శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By DV
Last Modified: శుక్రవారం, 27 నవంబరు 2015 (15:48 IST)

ఇంతకీ స్వీటీ ''సైజ్ జీరో'' చెప్పిందేమిటి...? రివ్యూ రిపోర్ట్

సైజ్ జీరో నటీనటులు : అనుష్క, ఆర్య, సోనాల్ చౌహాన్, మారుతీరావు, ప్రకాష్ రాజ్, ఊర్వశి, పావని గంగిరెడ్డి, అలీ తదితరులు. సాంకేతికవర్గం... సంగీతం: కీరవాణి, ఛాయాగ్రహణం: నిరవ్ షా, రచన: కనికా థిల్లాన్, నిర్మాత: పరమ్.వి.పొట్లూరి. దర్శకత్వం: ప్రకాష్ రావు కోవెలమూడి.
 
విడుదల తేది: 27/11/2015
 
అనుష్క అనగానే ఇప్పుడు మనకు గుర్తుకువచ్చే చిత్రాలు "బాహుబలి, రుద్రమదేవి". ఈ చిత్రాల ద్వారా దేశవ్యాప్తంగా క్రేజ్‌ను సొంతం చేసుకుంది అనుష్క. తాజాగా ఈ శుక్రవారం నాడు 'సైజ్ జీరో' చిత్రంతో అనుష్క ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహించారు. మరో విశేషమేమిటంటే ఈ చిత్ర కథను ఆయన సతీమణి కనికా థిల్లాన్ సమకూర్చడం. పైగా పొట్లూరి వి పరమ్ నిర్మాత అంటే ఇక చిత్రం ఎక్కడికో వెళ్లిపోతుందని అనుకుంటారు. ఇన్ని అంచనాల మధ్య విడుదలైన సైజ్ జీరో ఎలా ఉందో చూద్దాం.
 
 
కథ: 
మంచి మనసు కలిగిన అమ్మాయి స్వీటి (అనుష్క). ఐతే ప్రతి ఒక్కరికీ ఏదో సమస్య ఉన్నట్లే ఈమెకీ ఓ సమస్య. అదేమిటంటే... అధిక బరువు. ఈమె అధిక బరువు కారణంగా పెళ్లి కావడం లేదని ఆవేదన చెందుతూ ఉంటుంది. ఐతే ఓ రోజూ స్వీటీకి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. అలా పెళ్లి చూపుల్లో కలుసుకొన్న స్వీటీ, అభి (ఆర్య) ఒకరినొకరు ఇష్టపడకపోయినప్పటికీ మంచి స్నేహితులుగా మారుతారు. ఈ క్రమంలో అభిపై ఆమెకు ప్రేమ కలుగుతుంది. 
 
ఈ విషయం తనకు చెప్పాలనుకునేలోపే అమెరికా నుంచి సంఘసేవ చేయడానికి భారతదేశానికి వచ్చిన సిమ్రాన్‌(సోనాల్ చౌహాన్)తో ప్రేమలో పడతాడు. వాళ్లిద్దరూ అలా ప్రేమలో పడిపోవడంపై స్వీటీ బాధపడిపోతూ తన భారీతనం కారణంగా అభి తనను పట్టించుకోలేదనీ, తనను ప్రేమించడం లేదని అనకుని సన్నబడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగా సత్యానంద్ (ప్రకాష్ రాజ్)నిర్వహించే "సైజ్ జీరో" క్లినిక్‌కు వెళుతుంది. 
 
