శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By PNR
Last Updated : శుక్రవారం, 29 ఆగస్టు 2014 (14:56 IST)

కథలో కొత్తదనం లేదు.. కానీ జిమ్మిక్కులతో ఎన్టీఆర్ 'రభస'

నటీనటులు: ఎన్‌టిఆర్‌, సమంత, ప్రణిత, షిండే, అజయ్‌, జయప్రకాష్‌రెడ్డి, నాజర్‌, బ్రహ్మానందం, జయసుధ తదితరులు
 
సంగీతం: ఎస్‌ఎస్‌ తమన్‌, నిర్మాత: బెల్లంకొండ సురేష్‌, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంతోష్‌ శ్రీనివాస్‌.
 
పాయింట్‌: ఆడవాళ్ళ మనస్సు దోచుకునేవాడే మగాడు 
 
జూ ఎన్టీఆర్ సినిమాలన్నీ విడిపోయిన రెండు కుటుంబాలని కలిపేస్తే అందుకు ఒక్కోసారి త్యాగాలు చేసేస్తూ కథలు వస్తుంటాయి. ఆయన కూడా అలాంటివే ఎంచుకుంటాడు. 'రభస' విషయంలోనూ అదే జరిగింది. దానికి చిన్నపాటి ఉపకథలు కూడా జాయిన్‌ అవుతాయి. తనకేమాత్రం సంబంధం లేని ఇద్దరు బద్ధ శత్రువులను కూడా ఒక్క డైలాగ్‌తో మార్చేస్తాడు. ఇలాంటి ఫార్మెట్‌లు చాలా సినిమాల్లోనూ వచ్చాయి. హీరోలు మారారు. కాగా, వినాయకచవితి రోజున విడుదలైన 'రభస' చిత్రం ఏమాత్రం కొత్తగా అనిపించదు. కానీ మాస్‌ ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేయడానికి రకరకాల జిమ్మిక్కులు చేయిస్తూ 'కందిరీగ' దర్శకుడు సంతోష్‌ శ్రీనివాస్‌ ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం ఎలా ఉందో చూద్దాం. 
 
కథ:
నెల్లూరులో పెద్దిరెడ్డి (జయప్రకాష్‌ రెడ్డి), గంగిరెడ్డి (నాగినీడు)లు ప్రజలకు చెందాల్సిన వెయ్యి ఎకరాల భూముల్ని ఆక్రమించేస్తూ పెత్తనం చలాయిస్తారు. లాయర్‌ (భరణి) రూల్‌ప్రకారం ఇరు కుటుంబాలు కుండమార్పిడిలు చేసుకుంటే గొడవే ఉండదు. కానీ సరిగ్గా పెంళ్లి పీటల మీదున్న పెద్దిరెడ్డి కుమార్తెను ఆమె స్నేహితురాలు ఇందు (సమంత) చేసిన ఒక్క ఫోన్‌కాల్‌తో కార్తీక్‌ (ఎన్టీఆర్‌) వచ్చి రసాభాస చేసేసి ఆమెకు ఇష్టంలేని పెళ్లిని వాయిదా వేస్తాడు. 
 
దాంతో అహంమీద కొట్టిన కార్తీక్‌ కోసం ఇరు కుటుంబాలకు చెందిన గ్యాంగ్‌ వెతుకుతుంటుంది. మరోవైపు కార్తీక్‌కు పెండ్లిచేయాలని ఊరిలోని పెద్దలంతా తమ కుమార్తెకివ్వాలని వస్తే, అమ్మ (జయసుధ) కోరిక మేరకు తన మామ (షిండే) కుమార్తె సింధును కోడలిగా తీసుకురావడానికి సిద్ధమవుతాడు. అలా హైదరాబాద్‌ వెళ్ళి మేయర్‌ పదవి కోసం ఆరాటపడే షిండేకు బ్రేక్‌ లేస్తూ... అడుగడుగునా అడ్డంకిగా మారతాడు కార్తీక్‌. చివరికి ఇందు ప్రేమ కోసం కాలేజీ వెళ్ళి కొత్త అవతారం ఎత్తుతాడు. విషయం తెలిసిన షిండే తన కుమార్తెను రక్షించుకోవడానికి పెద్దిరెడ్డి గ్యాంగ్‌ సాయం కోరతాడు. ఇక అక్కడ నుంచి కథ మరో మలుపు తిరుగుతుంది? అది ఏమిటి? అనేది మిగిలిన సినిమా.
 
