శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 26 సెప్టెంబరు 2020 (10:04 IST)

రాంగోపాల్ వర్మ 'దిశ.. ఎన్‌కౌంటర్‌'‌ ట్రైలర్ రిలీజ్ (Trailer)

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసును ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓ మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఈ కేసులో నలుగురు నిందితులు హైదరాబాద్ నగర పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. ఈ ఘటన ఆధారంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తోన్న సినిమా 'దిశ.. ఎన్‌కౌంటర్‌'‌ నుంచి ట్రైలర్ విడుదలైంది. 
 
దిశను నలుగురు యువకులు ఎత్తుకెళ్లడం, అత్యాచారం చేయడం, ఆపై లారీలో తీసుకెళ్లి, ఓ వంతెన కింద పెట్రోల్ పోసి తగులబెట్టడం వంటి ఘటనలకు సంబంధించిన అంశాలు ఉత్కంఠభరితంగా ఉన్నాయి. ఆపై విచారణ నిమిత్తం పోలీసులు రావడం వరకు వర్మ ఈ ట్రైలర్‌లో చూపించారు. 
 
ఈ సినిమాను నట్టి కరుణ సమర్పణలో అనురాగ్‌ కంచర్ల ప్రొడక్షన్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఆనంద్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. 'దిశ' ఘటన జరిగిన నవంబర్‌ 26 తేదీనే ఈ సినిమాను విడుదల చేస్తానని వర్మ ఇప్పటికే తెలిపారు. 
 
కాగా, హైదరాబాద్ నగరానికి చెందిన ఓ పశువైద్యురాలిని నలుగురు కామాంధులు దారుణంగా అత్యాచారం జరిపి, హత్య చేసిన విషయం తెల్సిందే. ఇది దేశంలో పెను సంచలనమైంది. ఈ ఘటన తర్వాత అత్యాచారాలకు పాల్పడేవారి కోసం దిశ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో కఠిన చట్టాలు వచ్చాయి. ముఖ్యంగా, ఏపీలో దిశ పేరుతో పోలీస్ స్టేషన్లు కూడా ప్రారంభించడం జరిగింది.