిలోని మార్పు కథకు ప్రాణం పోసింది. ఈ సినిమాలో నాన్న.. పాత్రకు దిల్‌ రాజు కనెక్ట్‌ అయి.. ఆ చిత్రంలో పోల్చినట్లుంది. కథ ప్రకారం ఆ సినిమాలో వున్న డెప్త్‌ ఇందులో వుండదు. 
 
ముగింపు సీన్‌ కోసం మధ్యలో నడిచేదంతా బోరింగ్‌ వ్యవహారమే. ఈ సినిమాలో ఆరంభం.. ముగింపు బాగుండటానికి కారణం రావు రమేష్‌. క్యారెక్టర్‌ మామూలుగా ఉన్నా సరే.. తన నటనతో దానికి ప్రత్యేకత తీసుకురావడానికి ప్రయత్నించే రావు రమేష్‌ ఇందులో కీలకమైన పాత్ర చేయడం సినిమాకు కలిసొచ్చింది. కథనంలో లోపాలున్నా.. కామెడీ పేరుతో లాజిక్‌ లేకుండా ఇష్టానుసారం సన్నివేశాల్ని నడిపించేశారు. చివరికి సెంటిమెంట్‌ అనే ఫీలింగ్‌తో ప్రేక్షకులు థియేటర్‌ నుంచి బయటకు వెళ్లేలా చేశాడు.
 
ఇదిలావుండగా.. తన కూతురు పుట్టింది 3వ తేదీ, మూడో నెల.. చదివే క్లాస్‌ రూమ్‌ 3 నెంబర్‌.. ఆటల్లో మూడో ప్రైజ్‌.. అందుకే ముగ్గురు బాయ్‌ఫ్రెండ్స్‌ అనే లాజిక్కుతో.. ఇలా మూడును సింక్‌ చేస్తూ దర్శకుడు కొత్త ప్రయోగం చేశాడు. కానీ తాళం వేసి గొళ్ళెం మరిచితిని.. అన్నట్లు... అమ్మాయి పేరు పద్మావతి అని నాలుగు అక్షరాలు పెట్టాడు. ముద్దుగా పద్దూ.. అని రెండక్షరాలతో పలికించాడు.
 
ఇక.. మాటిమాటికీ పవన్‌ కళ్యాణ్‌ రెఫరెన్సులు.. పేరడీ పాటలు.. జబర్దస్త్‌ కమెడియన్లతో లాజిక్‌ లేని కామెడీలతో ఏదో అలా అలా సాగిపోతుంది సినిమా. కామెడీ కొన్నిచోట్ల నవ్విస్తుంది. కథను సాగదీయాలి కాబట్టి కథతో సంబంధం లేకుండా కామెడీ బలవంతంగా సాగుతుంది. ఇటు హీరోయిన్‌.. అటు హీరోల పాత్రలు వేటిలోనూ సీరియస్‌‌నెస్‌ వుండదు. వీళ్ల మధ్య ప్రేమాయణాలు కూడా అలాగే ఉంటాయి. సిల్లీ సన్నివేశాలతో సాగుతూ ఉన్నట్లుండి సీరియస్‌ మలుపు తీసుకుంటుంది. అంతవరకు ప్రేక్షకుడు ఆగాలి. ముగింపులో నాల్గవ ప్రియుడు రాజ్‌తరుణ్‌ రాకతో కథ ముగుస్తుంది.
 
 
రేటింగ్ : 2.5/5