శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By DV
Last Modified: శుక్రవారం, 29 జులై 2016 (22:44 IST)

సింప్లిసిటీ 'పెళ్లి చూపులు'.... రివ్యూ రిపోర్ట్

'పెళ్ళిచూపులు' అని పేరుపెట్టి.. కొత్తవారితో సినిమా తీసి సమర్పకులు డి. సురేష్‌ బాబు అనగానే.. ఇదేదో ఇంట్రెస్ట్‌ సినిమా అనే క్రియేషన్‌ సినిమా ప్రియుల్లో వచ్చేసింది. దానికితోడు పోస్టర్స్‌, ట్రైలర్‌తో ఆకర్షించిన సినిమా ఇది. విజయ్‌ దేవరకొండ, రీతూ వర్మ హీరో

పెళ్లి చూపులు నటీనటులు : విజయ్‌ దేవర కొండ, రీతూ వర్మ తదితరులు- సంగీతం : వివేక్‌ సాగర్‌, నిర్మాత : రాజ్‌ కందుకూరి, యాష్‌ రంగినేని, దర్శకత్వం : తరుణ్‌ భాస్కర్‌.
 
'పెళ్ళిచూపులు' అని పేరుపెట్టి.. కొత్తవారితో సినిమా తీసి సమర్పకులు డి. సురేష్‌ బాబు అనగానే.. ఇదేదో ఇంట్రెస్ట్‌ సినిమా అనే క్రియేషన్‌ సినిమా ప్రియుల్లో వచ్చేసింది. దానికితోడు పోస్టర్స్‌, ట్రైలర్‌తో ఆకర్షించిన సినిమా ఇది. విజయ్‌ దేవరకొండ, రీతూ వర్మ హీరో, హీరోయిన్లుగా కొత్త దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ తెరకెక్కించిన ఈ సినిమాను మల్టీప్లెక్స్‌లో ఎక్కువగా విడుదల చేశారు. మిగిలిన థియేటర్లలోనూ వుంది. అయితే కొత్తవారు కాబట్టి పెద్దగా ఓపెనింగ్స్‌ వుండవనీ.. మౌత్‌టాక్‌తోనే సినిమా నడుస్తుందని సురేష్‌ బాబు చెబుతున్నారు. మరి అందులో ఏముందో చూద్దాం.
 
 
కథ :
ప్రశాంత్‌(విజయ్‌ దేవరకొండ)కు చదువు పెద్దగా అబ్బదు. బద్దకస్తుడు. తండ్రి పోరుపడలేక ఏదో చదువుతున్నా... తను పెద్ద చెఫ్‌ కావాలని కోరిక బలంగా వుంటుంది. తండ్రికి చెబితే.. ఎద్దేవా చేస్తాడు. ఇక జీవితం పట్ల ఎటువంటి స్పష్టత లేనట్లు కనిపించే అతడికి పెళ్ళి చేస్తే అయినా అన్నీ కుదురుతాయని కోటి రూపాయల కట్నం ఇచ్చే ఓ ఇంటి సంబంధానికి వెళతారు. ఆ ఇంటిలో డ్రెస్‌పై ఏదో మరకపడిందని ఓ రూమ్‌లోకి వెళతాడు. రూమ్‌లో వున్న చిన్న కుర్రాడు ఆ రూమ్‌ క్లోజ్‌ చేస్తాడు. అంతే అది తెలుసుకోడు. అప్పటికే చిత్ర (రీతూ వర్మ) వస్తుంది. మొత్తం ముగ్గురు ఆ రూమ్‌లో లాక్‌ అవుతారు. ఇదే అదనుగా పెళ్లిచూపులు జరిగిపోతాయి. 
 
ఒకరి ఇష్టాఇష్టాలు తెలుసుకుంటారు. ఫైనల్‌గా ఫుడ్‌ ట్రక్‌ బిజినెస్‌ పెట్టాలనే ఇద్దరు నిర్ణయానికి వస్తారు. సరిగ్గా అప్పుడే మెకానిక్‌ వచ్చి.. డోర్‌ బాగుచేస్తే తలుపు తెరుచుకుంటుంది. ఈలోగా.. తాము వచ్చింది రాంగ్‌ అడ్రెస్‌.. పక్క బజార్‌లో వేరే ఇంటికి వెళ్ళబోయి ఇటువచ్చామని గ్రహించిన ప్రశాంత్‌ తండ్రి.. అతన్ని తీసుకెళతాడు. ఇక ఈ పెళ్లిచూపుల్లో.. పెల్లికూతురు ప్రశాంత్‌కు బాగా నచ్చుతుంది. కోట్ల రూపాయల వ్యాపారాన్ని తన కూతుర్ని ఆమె తండ్రి ఇవ్వడానికి సిద్ధపడతాడు. అయితే చిన్న పరీక్ష పెడతాడు. ఇంతటి వ్యాపారాన్ని డీల్‌ చేయాలంటే ఎంతోకొంత అనుభవంకావాలి కనుక.. ఏదైనా బిజినెస్‌లో అనుభవం సంపాదించి రమ్మంటాడు. ఆ తర్వాత తిరిగి చిత్ర దగ్గరకు  వెళ్ళి తాము మొదట్లో అనుకున్న ఫుడ్‌ట్రక్‌ వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. మరి ఇందులో వారు సక్సెస్‌ అయ్యారా? అయితే.. కోటి రూపాయల సంబంధం ఏమయింది? అనేది మిగిలిన కథ.
 