నటీనటులు:
సినిమాకు హీరోనే ప్రధానం అందుకే ఎన్‌టిఆర్‌ ప్రతి ఫ్రేమ్‌లోనూ కన్పిస్తూ కథను తన భుజాలపై మోసేస్తాడు. ఇందులో స్మార్ట్‌గా కన్పించాడు. నటన, ఫైట్స్‌, డాన్స్‌లో తన ముద్ర చూపించాడు. రెండో భాగంలో బ్రహ్మానందంతోనూ విలన్లతోనూ చేసే బకరా పనులు మాస్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తాయి. సమంత అల్లుడు శ్రీను మించి గ్లామర్‌ను చూపించింది. నటన కూడా అంతేగా వుంది. ప్రణీత.. గెస్ట్‌క్యారెక్టర్‌గా నటిస్తుంది. రొటీన్‌గా ఎవరో ఒకరు బకారా కావాలి కనుక బ్రహ్మానందంతో పని కానిచ్చేశారు. రెండు గ్యాంగ్‌ల నటులు కథనంలో వారి పాత్రల మేరకు చేసేశారు. జయసుధ నటన మామూలే. నాజర్‌, షిండేలు కూడా డిటోనే.
 
టెక్నికల్‌గా...
శ్యామ్‌ కె నాయుడు కెమెరా పనితనం, సంగీతం, పాటలు ఫర్వాలేదు. తమన్‌ బాణీలు చెప్పుకోదగినగా లేకపోయినా థియేటర్‌లో వినడానికి ఓకే.  రామ్‌లక్ష్మణ్‌లకు ఈ సినిమాలో చాలా పని దొరికింది. అడుగడుగునా యాక్షన్‌ సన్నివేశాలున్నాయి. సుమోలు గాలిలో ఎగరడాలు బాంబ్‌ బ్లాస్ట్‌లు, కాలితో నేలపై కొడితే.. మనుషులు ఫుట్‌బాల్‌గా ఎగిరిపోవడాలు.. ఓహో.. ఒక్కటేమిటి... మాస్‌ కళ్ళకు విందులా ఉంటుంది. చిత్రంలో ప్రధానంగా ఎడిటర్‌ కోటగిరి వెంకటేశ్వరరావు కూడా పెద్ద పనే. కథనంలో రకరకాల పాత్రలు, ఉపకథలు కూడా వుంటాయి. వాటినన్నింటినీ సరిగ్గా కూర్చి చాలామటుకు ట్రిమ్‌ చేయడం ఆయనకే చెల్లింది. 
 
విశ్లేషణ:
కథను ఎలా చెప్పి ఒప్పించాడో దర్శకుడు కానీ.. ఎన్‌టిఆర్‌ ఎంచుకున్న కథ చాలా రొటీన్‌. దానికి తగిన మసాలా, యాక్షన్‌, సెంటిమెంట్‌ను కలిపి సినిమాగా తీసేశాడు. కందిరీగ తర్వాత చేస్తున్న చిత్రం కనుక దర్శకుడు కూడా గత చిత్రం ఛాయలున్న కాన్సెప్ట్‌నే చెప్పినట్లుంది. మొత్తంగా ఈ చిత్రం 'రచ్చ', 'రామయ్యా వస్తావయ్యా', 'మిర్చి' వంటి కొన్ని చిత్రాలను కలగలిపి తీసినట్లుగా ప్రేక్షకుడికి తెలిపోతుంది. సంబాషణలపరంగా హీరోయిజం చూపించాలనే.. ఆఫర్‌ ఇచ్చినప్పుడే తీసుకుంటే భరోసా. లేదంటే 'రభస' వంటి డైలాగ్‌లు నిదర్శనంగా కన్పిస్తాయి. 
 
అసలు యాక్షన్‌ సీన్స్‌పై పెట్టిన శ్రద్ధ కథ, కథనంపై పెద్దగా పెట్టలేదు. అందుకు కారణం. సినిమా ఆరంభం నుంచి రెండె నెలల పాటు దర్శకుడు అనారోగ్యంతో వాయిదా వేశారనీ, కాదు కాదు.. ఆ ఎపిసోడ్స్‌ ఎవరో తీశారనే వార్తలూ విన్పించాయి. ఇంతోటి కథను మరో దర్శకుడా అని అనిపించకమానదు. ఏది ఏమైనా ఫ్యాన్స్‌ను మాస్‌ను అలరించేందుకు కథే అవసరంలేదు. అల్‌రెడీ చూసిన కథల్నే అటూ ఇటూగా మార్చేసి.. బ్రహ్మానందం అనే బకరాతోనూ కరడుకట్టిన విలన్‌లతోనూ ఆడుకునే హీరోయిజం ఉన్న హీరో అయితేచాలు అనుకున్నట్లు సినిమా తీయగల దర్శకుడు నిర్మాతలు ఉన్నారు. తెలుగులో ఇంతకంటే కథలు లేవని డేట్స్‌ వుంటే చాలు సినిమా తీవచ్చనే దర్శక నిర్మాతలున్నంతవరకు ఇటువంటి రసాభస కథలు వస్తూనే వుంటాయి. అభిమానులు చూస్తేనే వుంటారు. ఎక్కడో ఓ చోట చెక్‌ పెట్టకపోతే... తెలుగువారికి ఇలాంటివి భరించాల్సిందే.