ఐతే అదే క్లినిక్‌లో స్వీటీ స్నేహితురాలు జ్యోతి(పావని గంగిరెడ్డి) బరువు తగ్గడం కోసం వాడే "ఫ్యాట్ బర్నర్స్" కారణంగా లివర్‌తోపాటు కిడ్నీలు కూడా పాడవుతాయి. దీనితో "సైజ్ జీరో" క్లినిక్ పేరిట సత్యానంద్ అందర్నీ మోసం చేస్తున్నాడని ప్రజలకు చాటిచెప్పాలని నిర్ణయించుకుంటుంది స్వీటీ. ఈ విషయంలో అభి, సిమ్రాన్ సహాయాన్ని కూడా తీసుకోవాలని అనుకుంటుంది. ఈ క్రమంలో సత్యానంద్ ఆటను స్వీటీ కట్టించిందా...? స్వీటీ ప్రేమను అభి తెలుసుకున్నాడా...? సిమ్రాన్ ఏమయ్యింది..? స్వీటీ సైజ్ జీరో సైజును సాధించిందా...? తెలుసుకోవాలంటే సైజ్ జీరో చిత్రాన్ని చూడాల్సిందే.
 
నటీనటుల పనితీరు: 
అనుష్క నటన గురించి వేరే చెప్పక్కర్లేదు. ఏ పాత్రనైనా అద్భుతంగా చేయడం ఆమెకు వెన్నతోపెట్టిన విద్య. తన పాత్ర మేరకు బాగా నటించింది. లావుగా ఉన్నప్పటికీ చాలా అందంగానే కనిపించింది. అభి పాత్రలో ఆర్య ఫర్వాలేదు. సిమ్రాన్ పాత్రలో సోనాల్ చౌహాన్ అందాలతో ఆకట్టుకొంది. స్వీటీ తల్లి పాత్రలో ఊర్వశి నటించింది. అలాగే తాత పాత్రలో సీనియర్ నటులు మారుతీరావు, "సైజ్ జీరో" సత్యానంద్‌గా ప్రకాష్ రాజ్ తదితరులు తమతమ పాత్రలకు న్యాయం చేసారు. అలీ, భరత్‌లు కామెడీ ప్రేక్షకులకు నవ్వు తెప్పించదు. 
 
సాంకేతికవర్గం: కీరవాణి బాణీలు వినసొంపుగా ఉన్నాయి. నిరవ్ షా కెమెరా పనితనం ఫర్వాలేదు. ఇకపోతే కనిక థిల్లాన్ సమకూర్చిన కథ రొటీన్ కథే. ఫస్టాఫ్‌‍లో ఫర్వాలేదు అనిపించినా సెకండాఫ్‌లో నత్తనడకలా సాగింది. దర్శకుడిగా ప్రకాష్ రావు కోవెలమూడి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడనిపిస్తుంది. ముఖ్యంగా సైక్లింగ్ ఎపిసోడ్స్ ఆడియన్స్ సహనానికి పెద్ద పరీక్షలా అనిపిస్తాయి. అమ్మాయి లావుగా ఉన్నా పర్లేదు మంచి మనసు ఉంటే చాలనే భావన ఫస్టాప్‌లో కల్పించాడు. ఐతేసెకండాఫ్‌కు వచ్చేసరికి సన్నబడితే తప్ప పెళ్లవ్వదు అనే విషయానికి మద్దతు పలికినట్లు అనిపిస్తుంది. మొత్తంగా చూస్తే సైజ్ జీరో చిత్రంలో క్లారిటీ మిస్ అయినట్లుంది.
 
 
విశ్లేషణ: 
 
"సైజ్ జీరో" చిత్రం ద్వారా దర్శకుడు ఏం చెప్పదలుచుకున్నాడో అర్థంకాక ప్రేక్షకులు తికమకపడతారు. బరువు తగ్గితే ఏమిటి... తగ్గకపోతే ఏమిటి... సైజ్ జీరో ఖచ్చితంగా కావాల్సిందేనా... వంటి ప్రశ్నలు, ప్రశ్నలుగా ఉంటాయి. ఐతే బరువు పెరిగినా వన్నె తగ్గని అనుష్క అందాలు, నటన కోసం... అక్కడక్కడా ద్వంద్వార్థ సంభాషణలు దొర్లినప్పటికీ హాస్యం కోసం సైజ్ జీరోను ఓసారి చూడవచ్చు.
 
రేటింగ్: 2.5/5