శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By DV
Last Updated : శుక్రవారం, 20 మార్చి 2015 (18:04 IST)

కూతురు ప్రేమలో పడుతుందేమోనని కుర్రాడ్ని పంపిస్తే... 'తుంగభద్ర' రివ్యూ రిపోర్ట్

తుంగభద్ర మూవీ నటీనటులు: ఆదిత్‌, డిరపుల్‌, సత్యరాజ్‌, కోట శ్రీనివాసరావు, రవివర్మ, పవిత్ర లోకేష్‌, జబర్దస్త్‌ శ్రీను, నవీన్‌ తదితరులు, కెమెరా: రాహుల్‌ శ్రీవాత్సవ్‌, సంగీతం: హరి గౌర, ఎడిటింగ్‌: అమ్మిరాజు, సమర్పణ: సాయి శివాని, నిర్మాత: రజని కొర్రపాటి, రచన, దర్శకత్వం: శ్రీనివాసకృష్ణ గోగినేని.
 
విడుదల తేదీ: 20.03.2015
 
సినిమా అంటే ఇప్పటి ట్రెండ్‌ను బట్టి ఎంతోకొంత ఎంటర్‌టైన్మెంట్‌ వుండాల్సిందే. రోజూ జరిగే, చదివే వార్తల్నే తీసుకుని రకరకాలుగా కథలు అల్లి తీసుకున్న చిత్రాలే వస్తున్నాయి. అయితే అందులో ఎక్కువగా గ్రామ హత్యలు, రక్తపాతాలు వంటివాటితో చాలా చిత్రాలే వచ్చాయి. ఫైనల్‌గా ఎవరి కోసం ఎవరు చస్తున్నారు. ఎందుకు చావాల్సి వస్తుంది. ఇదంతా కరెక్టేనా? అంటూ సందేశాలు ఇవ్వడం మామూలై పోయింది. అలాంటి ప్రయత్నమే వారాహి చలనచిత్రం చేసింది. అదే తుంగభద్ర. ఊహలు గుసగుసలాడే వంటి సరదా చిత్రాన్ని తీసిన ఈ సంస్థ ఈసారి సీరియస్‌ మూవీ తీసింది. అదెలా వుందో చూద్దాం.

 
కథ: రామరాజు(సత్యరాజ్‌) తాటికొండ గ్రామంలో ఓ వర్గానికి అధిపతి. మరో వర్గం ప్రత్యర్థి అయిన పైడితల్లి(కోట శ్రీనివాసరావు)ను ఓడిస్తాడు. ఎలక్షన్‌ టైమ్‌లో జరిగిన గొడవల్లో పైడితల్లి తండ్రి అయిన చలపతిరావును చంపేస్తాడు రామరాజు. దాంతో పగప్రతీకారాలు పెంచుకుంటారు. ఓసారి దాడి చేస్తారు. కానీ తప్పించుకుంటాడు రామరాజు. రామరాజుకు నమ్మినబంటుగా వుండే కుర్రాడు శ్రీను(ఆదిత్). ఏపని చేసినా శ్రీను చేత చేయిస్తాడు. అయితే కూతురు గౌరి(డింపుల్‌) కాలేజీలో చదువుతుంటే ఎవరో కుర్రాడితో చనువుగా వుంటుందని అదేమిటో చూడమని శ్రీనుకు పురమాయిస్తాడు. కానీ అది కాస్త శ్రీను, గౌరిల ప్రేమకు దారితీస్తుంది. కాగా, మరోసారి ఎన్నికలు రామరాజుకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. దాంతో పైడితల్లి పవర్‌లోకి వస్తాడు. అప్పటివరకు పగతో రగిలిపోతున్న పైడితల్లి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు? శ్రీను, గౌరిల ప్రేమ ఫలించిందా? వారిద్దరి ప్రేమను రామరాజు అంగీకరించాడా? అనేది మిగతా కథ.
 
పెర్‌ఫార్మెన్స్‌: 
సత్యరాజ్‌ పెర్‌ఫార్మెన్స్‌, అక్కడక్కడా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌. అక్కడక్కడా కామెడీ, సినిమాలోని చివరి 20 నిముషాలు ఈ చిత్రానికి వున్న ప్రధాన ఆకర్షణలు. శ్రీనుగా ఆదిత్‌ ఫర్వాలేదు. అయితే తమిళ నేటివిటీకి బాగా సూటయ్యే పాత్ర. సినిమా కూడా అలానే వుంటుంది. 
 
విశ్లేషణ 
ఈ సినిమా కథ పెద్ద గొప్ప కథకాదు. ఇప్పటివరకు ఇలాంటి సినిమాలు ప్రేక్షకులు చూసిచూసి విసిగివేసారి వున్నారు. మళ్ళీ వారిపై ఇలాంటి కథను తీసుకొచ్చి రుద్దడం ఎంతమాత్రం సమంజసం కాదు. సినిమా చూస్తున్నంతసేపు 'యజ్ఞం' సినిమానే గుర్తుకువస్తుంది. కథలో బలం లేకపోవడంతో రెండుగంటల సేపు థియేటర్‌లో కూర్చోవడం ఆడియన్స్‌కి కష్టమైన పనే అనిపిస్తుంది. కాకపోతే ఈ సినిమా మొత్తానికి చివరి 20 నిముషాలు మాత్రమే చెప్పుకోదగిందిగా వుంది. ఇందులో హీరోది అంతగా ఇంపార్టెన్స్‌ లేని క్యారెక్టర్‌. స్మార్ట్‌గా వున్న హీరోకి గడ్డం పెంచేసి మాస్‌ లుక్‌ తేవాలని ట్రై చేసినా అది ఎంతమాత్రం వర్కవుట్‌ అవ్వలేదు. 
 
