20 ఏళ్ల క్రితం తప్పు చేస్తే నాకు అండగా బన్నీ నిలబడ్డారు : బన్నీ వాస్
పాలకొల్లు నుంచి సాదాసీదా యానిమేటర్ వచ్చి.. ఇప్పుడు ఇలా ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోతో సినిమా చేశానంటే ఏదో జన్మలో ఏదో పుణ్యం చేసుకున్నాననిపిస్తుంది. నేను పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమానిని. ఎంత అదృష్టం ఉంటే.. ఆయన పొలిటికల్ జర్నీలో నేను భాగం అయి ఉంటాను. పబ్లిసిటీ తక్కువగా ఉందని అంతా అన్నారు. కానీ నాకు అవసరం వచ్చిన ప్రతీ సారి ఆయన నా వెంట ఉంటాడు. నేను కష్టంలో ఉన్నానంటే నా అమ్మ, నా స్నేహితుడు బన్నీలకు తెలుస్తుంది.. వాళ్లే సాయం చేసేందుకు ముందుకు వస్తారు అని నిర్మాత బన్నీ వాస్ అన్నారు.
నార్నే నితిన్, నయన్ సారికలు హీరో హీరోయిన్లు GA2 పిక్చర్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్యా కొప్పినీడు నిర్మాతలుగా వస్తోన్న చిత్రం ఆయ్. ఈ సినిమాకు అంజి కే మణిపుత్ర దర్శకత్వం వహించారు. ఆగస్ట్ 15న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బన్నీ వాస్ మాట్లాడారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ, నార్నే నితిన్ గారు లేకుంటే ఈ సినిమా ఇక్కడకు వరకు వచ్చేది కాదు. ఇది ముగ్గురు కుర్రోళ్లు కథ. ఈ కథ నచ్చి ఆయన ముందుకు వచ్చారు. నితిన్ మా అందరితో ఎంతో చక్కగా కలిసిపోయారు. పిఠాపురంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేద్దామని అనుకున్నాం. మా హీరోని ఆ విషయం అడగడం మర్చిపోయా. ఒకసారి ఎన్టీఆర్ గారిని అడిగి చెప్పండని అన్నాను. ఆ నిర్మాతకి, ఆ సినిమాకు ఉపయోగపడుతుందంటే ఏం చేసినా పర్లేదు అని ఆయన అన్నారు. అలా సినిమా వరకే విషయాన్ని చూడటం అంటే మామూలు విషయం కాదు.
నేను అడగక ముందే నా సినిమా ట్రైలర్‌ను బన్నీ గారు సోషల్ మీడియాలో షేర్ చేశారు. 20 ఏళ్ల క్రితం నేను ఒక తప్పు చేస్తే..నా కోసం అల్లు అరవింద్ గారికి ఎదురు నిలబడి నాకు అండగా బన్నీ నిలబడ్డారు. బన్నీ లేకపోయి ఉంటే బన్నీ వాస్ అనే వాడు ఉండేవాడు కాదు. షూటింగ్ ఉన్నా కూడా మా ఈవెంట్‌కు వచ్చిన శ్రీలీల గారికి థాంక్స్. ఇది నా బ్యానర్, నా సినిమా నేను కచ్చితంగా వస్తాను అని నిఖిల్ భయ్యా అన్నారు. రియాజ్, భాను గార్లు ఈ కథను నా వద్దకు తీసుకొచ్చారు. జాతి రత్నాలు చూసి చాలా కుళ్లుకున్న. ఈ కథను విన్నప్పుడు నాకు అదే గుర్తొచ్చింది. జాతి రత్నాలు, మ్యాడ్ లేకపోయి ఉంటే ఈ కథను ఇలా తీసే వాళ్లం కాదు. మా చిత్రం ఆగస్ట్ 15న రాబోతోంది. అందరూ చూడండి అని అన్నారు.