విశ్లేషణ :
ఇందులో కథ, కథనాలు వినూత్నంగా వుంటాయి. ఈ తరం ఆలోచనలను సరిగ్గా బంధిస్తూ, వాళ్ళ భావోద్వేగాల చుట్టూ ఓ సరికొత్త కథ చెప్పాలన్న దర్శకుడి ఆలోచనను మెచ్చుకోకుండా ఉండలేం. ఎక్కడా వాస్తవికతకు దూరం కాకుండా, ఈ తరం ఆలోచనలను అందరికీ కనెక్ట్‌ అయ్యేలా ఎంటర్‌టైనింగ్‌గా చెప్పడంలో ఈ సినిమా అన్నివిధాలా సఫలమైందనే చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమాలో పాత్రలన్నీ చాలా కొత్తగా ఉన్నాయి. హీరో దగ్గర్నుంచి మొదలుకొని ప్రతి పాత్రకూ ఓ అర్థం ఉండటం, వాటిని సరిగ్గా చెప్పగలగడం ఈ సినిమా సాధించిన విజయాల్లో ఒకటిగా చెప్పాలి. అమాయకత్వంతో కూడిన పాత్రలో విజయ్‌ దేవరకొండ ఇమిడిపోయాడు. ఆధునిక భావాలు గల పాత్రధారిణిగా చిత్ర ఒదిగిపోయింది. ఇక మిగతా సపోర్టింగ్‌ నటులంతా టీవీ నటులే అయినా బాగా నటించారు. 
 
అయితే.. కథ ముందే తెలిసిపోయినా.. దాన్ని కన్వియన్స్‌గా చెప్పడం గొప్ప విషయం. మొదటి భాగం ఏమంత అనిపించదు. కానీ సెకండాఫ్‌లోనే కథ మలుపు తిరుగుతుంది. అదే ఆకట్టుకునేలా చేసింది. స్లో నెరేషన్‌గా వుండడం కూడా ఒకరకంగా కాస్త సహనాన్ని పరీక్షిస్తుంది కూడా. 
 
సాంకేతిక విభాగం :
సాంకేతిక అంశాల పరంగా చూస్తే, ముందుగా దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ గురించి చెప్పుకోవాలి. ఓ రచయితగా, ఓ దర్శకుడిగా సక్సెస్‌ అయ్యాడు. మేకింగ్‌ పరంగా తరుణ్‌ మ్యాజిక్‌ చేశాడనే చెప్పుకోవచ్చు. ఇలాంటి రొమాంటిక్‌ కామెడీకి ఎలాంటి మేకింగ్‌ అవసరమో దాన్ని ఎక్కడా వదిలిపెట్టకుండా, ఏయే సన్నివేశాలు ఎలా తీస్తే ఎక్కువ ఇంపాక్ట్‌ చూపిస్తాయో తెలుసుకుంటూ తరుణ్‌ దర్శకుడిగా మొదటి సినిమాతోనే ఒక స్థాయి తెచ్చుకున్నాడు.
 
సినిమాటోగ్రఫీ బాగుంది. పరిమిత బడ్జెట్‌లో బాగా తీశాడు. డైలాగ్స్‌ విషయంలో సింక్‌ సిస్టమ్‌ అనేదాన్ని ప్రవేశపెట్టి.. టెక్నాలజీని బాగా వుపయోగించుకున్నారు. ఆర్టిస్టులతో మళ్ళీమళ్ళీ డబ్బింగ్‌ చెప్పించకుండా.. ఒకేసారి సెట్లో చెప్పిన డైలాగ్స్‌ను ఎమోషన్స్‌ కాపాడటమే ఈ సింక్‌ సిస్టమ్‌.. గతంలో బ్లాక్‌ అండ్‌ వైట్‌ మూవీల్లో వుండే పాలసీనే. దాన్ని ఇప్పటి టెక్నాలజీతో బాగా డీల్‌ చేశాడు. వివేక్‌ సాగర్‌ అందించిన పాటలు ఫర్వాలేదు. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ మాత్రం చాలా బాగుంది. 
 
ఈ చిత్రం మొత్తంగా చూస్తే.. శేఖర్‌ కమ్ముల ఆనంద్‌.. చిత్రం గుర్తుకు వస్తుంది. ఆ తరహాలోనే నెరేషన్‌ సాగుతుంది. అందులో వున్న నటులే ఇందులో కొద్దిమంది వున్నారు కూడా. రియలిస్టిక్‌గా జరిగే కథలతో సన్నివేశాలతో సినిమాను ఇలా కూడా తీయవచ్చని దర్శకుడు చూపించాడు. కథలు పాత్రలు ప్రొడక్షన్‌ వాల్యూస్‌ కలిపి.. ఇదొక సింప్లిసిటీ చిత్రంగా అనిపిస్తుంది. ఇప్పటి యూత్‌కు బాగా కనెక్ట్‌ అయ్యే సినిమా. పెద్దగా అరుపులు, కేకలు, పంచ్‌ డైలాగ్‌ల కోసం ప్రాకులాటలు ఏమీ వుండవు. సాదాసీదా సంభాషణలతో సాదాసీదాగా తీసిన చిత్రమిది.
 
విడుదల తేదీ : 29 జూలై, 2016
 
రేటింగ్‌ :3/5