అతని గెటప్‌కి తగ్గట్టు బాడీ లాంగ్వేజ్‌ లేకపోవడం కూడా ఆ క్యారెక్టర్‌కి మైనస్‌ అయింది. ఇక గౌరి క్యారెక్టరైజేషన్‌ కూడా సరిగ్గా లేకపోవడం, ఒక్కో సందర్భంలో ఒక్కోలా బిహేవ్‌ చెయ్యడం కూడా ఆడియన్స్‌ని కన్‌ఫ్యూజ్‌ చేస్తుంది. కూతురు ప్రేమలో పడిందేమోనన్న డౌట్‌తో తన దగ్గర పనిచేసే కుర్రాడిని ఆమె వెంట పంపించడం ఎంతవరకు కరెక్టో ఆ తండ్రికే తెలియాలి. 
 
ఈ ప్రాసెస్‌లో బస్సులు ఎక్కడం, దిగడంతోనే సగం సినిమా గడిచిపోతుంది. మధ్యమధ్య మనకు ఏమాత్రం నవ్వు రాని కామెడీ సీన్స్‌తో వీలైనంత విసిగించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్‌. కామెడీ లేకపోగా స్లో నేరేషన్‌ వల్ల ఎక్కడి కథ అక్కడే ఆగిపోతుంది. ప్రీ క్లైమాక్స్‌కి వచ్చేసరికి హీరో, హీరోయిన్ల క్యారెక్టర్స్‌ ఎండ్‌ అయిపోయి సత్యరాజ్‌ క్యారెక్టర్‌ మెయిన్‌ అయిపోతుంది. దాంతో హీరో క్యారెక్టర్‌ తేలిపోయింది. హరి గౌర మ్యూజిక్‌ అంతంతమాత్రంగా వుంది. అక్కడక్కడా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మాత్రం ఫర్వాలేదనిపించాడు. టెక్నికల్‌గా సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ బాగుంది.
 
ఒక మూస కథతో ప్రారంభమై స్లో నేరేషన్‌తో నడుస్తూ ఫస్ట్‌ హాఫ్‌ అయిందనిపించుకొని సెకండాఫ్‌లో కాస్త స్పీడందుకొని చివరి 20 నిముషాలు మాత్రమే సినిమా మీద ఇంట్రెస్ట్‌ కలిగించగలిగాడు డైరెక్టర్‌. కథలో, కథనంలో ఏమాత్రం కొత్తదనం లేని సినిమా ఇది. ఒక కొత్త సినిమా చూడాలనుకునేవారికి ఈ సినిమా ఎంత మాత్రం నచ్చదు. చాలా సినిమాల్లోని సన్నివేశాలు కలిపి ఒకే సినిమాలో చూస్తున్న ఫీలింగ్‌ మనకు కలుగుతుంది. కొన్ని సీన్స్‌ ఎందుకు జరుగుతున్నాయో కూడా అర్థం కాని స్థితిలో మనం సినిమా చూడాల్సి వస్తుంది. 
 
హీరో క్యారెక్టర్‌కిగానీ, హీరోయిన్‌ క్యారెక్టర్‌కి గానీ ఇవ్వాల్సినంత ఇంపార్టెన్స్‌ ఇవ్వలేదు. ఆ మాటకి వస్తే ఏ క్యారెక్టర్‌కీ సరైన ఇంపార్టెన్స్‌, ఒక పర్పస్‌ అనేది లేదు. సినిమాలో కేవలం సత్యరాజ్‌ పాత్ర తప్ప ఏ క్యారెక్టరూ మనకి కనెక్ట్‌ అవ్వదు. కథ విషయంలోగానీ, కథనం విషయంలోగానీ డైరెక్టర్‌ ఎలాంటి కేర్‌ తీసుకోలేదని అర్థమవుతుంది. హీరోయిన్‌ ఒక్కో సీన్‌లో ఒక్కోలా కనిపిస్తుంది. కొన్ని సీన్స్‌లో ఆమె మొహంలోని హావభావాలు ఏమిటో హీరోకి అర్థం కావు, మనకీ అర్థం కావు. 
 
ఫైనల్‌గా చెప్పాలంటే తుంగభద్ర పేరుతో ఓ కొత్త సినిమా వచ్చిందని వెళ్ళే వారికి పాత సినిమా చూశామన్న ఫీలింగ్‌ కలగక మానదు. ఇటువంటి సినిమాలు బ్లాక్‌ అండ్‌ వైట్‌ చిత్రాల నుంచి వస్తున్నవే. కొత్తగా రామ్‌గోపాల్‌ వర్మ చూపించాడు. అదే తరహాలో తన ట్రెండ్‌ చూపించాలనుకునే కొత్త దర్శకుడు శ్రీను. ఇటువంటి గ్రామక్షక్షల నేపథ్యంలో వచ్చాయి కాబట్టి అక్కడి వారికి నచ్చుతుందేమో కానీ.. మిగిలిన చోట్ల కష్టమే..
 
రేటింగ్‌: 2/5